గాంధీ పార్కు పట్టించుకోరా?

22 Sep, 2016 21:30 IST|Sakshi
గాంధీ పార్కులో విగ్రహం ముందు నిలిచిన నీరు
  • నిలిచిన వర్షపు నీరు
  • పట్టించుకోని నగర పంచాయతీ పాలకవర్గం
  • జోగిపేట: జోగిపేటలో ఉన్నది గాంధీ పార్కు ఒక్కటే. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఈ పార్కు నిరాదరణకు గురవుతుంది. కేవలం 15వ అగస్టు, 26 జనవరిలలో మాత్రమే గేట్లు తెరచి పతాకావిష్కరణ చేసి మళ్లీ మూసేస్తారు. పార్కులో శుభ్రత విషయంలో పట్టించుకునే పరిస్థితి లేదు. పార్కులోకి వెళుతుండగా ఎదురుగా గాంధీ విగ్రహన్ని అప్పట్లో ఏర్పాటు చేశారు. విగ్రహం ముందు నీరు నిలవడంతో  కనీసం నిలబడే పరిస్థితిలేదు. ఖాళీ ప్రదేశంలో కూడా వర్షపు నీరు నిండిపోయింది. చెట్లు వంగిపోయాయి.

    జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఈ పార్కు అభివృద్ధి కోసం పాలకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పార్కులను అభివృద్ధి చేపసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నా అధికారులు, పాలకవర్గాలు సరైన శ్రద్ధ కనబరచడం లేదన్న విమర్శలున్నాయి. పార్కులో నీడనిచ్చే చెట్లు ఎన్నో ఉన్నాయి. పరిశుభ్రంగా లేకపోవడంతో దుర్గంధం వస్తుంది. సంవత్సరంలో రెండు సార్లు మాత్రమే పార్క్‌ను తెరవడంతో ఆదరణ కోల్పోతుంది.

    పార్కులో బెంచీలు, విద్యుత్‌ లైట్లు ఏర్పాటు చేసి ప్రతి రోజు తెరచుకుంటే బాగుంటుందని స్థానికులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్కు నిర్వాహణకు నగర పంచాయతీ సిబ్బందిని ఏర్పాటు చేస్తే బాగుంటుది. పార్కులో వేల చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉంది. జోగిపేట నగర పంచాయతీ పాలకవర్గం పార్కు అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు.

    గాంధీ పార్కును అభివృద్ధి చేయాలి
    జోగిపేటలోని  గాంధీ పార్కును అన్ని విధాలా అభివృద్ధి చేయాలి. పట్టణంలో ఇదే ముఖ్యమైన పార్కు,. పార్కులో అన్ని వసతులు కల్పించాలి. విద్యుత్‌లైట్లు ఏర్పాటు చేయాలి. మధ్యాహ్నం వేళలో పార్కులో కూర్చునే విధంగా సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి. నగర పంచాయతీ నుంచి నిధులను విడుదల చేయాలి. చాలా సంవత్సరాలుగా పార్కు నిరాదరణకు గురవుతుంది. - రామకృష్ణ, జోగిపేట

    చర్యలు తీసుకుంటాం
    గాంధీ పార్కులో చేరిన వర్షపునీటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. గాంధీ పార్కు అభివృద్ధికి సంబంధించి పాలకవర్గం దృష్టికి తీసుకువస్తాం. పార్కులో పారిశుద్ధ్య సమస్య లేకుండా చూస్తాం. ప్రతిరోజు సిబ్బందితో శుభ్రం చేయిస్తాం. గాంధీ పార్కులో ఇతర సౌకర్యాల ఏర్పాటుకు సంబంధించి పాలకవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. - రాజ్‌భరత్‌, ఏఈ నగర పంచాయతీ జోగిపేట

మరిన్ని వార్తలు