నయీమ్ భూకబ్జా కేసు మళ్లీ వాయిదా

1 Oct, 2016 22:18 IST|Sakshi
నయీమ్ భూకబ్జా కేసు మళ్లీ వాయిదా

భువనగిరి: గ్యాంగ్‌స్టర్ నయీమ్ భూకబ్జా కేసును భువనగిరి ఆర్డీఓ వచ్చేనెల 19వ తేదీకి వాయిదా వేశారు. భువనగిరి మండలంలోని బొమ్మాయిపల్లిలోని సర్వే నంబర్ 722, 723, 724తో పాటు 733 వరకు ఉన్న భూమిపై నమోదైన భూ కబ్జా కేసు వివాదంపై ఆర్డీఓ ఎంవీ భూపాల్‌రెడ్డి శనివారం తన కార్యాలయంలో విచారణ చేపట్టారు. పట్టాదారులైన లక్ష్మీనరసింహనగర్ కాలనీ అసోసియేషన్‌కు చెందిన 200 మంది సభ్యులు విచారణకు హాజరై తమకు తమ ప్లాట్లను ఇప్పించాలని ఆర్డీఓను కోరారు. ఈ మేరకు 2003-04 సంవత్సరంలో హక్కుదారుగా ఉన్న లక్ష్మీనరసింహనగర్ కాలనీ వారినే పట్టదారులుగా చేర్చుతూ ఆర్డీఓ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

తమకు ప్లాట్లు ఇప్పించాలని కాలనీ వాసులు ఆర్డీఓను కోరగా తదుపరి విచారణ జరిగే సమయానికి సంబంధిత ప్లాట్లు, భూములపై తమకు ఉన్న హక్కులను, వాటికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సమర్పిస్తే వారికి ప్లాట్లను ఇప్పిస్తామని ఆర్డీఓ ఎంవీ భూపాల్‌రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు నాలుగు వాయిదాలు జరిగాయి. మొదటిసారి జూలైలో, రెండోసారి ఆగస్టులో, మూడోసారి సెప్టెంబర్ నెలలో 3న విచారణ, నాలుగోసారి అక్టోబర్ 1న విచారణ జరగగా మళ్లీ నవంబర్ 19కి వాయిదా పడినట్లు చెప్పారు. ఈ విచారణ కార్యక్రమంలో తహసీల్దార్ కె. వెంకట్‌రెడ్డి, అసోసియేషన్ కార్యదర్శి పులికంటి నరేష్, యాకుబ్, కాశీశ్వర్, రాజేందర్, మల్లేష్, శ్యాంసుందర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు