గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు

19 Apr, 2017 23:01 IST|Sakshi
గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు
l14 మందికి గాయాలు
ఇద్దరి పరిస్థితి విషమం

 
ఆత్రేయపురం (కొత్తపేట) : మండలంలోని ర్యాలి గ్రామంలో బుధవారం గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు ఘటన గ్రామంలో కలవరం సృష్టిం చింది. ఈ ఘటనలో 14 మంది గాయాలు పాలయ్యారు. వీరిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కళ్లకు తీవ్ర గాయాలైన ఇద్దరితోపాటు మరొకరిని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. తీవ్రంగా గాయపడిన మరొకరికి కొత్తపేట ఏరియా ఆస్పత్రిలో వైద్యం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో మరో పది మందికి స్వల్ప గాయాలయ్యాయి. 
 
అసలేలా జరిగింది...
గ్రామంలో పారిపిరెడ్డి సూర్యనారాయణకు చెందిన గ్యాస్‌ వెల్డింగ్‌ షాపులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 10 గంటల సమయంలో షాపులో యజమాని వెల్డింగ్‌ చేస్తుండగా గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ పేలుడు దాడికి వెల్డింగ్‌ షాపు ధ్వంసమైంది. యజమాని సూర్య నారాయణతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన కొడమంచలి అనంద్‌కుమార్, పల్లేటి సరేష్, చదులవాడ సోనియా, బుడ్డిగ వెంకట్రావు, పెందుర్తి దేవప్రసాద్, పల్లేటి మరియమ్మ, పెందుర్తి రాఘవమ్మ, చదులవాడ వెంకటేశులు, గంపల రాజు, పల్లేటి కృపావతి, కళ్యాణ రవణమ్మ, ఎస్‌కే మీరాబి ఈ ప్రమాదంలో గాయపడ్డారు.

గాయపడిన మరో ఇద్దరి పేర్లు తెలియాల్సిఉంది. ఈ షాపు సమీపంలో నివాసం ఉంటున్న వారితో పాటు అటుగా వెళుతోన్న వారికి పేలిన సిలిండర్‌ శకలాలు తగలడంతో గాయపడినట్టు స్థానికులు తెలిపారు.రాజమండ్రికి చెందిన సూర్యనారాయణ 25 ఏళ్ల క్రితం గ్రామానికి జీవనోపాధి కోసం వలస వచ్చారు. స్థానిక అరుంధతి పేటలో వెల్డింగ్‌ షాపుతో పాటు లేతు మిషన్‌ నడుపుతున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.3 లక్షలు అస్తి నష్టం ఏర్పడిందని అంచనా. 
 
క్షతగాత్రులకు ప్రముఖుల పరామర్శ..
తీవ్రగాయాల పాలైన వారికి స్థానిక పీహెచ్‌సీలో వైద్యం చేశారు. మెరుగైన చికిత్స కోసం కొత్తపేట, రాజమండ్రి ప్రభుత్వ అస్పత్రులకు తరలించారు. క్షతగాత్రులను కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జెడ్పీటీసీ సభ్యులు మద్దూరి సుబ్బలక్ష్మి బంగారం, సాకా ప్రసన్నకుమార్, రావులపాలెం ఎంపీపీ కోట చెల్లయ్య, ర్యాలి సర్పంచి పల్లేటి ధనలక్ష్మి, ఆత్రేయపురం, రావులపాలెం మండల పరిషత్‌ ఉపా«ధ్యక్షులు మద్దూరి సుబ్బారావు, దండు సుబ్రహ్మణ్య వర్మ, రూరల్‌ బ్యాంకు అధ్యక్షుడు మద్దూరి సుబ్బారావు, ఎంపీటీసీ బోణం రత్నకుమారి, వైఎస్సార్‌ సీపీ మండల ఎస్సీ సెల్‌ కన్వీనర్‌ కప్పల శ్రీధర్, మాజీ రూరల్‌ బ్యాంకు అధ్యక్షులు మెర్ల వెంకటేశ్వరరావు, ఈలి శ్రీరామచంద్రమూర్తి తదితరులు పరామర్శించారు. వీఆర్వో ఫిర్యాదుపై ఎస్సై జేమ్స్‌ రత్న ప్రసాద్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
 
క్షతగాత్రులకు హోంమంత్రి పరామర్శ
రాజమహేంద్రవరం క్రైం (రాజమహేంద్రవరం సిటీ) : గ్యాస్‌ సిలిండర్‌ పేలుడులో గాయాల పాలైన క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప పరామర్శించారు. ప్రమాద సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ఉచితంగా చికిత్స చేయించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రమాదంలో ముగ్గురికి కంటికి తీవ్ర గాయాలు అయ్యాయని, వారిని కాకినాడలోని కిరణ్‌ కంటి హాస్పిటల్‌కు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. విశాఖ జిల్లా కేడీ పేటలో లారీ దూసుకుపోయి గాయాలు పాలైన బాధితులకు ప్రభుత్వ పరంగా వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కౌన్సిల్‌ ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, అడిషనల్‌ ఎస్పీ రెడ్డి గంగాధర్, హాస్పిటల్‌ సూపరిటెండెంట్‌ డాక్టర్‌ రమేష్‌ కిషోర్, టీడీపీ నాయకులు గన్ని కృష్ణ, డీఎస్పీలు కులశేఖర్, రామకృష్ణ పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు