ఆయన సూపర్ ఎమ్మెల్యే..

25 Aug, 2015 09:34 IST|Sakshi
ఆరోవార్డులో పర్యటిస్తున్న గంటా శ్రీనివాసరావు బంధువు, పార్టీ కార్యకర్తలు

గంటా బంధువు హల్‌చల్
ఆయన వెంట అధికారులు
ఇద్దరు టీచర్లుకు షోకాజ్‌లు


సాగర్‌నగర్ : భీమిలి నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు సమీప బంధువు ఒకరు ఎమ్మెల్యే తరహాలో వ్యవహరిస్తున్నారు. ఆరో వార్డులో అధికారులను వెంటేసుకుని ప్రజా సమస్యలపై  సోమవారం పర్యటించి కలకలం రేపారు. అధికారం లేని ఆయన వెంట అధికారులు పాల్గొని జీ హుజూర్ అన్నారు. ఆ వివరాలివి. నియోజకవర్గానికి పార్టీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న పరుచూరి భాస్కరరావు అధికారిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం పరిపాటిగా మారింది. సోమవారం ఆరో వార్డులోని పర్యటించారు. ఎండాడ బీసీ, ఎస్సీ, ఎస్టీ కాలనీలు, వరహాగిరినగర్, శాంతినగర్, రాజీవ్‌నగర్ ప్రాంతాలను సందర్శించారు. గొల్లల ఎండాడ ప్రాథమిక పాఠశాలకు వెళ్లి సమయానికి ఉపాధ్యాయులు రాకపోవడంతో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట కృష్ణారెడ్డికి ఫోన్ చేశారు. టీచర్లు సమయానికి స్కూళ్లు తెరవలేదు.. మంత్రిగారితో చెప్పి చర్యలు తీసుకోమంటారా? అని హెచ్చరించారు. దీంతో వెంటనే ఎంఈవో ద్వారా ఆ పాఠశాల ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేయించారు.  పక్కనే ఉన్న అంగన్‌వాడీ కార్యకర్త సకాలంలో కే ంద్రాన్ని తెరవక పోవడంతో ఐసీడీఎస్ పీవోకు ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలా ఒకపక్క ప్రజా సమస్యలు పరిష్కారిస్తామని హామీలిస్తూ, మరోపక్క ఉపాధ్యాయులు, ఉద్యోగులపై అధికారం చెలాయించారు. టీడీపీ ప్రతినిధి భాస్కరరావు వెంట జీవీఎంసీ జోనల్ కమిషనర్ ఎం. సత్యవాణి, ఏఈ భరణ్‌కుమార్, టీడీపీ వార్డు కమిటీ అధ్యక్షుడు చెట్టుపల్లి గోపి, పార్టీ శ్రేణులు సారిపల్లి శ్రీనివాస్, కార్యదర్శి ఉమ్మడి దాసు తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు