జూదం కేరాఫ్‌ తాడిపత్రి !!

7 Jul, 2017 02:35 IST|Sakshi
జూదం కేరాఫ్‌ తాడిపత్రి !!

పట్టణంలో జోరుగా జూదం
మున్సిపాలిటీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో పేకాట
అధికారపార్టీ నేతల కనుసన్నల్లోనే కార్యకలాపాలు
ఆత్మహత్య చేసుకున్న రామసుబ్బారెడ్డి పేకాట బాధితుడే
జూదంతో వేలాది కుటుంబాలు ఛిన్నాభిన్నం
అన్నీ తెలిసినా పట్టించుకోని పోలీసులు


అనంతపురం : రామసుబ్బారెడ్డి వైఎస్సార్‌ జిల్లా కొండాపురం మండలం కోడూరు వాసి. వ్యవసాయంతో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవాడు. ఆధ్యాత్మిక చింతన ఉన్న వ్యక్తి. భార్య సులోచనతో పాటు ప్రసన్న, ప్రత్యూష, ప్రతిభ సంతానం. కొన్ని కారణాలతో నాలుగేళ్ల కిందట తాడిపత్రికి వచ్చి స్థిరపడ్డాడు. సొంతిళ్లు కొనుగోలు చేసి ఉన్నంతలో బాగానే ఉండేవాడు. అయితే కొద్దిరోజుల్లోనే పేకాట ఉచ్చులో చిక్కుకున్నాడు. ఆస్తులు పోగొట్టుకున్నాడు. ఇళ్లు అమ్మేశాడు. అయినా ఆట ఆగలేదు. అప్పులు తలకు మించిన భారమయ్యాయి. రుణదాతల ఒత్తిడి ఎక్కువైంది.

దీంతో భార్య పేరుమీదున్న  భూమి విక్రయించేందుకు సిద్ధమపడగా... ఆమె ససేమిరా అంది. ‘‘పేకాటతో రోడ్డున పడ్డాం. ఉన్న పొలం అమ్మితే ముగ్గురు ఆడపిల్లల గతేంటి?’’ అని వారించింది. ఈ అంశంపై రోజూ ఇంట్లో గొడవ.. అప్పులోళ్ల ఒత్తిడి తాళలేక మంగళవారం రాత్రి మద్యం సేవించి భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. తిరుపతిలో చదువుతున్న ప్రసన్ననూ పిలిచారు. సమయానికి రాలేకపోవడంతో బతికిపోయింది. అనాథగా మారింది.

-ఈ ఒక్క ఉదాహరణ చాలు తాడిపత్రి ప్రజల జీవితాలను పేకాట ఎలా ఛిన్నాభిన్నం చేస్తోందో తెలుసుకోవడానికి. ఈ ఘటన తర్వాత సీఎంతో సహా రాష్ట్రవ్యాప్తంగా అందరూ రామసుబ్బారెడ్డి కుటుంబంపై సానుభూతి వ్యక్తం చేశారు. రామసుబ్బారెడ్డిని ఛీదరించుకున్నారు. కానీ అసలు ఈ కుటుంబం ఛిన్నాభిన్నం అయ్యేందుకు దారితీసిన పరిస్థితులు....కారకుల గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు.

వ్యసనాలకు అడ్డా తాడిపత్రి
రాష్ట్రంలోనే ‘బెస్ట్‌ మున్సిపాలిటీ తాడిపత్రి’ అని అక్కడి పాలకులు ఊదరగొడుతుంటారు. రోడ్ల వెడల్పు చేసి... ప్లాస్టిక్‌ను నిషేధించి తాడిపత్రి అగ్రగామిగా నిలిపామని చంకలు గుద్దుకుంటున్నారు. కానీ సామాన్యుడు ప్రశాంతంగా, సంతోషంగా, స్వేచ్ఛగా జీవించగలిగే పరిస్థితులు కల్పించలేకపోయారు. మొన్నటిదాకా తాడిపత్రి ప్రజలకు తాగునీటి వసతిని కూడా అక్కడి ఏలికలు కల్పించలేకపోయారు. ఇలాంటి తాడిపత్రిలో పేకాట, మట్కా, క్రికెట్‌బెట్టింగ్‌ మాత్రం జిల్లాలో ఎక్కడా లేని విధంగా యథేచ్ఛగా సాగుతోంది. పొరుగు జిల్లాలైన కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల నుంచి పేకాటరాయుళ్లు తాడిపత్రికి వస్తుంటారంటే ఇక్కడ జూద ఏస్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. 

ఆటకు రూ.వంద నుంచి రూ.లక్ష వరకూ చెల్లించి ఆడుతున్నారు. రోజూ లక్షల రూపాయల్లో ఇక్కడ పేకాట నడుస్తోంది. అక్కడి మున్సిపాలిటీ పాలకవర్గంలోని ఓ ప్రజాప్రతినిధి పేకాటను తన కనుసన్నల్లో నడిపిస్తున్నాడు. ఇతని ఇంట్లో కూడా పేకాట నడుస్తున్నట్లు తెలుస్తోంది. గ్రానైట్‌ పరిశ్రమ విస్తరించడం, సిమెంట్, స్టీలు కర్మాగారాలు ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేవారు ఎక్కువగా ఉంటారు. ఆర్థికలావాదేవీలు కూడా అధికంగా జరుగుతుంటాయి. దీన్ని ఆసరగా చేసుకుని అధికారపార్టీనేతలు తమ అనుచరులతో పేకాటను ఆడిస్తున్నారు. దీన్ని కూడా ఆదాయమార్గంగా ఎంచుకున్నారు. ఇక ప్రొద్దుటూరు పక్కనే ఉండటంతో క్రికెట్‌ బెట్టింగ్‌ కూడా అధికంగా నడుస్తోంది. అనంతపురం జిల్లాలో జరిగే బెట్టింగ్‌ మొత్తం తాడిపత్రి కేంద్రంగానే నడుస్తోంది.
 
పోలీసుల నిస్సహాయత
తాడిపత్రిలో ఎవరు పేకాట ఆడిస్తున్నారు? ఎవరు మట్కా నిర్వహిస్తున్నారు? బెట్టింగ్‌ బుకీలు ఎవరు? అనే సంగతి అక్కడి పోలీసులకు పేరుపేరునా తెలుసు. అయినా ఎలాంటి చర్యలు ఉండవు. ఎందుకంటే ఇక్కడి పోలీసులు ఏమాత్రం జోక్యం చేసుకున్నా... తాడిపత్రిలోని ఓ పెద్దమనిషి నుంచి ఫోన్లు వస్తాయి. ఆయన పీఏ, ఆ పెద్దమనిషి కంటే మరింత రుబాబు చేస్తారు. వీరి దారికొస్తే నెలనెలా మామూళ్లు ఇస్తారు.. దారికి రాకపోతే బదిలీని బహుమానంగా ఇస్తారు... ఇక్కడ ఎవ్వరు పనిచేయాలన్నా ‘పెద్దింటిసిఫార్సు’ తప్పనిసరి! దీంతోనే ఇక్కడ జూదాలకు అడ్డుకట్ట పడలేకపోతోంది. నూతన ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న అశోక్‌కుమార్‌ తాడిపత్రిపై తన మార్క్‌ను చూపిస్తే వేలాది కుటుంబాలకు మేలు చేసినవారవుతారు.

అధికారులు కన్నెతి చూడడం లేదు
తాడిపత్రిలో మట్కా, గ్యాంబ్లింగ్‌ విచ్చలవిడిగా జరుగుతోంది. ఈ మూడేళ్లలో మరీ విపరీతమైంది. ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ జేసీ సోదరులే కావడంతో అధికార పెత్తనం పెరిగిపోయింది. అధికారులెవరూ తాడిపత్రి వైపు కన్నెత్తి చూడకుండా ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా గ్యాబ్లింగ్‌ పెరిగి అనేక  కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి.  కలెక్టర్, పోలీసులు స్పందించి తాడిపత్రితో పాటు జిల్లా వ్యాప్తంగా అధికార పార్టీ కనుసన్నల్లో నడుస్తున్న పేకాట, గ్యాంబ్లింగ్‌ను కూకటివేళ్లతో పెకిలించాలి.
– శంకరనారాయణ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

అధికారులు వెనకంజ వేస్తున్నారు.
తాడిపత్రి ప్రాంతంలో మాట్కా, గాంబ్లిగ్‌ విచ్చలవిడిగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవఽడం లేదు. ఇతర ప్రాంతాల్లో కట్టడికి చర్యలు తీసుకుంటూ, ఇక్కడ మాత్రం నిర్లిప్తంగా ఉంటున్నారు. అన్నింటిలో మేము అంటూ ముందుకు వచ్చే స్థానిక ప్రజాప్రతినిధులూ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక్కడ నడుస్తున్న జూదాన్ని నియంత్రించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలి. అలా కాకుండా మిన్నకుండి పోతే గ్లాంబ్లిగ్‌ నిర్వాహకులతో వారికి సంబంధాలున్నాయని అభిప్రాయపడాల్సి వస్తుంది.
– డి.జగదీశ్, సీపీఐ జిల్లా కార్యదర్శి

మరిన్ని వార్తలు