వామ్మో గ్యాస్‌ ధర

4 Mar, 2017 00:05 IST|Sakshi
వామ్మో గ్యాస్‌ ధర
– కొండెక్కి కూర్చున్న గ్యాస్‌ ధరలు 
– ఫిబ్రవరిలో రూ.700, ఈ నెల రూ.790.50
– వచ్చే నెలలో ఎంతో...? 
– అంతర్జాతీయ మార్కెట్‌ అధారంగా మార్పులు 
– ప్రతి నెలా వడ్డింపులు చేస్తున్న కంపెనీలు 
– వ్యాపార గ్యాస్‌ ధర కూడా పెంపు 
– బెంబేలెత్తుతున్న వినియోగదారులు 
 
ఇలా బండ పెరుగుదల...
- జనవరిలో ఇంటి గ్యాస్‌ సిలిండర్‌ 14.2 కేజీల ధర రూ.632 ఉండగా  ఫిబ్రవరిలో అది కాస్త రూ.700లకు చేరుకుంది. 
- మార్చి నెల ఒకటో తేదీన మరోసారి గ్యాస్‌ ధర పెరిగింది. ఫిబ్రవరిలో రూ.700 ఉన్న ధర మరో రూ.90.50 పెరిగి రూ.790.05లకు చేరుకుంది. గ్యాస్‌ ఇంటికి తెచ్చిన డెలివరీ బాయ్‌ చార్జీ రూపంలో మరో రూ.30లు అదనంగా పడుతోంది. 
- వెరసి మార్చి నెల మొత్తంలో ఏ రోజైనా గ్యాస్‌ సిలిండర్‌ కొన్న వారు రూ. 820.50లు చెల్లిస్తున్నారు.
సబ్సిడీలా...
గత ఏడాది గ్యాస్‌ సబ్సిడీ రూ.250 వచ్చేది. అయితే జనవరిలో 14.2 కేజీల గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.632కు పెరగడంతో సబ్సిడీ రూ.161లు మాత్రమే వినియోగదారులు ఖాతాలో జమ అవుతోంది.
-  ఇక ఫిబ్రవరి నెలలో గ్యాస్‌ ధర రూ.700, మార్చిలో రూ.790.50లకు పెరిగింది. గ్యాస్‌ ధర పెరిగిన మేర సబ్సిడీలో కోత పడుతోంది. 
అదే జాడలో ధరలూ...
- ఇంటి అవసరాలకు 14.2 కేజీల బండను సరఫరా చేస్తున్న ప్రభుత్వం వ్యాపార అవసరాలకు ప్రత్యేకంగా 19 కేజీల సిలిండర్‌ను అందిస్తోంది. 
- ఈ సిలిండర్‌ ధర జనవరిలో రూ.1180 ఉండగా ఫిబ్రవరిలో రూ.1285, మార్చిలో రూ.1440లకు పెరిగింది.
-  కేవలం రెండు నెలల్లో గ్యాస్‌ ధర రూ.260 మేర పెరగడంతో టిఫిన్‌ సెంటర్లు, తోపుడు బండిపై టిఫిన్‌ విక్రయించేవారు, రోడ్డుపై చిరుతిళ్లు తయారు చేసి అమ్మేవారు బెంబేలెత్తుతున్నారు. 
- పెరిగిన ధర మేరకు వారు విక్రయించే తిను బండారాల ధరలు పెంచడం లేదా వాటి సైజు తగ్గించడం చేస్తున్నారు. ఇక రెస్టారెంట్‌లు, హోటళ్లు కూడా ఇందుకు ఏ మాత్రం భిన్నంగా వ్యవహరించలేని పరిస్థితి నెలకొంది. 
సాక్షి, రాజమహేంద్రవరం:  వంట గ్యాస్‌ ధర కొండెక్కి కూర్చుంది. వినియోగదారులు గ్యాస్‌ పోయ్యి వెలిగించకుండానే సెగ తగులుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌ ధరలను అనుసరించి గ్యాస్‌ కంపెనీలు ప్రతి నెలా ధరలను నిర్ణయించుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దీంతో అంతర్జాతీయ మర్కెట్‌ ఆధారంగా ధరల్లో ప్రతి నెలా గ్యాస్‌ కంపెనీలు మార్పులు చేర్పులు చేస్తున్నాయి. ఈ విధానం ప్రస్తుతం ఏడాది నుంచి అమలు చేస్తున్నాయి. జనవరిలో ఇంటి గ్యాస్‌ సిలిండర్‌ 14.2 కేజీల ధర రూ.632 ఉండగా ఫిబ్రవరిలో అది కాస్త రూ.700లకు చేరుకుంది. ఇక మార్చి నెల ఒకటో తేదీన మరోసారి గ్యాస్‌ ధర పెరిగింది. ఫిబ్రవరిలో రూ.700 ఉన్న ధర మరో రూ.90.50 పెరిగి రూ.790.05లకు చేరుకుంది. గ్యాస్‌ ఇంటికి తెచ్చిన డెలివరీ బాయ్‌ చార్జీ రూపంలో మరో రూ.30లు అదనంగా పడుతోంది. వెరసి మార్చి నెల మొత్తంలో ఏ రోజైనా గ్యాస్‌ సిలిండర్‌ కొన్న వారు రూ. 820.50లు చెల్లిస్తున్నారు.
సబ్సిడీలో కోత...
నగదు బదిలీ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు, వస్తువులపై ఇస్తున్న సబ్సిడీని ఖాతాదారులకు నేరుగా ఇచ్చేలా యూపీఏ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్యాస్‌ ధర సబ్సిడీ కూడా వారి ఖాతాల్లో జమయ్యేలా గ్యాస్‌ కనెక‌్షన్, బ్యాంకు ఖాతాలతో ఆధార్, మొబైల్‌ నంబర్లను అనుసంధానం చేసింది. ఖాతాదారుడు తన మొబైల్‌ నంబర్‌ నుంచి సంబంధింత గ్యాస్‌ ఏజెన్సీ ఇచ్చిన సెల్‌ నంబర్‌కు ఫోన్‌ చేసి గ్యాస్‌ బుక్‌ చేసుకున్న తర్వాత గ్యాస్‌ ఇస్తున్నారు. దీనివల్ల గ్యాస్‌ ఏజెన్సీలు అవకతవకలకు అడ్డుకట్ట వేయొచ్చని ప్రభుత్వం భావించింది. వినియోగదారుడు గ్యాస్‌ ధరను ముందు పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొద్ది రోజులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తం వారి బ్యాంక్‌ ఖాతాలో జమ చేస్తుంది. ఇదే విధానాన్ని ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వం అమలు చేస్తోంది. గత ఏడాది గ్యాస్‌ సబ్సిడీ రూ.250 వచ్చేది. అయితే జనవరిలో 14.2 కేజీల గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.632కు పెరగడంతో సబ్సిడీ రూ.161లు మాత్రమే వినియోగదారులు ఖాతాలో జమ అవుతోంది. ఇక ఫిబ్రవరి నెలలో గ్యాస్‌ ధర రూ.700, మార్చిలో రూ.790.50లకు పెరిగింది. గ్యాస్‌ ధర పెరిగిన మేర సబ్సిడీలో కోత పడుతోంది. 
సబ్సిడీ వదులుకున్న వారు నామమాత్రమే...
జిల్లాలో 13,10,669 గ్యాస్‌ కనెక్షన్లున్నాయి. పేద, ధనిక, ప్రభుత్వ ఉద్యోగి, ప్రైవేటు ఉద్యోగి, యజమాని, కార్మికుడు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ గ్యాస్‌ సబ్సిడీ వర్తిస్తోంది.  ధనవంతులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా గ్యాస్‌ సబ్సిడీ వదులుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇవ్వడంతో మన జిల్లాలో ఉన్న 13,10,669 మంది వినియోగదారుల్లో కేవలం 6000 మంది మాత్రమే సబ్సిడీ వదులుకున్నారు. సాధారణ గ్యాస్‌ కనెక‌్షన్లతోపాటు జిల్లాలో 6,056 వ్యాపార కనెక‌్షన్లున్నాయి. హెచ్‌పీ, భారత్, ఇండేన్‌ కంపెనీలు జిల్లాలో 71 ఏజెన్సీలను ఏర్పాటు చేసి వినియోగదారులకు గ్యాస్‌ను సరఫరా చేస్తున్నాయి.
బెంబేలెత్తుతున్న వ్యాపారులు...
గ్యాస్‌ ధర ప్రతి నెలా పెరుగుతుండడంతో సాధారణ వినియోగదారులతోపాటు, వ్యాపారస్తులు బెంబేలెత్తుతున్నారు. ఇంటి అవసరాలకు 14.2 కేజీల బండను సరఫరా చేస్తున్న ప్రభుత్వం వ్యాపార అవసరాలకు ప్రత్యేకంగా 19 కేజీల సిలిండర్‌ను అందిస్తోంది. ఈ సిలిండర్‌ ధర జనవరిలో రూ.1180 ఉండగా ఫిబ్రవరిలో రూ.1285, మార్చిలో రూ.1440లకు పెరిగింది. కేవలం రెండు నెలల్లో గ్యాస్‌ ధర రూ.260 మేర పెరగడంతో టిఫిన్‌ సెంటర్లు, తోపుడు బండిపై టిఫిన్‌ విక్రయించేవారు, రోడ్డుపై చిరుతిళ్లు తయారు చేసి అమ్మేవారు బెంబేలెత్తుతున్నారు. పెరిగిన ధర మేరకు వారు విక్రయించే తిను బండారాల ధరలు పెంచడం లేదా వాటి సైజు తగ్గించడం చేస్తున్నారు. ఇక రెస్టారెంట్‌లు, హోటళ్లు కూడా ఇందుకు ఏ మాత్రం భిన్నంగా వ్యవహరించలేని పరిస్థితి నెలకొంది. 
 
జిల్లాలో గ్యాస్‌ కనెక‌్షన్లు: 13,10,669
సబ్సిడీ వదులుకున్నవారు: 6000
వ్యాపార కనెక‌్షన్లు: 6,056
జిల్లాలో ఏజెన్సీలు: 71
 
అంతర్జాతీయ మర్కెట్‌కు అనుగుణంగా మార్పులు..
పెట్రోల్, డీజిల్‌ ధరల లాగానే అంతర్జాతీయ మర్కెట్‌ ధరల ఆధారంగా ప్రతి నెలా గ్యాస్‌ ధరలు మారుతుంటాయి. ప్రతి నెలా ఇది తప్పనిసరి. ఒక నెల ధర పెరిగితే మరో నెల తగ్గొచ్చు. పెరిగిన ధరకు అనుగుణంగా వినియోగదారులకు సబ్సిడీ నగదు వారి ఖాతాల్లో జమ అవుతుంది. ధర పెరిగితే సబ్సిడీ మొత్తం తగ్గుతుంది. గ్యాస్‌ ధర తగ్గితే సబ్సిడీ మొత్తం పెరుగుతుంది. 
– వేమూరి రవికిరణ్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి. 
>
మరిన్ని వార్తలు