ఇదీ రిమాండ్ రిపోర్టు!

12 Aug, 2016 10:44 IST|Sakshi
నయీం ఇంటి నుంచి స్కాటీని స్వాధీనం చేసుకుంటున్న పోలీసులు

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్‌కౌంటర్ అనంతరం ఏమి జరిగింది.. పోలీసులు ఏయే వస్తువులు.. ఎంత డబ్బును స్వాధీనం చేసుకున్నారు. తదితర ప్రశ్నలు ఇంకా తలెత్తుతూనే ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు పేర్కొన్న రిమాండ్ రిపోర్ట్ ఇలా ఉంది.

జరిగింది ఇలా..
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లికి చెందిన ఓ రియల్టర్‌ను గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఫోన్ చేసి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు డిచ్‌పల్లి సీఐ తిరుపతయ్య నయీమ్ ఫోన్‌కాల్‌పై దృష్టి సారించాడు. ఈ క్రమంలో నయీమ్ షాద్‌నగర్‌లోని తన ఇంటికి వస్తున్నాడని తెలుసుకున్న సీఐ తిరుపతయ్య సిబ్బందితో నయీమ్ వాహనాన్ని వెంబడించాడు. అదే సమయంలో గ్రే హౌండ్స్ బలగాలను ముందుగానే నయీమ్ ఇంటి వద్దకు పంపించారు.

నయీమ్ భార్య అసీనా బేగం, అక్క సలీమా బేగం ముందు హోండా అమేజ్ కారులో షాద్‌నగర్ ఇంటికి చేరుకున్నారు. వెనుక ఫోర్డ్ ఇండీవర్ కారులో నయీమ్ అతని అనుచరులు నలుగురితో కలసి షాద్‌నగర్ వస్తుండగా ఇంటీ సమీపంలోనే గ్రే హౌండ్స్ బలగాలు అడ్డుకున్నాయి. విషయం గ్రహించిన నయీమ్ పోలీసులపై కాల్పులు జరుపుతూ పారిపోవడానికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన బలగాలు ఎదురు కాల్పులు జరుపగా నయీమ్ అక్కడికక్కడే మృతిచెందాడు. నయీమ్ వెంట ఉన్న అనుచరులు ఘటనా స్థలం నుంచి పారిపోయారు.
 
లభించిన వస్తువులు..
అనంతరం పోలీసులు నయీమ్ ఇంట్లో, బయట సోదాలు చేశారు. తుపాకులు, డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. సలీమా బేగం వద్ద ఒక స్టెన్‌గన్, అసీనా బేగం వద్ద రెండు ఏకే 47లు, అబ్దుల్ మతీన్ వద్ద రివాల్వర్, నయీమ్ వద్ద 1 పిస్టల్, 1 ఏకే 47తో పాటు మూడు మ్యాగజెన్‌లు స్వాధీనం చేసుకున్నారు. వెపన్ ఆర్మ్స్(బుల్లెట్లు) ఏకే 47వి 250, పిస్టల్‌వి 132, రివాల్వర్‌వి 60, చిన్న రివాల్వర్‌వి 80, 3.8 రివాల్వర్‌వి 50 స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా 17 సెల్‌ఫోన్‌లు, 54 ఒరిజినల్ డాక్యుమెంట్లు, లింకు డాక్యుమెంట్లు 121 వరకు స్వాధీనం చేసుకున్నారు.

జిలిటెన్ స్టిక్స్, డిటోనేటర్‌లతో పాటు రూ. 3,74,660 నగదు, ఐదున్నర తులాల బంగారం, హోండా అమేజ్, ఫోర్ట్ ఇండీవర్ కారు, ఒక స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన డాక్యుమెంట్లకు సంబంధించి మార్కెట్‌లో వాటి విలువ  రూ.14 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. భువనగిరి, గడ్డి అన్నారం, జూపార్కు, శంషాబాద్, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు