‘అధికార’ జూదం

18 Sep, 2017 22:03 IST|Sakshi
‘అధికార’ జూదం
  • ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు
  • గ్యాంగ్‌ మాస్టర్‌ వదిలి పెట్టిన వైనం
  • గుంతకల్లు రూరల్‌:  అధికార పార్టీ నేతల ధన దాహానికి అంతు లేకుండా పోతోంది. ఆఖరుకు జూదాలను సైతం ప్రోత్సహిస్తూ.. జనం సొమ్మును దోచేస్తున్నారు. ఇందుకు పోలీసులను పావులుగా వాడుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వివరాల్లోకి వెళితే.. గుంతకల్లు మండలంలోని నాగసముద్రం శివారులో మూడు రోజుల క్రితం భారీ ఎత్తున జూదం జరుగుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించి, 20 మంది జూదరులను, రూ. 2 లక్షలకు పైగా సొమ్ము, 14 సెల్‌ఫోన్‌లు, ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నాగసముద్రం గ్రామానికి చెందిన ఓ అధికార పార్టీ కన్నుసన్నల్లోనే స్థావరాలను మార్చిమార్చి ఇక్కడ పేకాట నిర్వహిస్తున్నట్లు పట్టుబడిన వారే పేర్కొంటున్నారు.

    జూదంతో పాటు అధిక వడ్డీకి డబ్బు

    నాగసముద్రం గ్రామానికి చెందిన టీడీపీ నేత.. ప్రతి రోజూ పేకాటరాయుళ్లకు అధిక వడ్డీలకు డబ్బు అప్పుగా ఇవ్వడంతో పాటు వారితో పరిచయాలు పెంచుకున్నారు. అనంతరం దీనినే వృత్తిగా మార్చుకున్న అతను పదేళ్లుగా కర్ణాటకలోని బళ్లారి తదితర ప్రాంతాల్లో గ్యాంబ్లింగ్‌ స్థావరాలతో సంబంధాలు పెట్టుకుని అక్కడ తన వడ్డీ వ్యాపారాన్ని విస్తరించాడు. ఈ ‍క్రమంలోనే మూడేళ్ల క్రితం రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ అండతో నాగసముద్రం శివారులోని  వంకలు, చింతలాంపల్లి సమీపంలోని ఈదుల్లో, పామిడి మండలం ఇలా తరచూ స్థావరాలు మారుస్తూ పేకాట ఆడిస్తూ వచ్చాడు. ఇతని నిర్వహణలో తమకు పోలీసుల నుంచి ఎలాంటి హాని ఉండదని తెలుసుకున్న పేకాటరాయుళ్లు క్రమంగా అతని పంచన చేరుతూ వచ్చారు.

    సకల సౌకర్యాలతో.. : గుంతకల్లు, గుత్తి, పామిడి, కల్లూరు, తరిమెల, అనంతపురం, బళ్లారి తదితర ప్రాంతాల నుంచి నిత్యం 30 నుంచి 40 మందికి పైగా జూదరులు ప్రతి రోజూ ఇతని స్థావరానికి చేరుకునేవారు. వీరితో ఒక్కొక్కరి నుంచి రోజుకు రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు వసూలు చేసుకుంటూ వారికి భోజనం.. ఇతర సౌకర్యాలను సదరు టీడీపీ నేత సమకూర్చేవాడు. ఇతని నేతృత్వంలోని పేకాట స్థావరాల్లో ప్రతి రోజూ రూ. 20లక్షల నుంచి రూ. 30 లక్షల వరకూ చేతులు మారేవని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 13న సాయంత్రం కచ్చితమైన సమాచారం అందుకున్న గుంతకల్లు రూరల్‌ పోలీసులు దాడులు నిర్వహించి,  20 మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నిర్వాహకుడు ఎవరనే విషయాన్ని రాబట్టుకుని అదే రోజు రాత్రి 10.30 గంటలకు సదరు వ్యక్తి ఇంటిపై సోదాలు చేపట్టారు. అయితే అప్పటికే అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే అధికార పార్టీ సీనియర్‌ నాయకుల చేత ఫోన్లు చేయించి, తర్వాత వెళ్లి పోలీసులను కలిసినట్లు సమాచారం.  ఒత్తిళ్లు పెరిగిపోవడంతో సదరు వ్యక్తిని పోలీసులు కేసు నుంచి తప్పించినట్లు పట్టుబడిన జూదరులు బాహటంగానే పేర్కొంటున్నారు. 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు