ప్రతి ఇంటికీ గ్యాస్‌ కనెక‌్షన్‌

14 Apr, 2017 23:06 IST|Sakshi

అనంతపురం అర్బన్‌ : మహిళలు ఆరోగ్యంగా ఉంటే సమాజం, కుటుంబం ఆరోగ్యంగా ఉంటాయని, వారి ఆరోగ్యరీత్యా ప్రతి ఇంటికీ గ్యాస్‌ కనెక‌్షన్‌ ఉండాలని, అదే విధంగా వ్యక్తిగత మరుగుదొడ్డి తప్పనిసరి అని జేసీ లక్ష్మీకాంతం అన్నారు. అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక అంబేడ్కర్‌ నగర్‌లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీపం పథకం గ్యాస్‌ కనెక‌్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కట్టెలు, కిరోసిన్‌ పొయ్యిపై వంట చేయడం వల్ల ఆరోగ్యం పాడవుతుందన్నారు.

అదే విధంగా బహిరంగ మలవిసర్జన కారణంగా అనారోగ్యం పాలవుతారన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ గ్యాస్‌ కనెక‌్షన్‌ పొందాలని, మరుగుదొడ్డి కట్టించుకోవాలని సూచించారు. స్వచ్ఛంధ సంస్థలు, సామాజిక సేవాసంస్థలు ముందుకొచ్చి నిరుపేదలకు గ్యాస్‌ డిపాజిట్‌ చెల్లించాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా జిల్లావ్యాప్తంగా అన్ని గ్యాస్‌ ఏజెన్సీలతో తమ పరి«ధిలోని ఎస్సీ కాలనీల్లో గ్యాస్‌ కనెక‌్షన్లను పంపిణీ చేయించామన్నారు. అనంతరం 40 మందికి గ్యాస్‌ కనెన్షన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ సరోజమ్మ, పౌర సరఫరాల సంస్థ డీఎం డి.శివశంకర్‌రెడ్డి, ఏఎస్‌ఓలు ప్రేమ్‌కుమార్, సౌభాగ్యలక్ష్మీ, ఐఓసీ ఏజెన్సీ ప్రతినిధి సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు