గణేష్ విగ్రహాల ధరలకు రెక్కలు

1 Sep, 2016 22:35 IST|Sakshi
గణేష్ విగ్రహాల ధరలకు రెక్కలు

సాక్షి,సిటీబ్యూరో: వినాయక నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తుండటంతో నగరంలో పండుగ కళ కనిపిస్తోంది. వైవిధ్య రూపాల్లో. ఆకట్టుకొనే రంగుల్లో తీర్చిదిద్దిన వినాయకులు రకరకాల  భంగిమలు. అనేక అవతరాల్లో మార్కెట్‌లో సందడి చేస్తున్నాడు. మరో మూడు రోజుల్లో  కొలువుదీరనుండటంతో బొజ్జగణపయ్య చిన్న విగ్రహాలు మొదలుకొని  భారీ విగ్రహాల  వరకు  వేలాదిగా అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు విగ్రహాల కొనుగోలుకోసం ధూల్‌పేట్‌కు తరలి వస్తున్నారు. గత రెండు నెలలుగా విగ్రహాల తయారీలో నిమగ్నమైన ధూల్‌పేట్‌ కళాకారులు  ఒకవైపు విగ్రహాలకు తుదిమెరుగులు దిద్దుతూనే మరోవైపు విక్రయాలకు సిద్ధం చేస్తున్నారు. 

కాగా గత సంవత్సరం కంటే  ఈ ఏడాది  గణనాధుల ధరలు  బాగా  పెరిగాయి. గతంలో  రూ.10 వేలకు లభించిన విగ్రహాన్ని  ఈ ఏడాది  రూ.15 వేలకు  విక్రయిస్తున్నారు. కళాకారుల జీతాలు, ముడిసరుకు ధరలు, రవాణా ఖర్చులు, గోడౌన్‌ల అద్దెలు భారీగా పెరిగినందునే విగ్రహాల ధరలు పెంచాల్సి వచ్చిందని  వ్యాపారులు పేర్కొంటున్నారు. ధరల కారణంగా దీంతో  కోరుకున్న విగ్రహాలను కొనుగోలు చేయలేకపోతున్నామని  మండపాల నిర్వాహకులు  అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఏటా సృజనాత్మకతకు పదునుపెడుతూ  అద్భుతమైన విగ్రహాలను రూపొందించే  ధూల్‌పేట కళాకారులు ఈ ఏడాది కూడా వివిధ రకాల  ఆకృతులలో అందమైన విగ్రహాలను  తయారు చేశారు.  రూ.2 వేల నుంచి రూ.2 లక్షలకు పైగా విలువైన విగ్రహాలు  అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. విభిన్నంగా, వినూత్నంగా విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. శివాజీగా, శ్రీకృష్ణుడిగా, తిరుపతి వెంకటేశ్వరుడిగా, రాధా సమేతుడైన గోపాలుడిగా ఆకట్టుకుంటున్నాడు.

అర్ధనారీశ్వరుడి  సమక్షంలో  కొలువైన బొజ్జ గణపయ్య, అంగరక్షకులు, సేవకుల  సమక్షంలో మందిరంలో కొలువైన దేవదేవుడు, షిరిడీ సాయిబాబా, ముంబయి గణేశుడిగా, మూషికవాహనుడు,  స్పైడర్‌మెన్‌గా, ప్రధాని నరేంద్రమోదీ ధరించే తలపాగా తరహాలో  అలంకృతుడై...  నవరాత్రి ఉత్సవాల్లో కొలువుదీరేందుకు సిద్ధమయ్యాడు.

ధూల్‌పేట్‌ నుంచి ఏటా తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒరిస్సా, మహారాష్ట్ర, తదితర రాష్ట్రాలకు  విగ్రహాలను  ఎగుమతి చేస్తున్నారు. ఈ ఏడాది ఆస్ట్రేలియాకు కూడా వినాయక విగ్రహాలను  ఎగుమతి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సుమారు 200 కార్ఖానాల్లో విగ్రహాలను అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. గత ఏడాది 18 అడుగుల  విగ్రహం ధరS  రూ.65వేలు ఉండగా, ఈసారి ఏకంగా  రూ.85 వేలకు  పెరిగింది. 16 అడుగుల విగ్రహాలకు  రూ.70 వేల వరకు చెబుతున్నారు. గత సంవత్సరం  రూ. 45  వేలకు లభించిన భారీ  విగ్రహాలు ఈ  సారి  రూ.60 వేలకు పెంచడంతో కొనుగోలుదారులు బిత్తరపోతున్నారు. 15 అడుగు విగ్రహాన్ని కొనేందుకు వచ్చిన వారు 10 అడుగులతో సరిపెట్టుకుంటున్నారు.

మరిన్ని వార్తలు