ఆగ్రహావేశాలు

4 Sep, 2017 07:22 IST|Sakshi
ఆగ్రహావేశాలు

వంగవీటి రంగాపై గౌతంరెడ్డి అనుచిత వ్యాఖ్యలు 
రాధా, రత్నకుమారి తదితరుల తీవ్ర నిరసన
అడ్డుకున్న పోలీసులు... ఉద్రిక్తత 
రంగా కుటుంబానికి బాసటగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ
వైఎస్సార్‌ సీపీ నుంచి గౌతంరెడ్డి సస్పెన్షన్‌ 
పోలీసుల అత్యుత్సాహంపై విమర్శలు


దివంగత నేత వంగవీటి రంగా, ఆయన సోదరుడు రాధాకృష్ణలపై పూనూరి గౌతంరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆగ్రహావేశాలకు దారితీశాయి.  గౌతంరెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ పార్టీ కార్యా లయంలో విలేకరుల సమావేశం నిర్వహించేం దుకు వెళ్తున్న వంగవీటి రాధా, ఆయన తల్లిరత్నకుమారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో విజయవాడ ఆదివారం అట్టుడికింది. పోలీసుల అత్యుత్సాహం విమర్శలకు దారి తీసింది.  

1. మొగల్రాజపురంలోని తన నివాసం నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి బయలుదేరుతున్న వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి వంగవీటి రాధాకృష్ణ, ఆయన తల్లి రత్నకుమారిని అడ్డుకున్న పోలీసులు
2. వంగవీటి రాధాకృష్ణను బలవంతంగా అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

సాక్షి, అమరావతి బ్యూరో : వంగవీటి రంగా, రాధాపై పూనూరి గౌతంరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రంగా కుటుంబానికి బాసటగా నిలిచిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌతంరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. గౌతంరెడ్డి వ్యాఖ్యలపై వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర  కార్యదర్శి వంగవీటి రాధాకృష్ణ, ఆయన తల్లి రత్నకుమారితో పాటు పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం బందరు రోడ్డులోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి, గౌతంరెడ్డి వ్యాఖ్యలపై స్పందించేందుకు వస్తున్న వంగవీటి రంగా తనయుడు రాధాను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రికత్త నెలకొంది. ముందస్తు చర్యల్లో భాగంగా రాధా, రత్నకుమారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో విజయవాడ నగరం అట్టుడికింది. పోలీసుల అత్యుత్సాహంపై విమర్శలు వెల్లువెత్తాయి.

గౌతంరెడ్డిపై పెల్లుబికిన ఆగ్రహం
వంగవీటి రంగా, రాధాలపై ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతంరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల్లో ఆగ్రహం పెల్లుబికింది. గౌతంరెడ్డిపై వంగవీటి రాధాకృష్ణ, రత్నకుమారి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. మొగల్రాజపురం వీధుల్లో వైఎస్సార్‌ సీపీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో అప్రమత్తమైన పోలీసులు  బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, అభిమానులు గౌతంరెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

రంగా కుటుంబానికి అండగా వైఎస్సార్‌ సీపీ
గౌతంరెడ్డి వ్యాఖ్యలను వైఎస్సార్‌ సీపీ తీవ్రంగా పరిగణించింది. ఆయన వ్యాఖ్యలపై పార్టీ అధి ష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీలో ఎవరైనా క్రమశిక్షణ తప్పితే ఉపేక్షించేది లేదంటూ తేల్చిచెబుతూ.. గౌతంరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. గౌతంరెడ్డి వ్యవహారశైలిని తప్పుబడుతూ.. రంగా కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. రెండు రోజులుగా టీవీ చానల్‌లో గౌతంరెడ్డి ఇంటర్వ్యూలోని కొన్ని అంశాలు ప్రసారం కావడం.. ఆదివారం ఉదయం సోషల్‌ మీడియాలో ఆయన వ్యాఖ్యలకు సంబం «ధించిన వీడియో వైరల్‌ కావడంతో తీవ్రంగా పరిగణించిన అధిష్టానం ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేసింది.

పోలీసుల ఓవరాక్షన్‌..
గౌతంరెడ్డి వ్యాఖ్యలపై స్పందించేందుకు బందరురోడ్డులోని పార్టీ కార్యాలయంలో వంగవీటి రాధా విలేకరులు సమావేశం ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా ఇందుకు అనుమతిచ్చారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయానికి బయల్దేరి వెళ్తున్న రాధాను పోలీసులు అడ్డుకోవడంతో వారి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. తన కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుసుకున్న రాధా తల్లి రత్నకుమారి ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులతో తీవ్రస్థాయిలో వాగ్వావాదానికి దిగారు. తన కుమారుడిని ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలంటూ నిలదీశారు. ఈ నేపథ్యంలో పోలీసులు, రాధా, రత్నకుమారి, పార్టీ నేతల మధ్య తోపులాట జరగడంతో రత్నకుమారి సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో పోలీసుల తీరుపై కార్యకర్తలు, అభిమానులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల ఓవరాక్షన్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

హైడ్రామా...
వంగవీటి రా«ధ, రత్నకుమారిని అదపులోకి తీసుకున్న పోలీసులు నగరంలోని పలు స్టేషన్ల చుట్టూ తిప్పుతూ హైడ్రామా నడిపించారు. సాయంత్రం అదుపులోకి తీసుకున్నప్పటికీ రాత్రి వరకు నగరమంతా తిప్పి, చివరకు ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాధ, రత్నకుమారి స్టేషన్‌లో నేలపైనే కూర్చుని పోలీసుల తీరుకు నిరసన తెలిపారు. పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్, పార్టీ విజయవాడ నగర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లాది విష్ణు స్టేషన్‌కు వెళ్లి వారిని పరామర్శించారు. మరికొంత మంది వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని మాచవరం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

అనుచిత వ్యాఖ్యలు సరికాదు : కొలనుకొండ
విజయవాడ సెంట్రల్‌ : దివంగత ఎమ్మెల్యే వంగవీటి రంగాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరి కాదని పీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ ఆదివారం ప్రకటన్లో సూచిం చారు. గౌతమ్‌రెడ్డి వ్యాఖ్యలు రంగా అభిమానుల మనో భావాలను దెబ్బతీశాయని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలకు రంగా ఆరాధ్యదైవమని గుర్తుచేశారు. ప్రజా సమస్యలపై నిరాహార దీక్ష చేస్తుండగా ప్రత్యర్థుల చేతిలో రంగా హత్యకు గురవడం, తదనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు అందరికీ తెలు సని పేర్కొన్నారు.  ప్రశాంతంగా ఉన్న విజయవాడలో కొన్ని వర్గాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవుపలికారు.

వంగవీటి రాధా, రత్నకుమారి అక్రమ నిర్బంధం
ఇబ్రహీంపట్నం(మైలవరం) : వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగవీటి రాధాకృష్ణ, ఆయన తల్లి రత్నకుమారిని ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు ఆదివారం రాత్రి అక్రమంగా నిర్బంధించారు. విజయవాడలో విలేకరుల సమావేశం నిర్వహించేందుకు వైఎ స్సార్‌ సీపీ కార్యాలయానికి వెళ్తున్న రాధాను, ఆయన తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌కు తరలిం చారు. చిరిగిన చొక్కాతో స్టేషన్‌లో ఉన్న రాధా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ నిర్బంధానికి నిరసనగా తల్లీకుమారులు పోలీస్‌ స్టేషన్‌లో నేలపై కూర్చున్నారు. రాధా, రత్నకుమారిని పోలీసులు నిర్బంధించిన విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. వంగవీటి మోహనరంగా జోహార్‌ అంటూ నినాదాలు చేశారు. విజయవాడ డీసీపీ రాణా, ఏసీపీ రామకృష్ణ కార్యకర్తలను అదుపుచేయలేకపోయారు. 144 సెక్షన్‌ విధించి పోలీస్‌స్టేషన్‌ రోడ్డును మూసివేయించాల్సిన పరిస్థితి వచ్చింది.

వైఎస్సార్‌ సీపీ నేతల బాసట
వంగవీటి రాధాను అక్రమంగా నిర్బంధించారనే విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్‌ హుటాహుటిన పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. రాధాకృష్ణ, రత్నకుమారిని పరామర్శించి, వారికి బాసటగా నిలిచారు. ఈలోపు విజయవాడ నుంచి పార్టీ నగర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త బొప్పన భవకుమార్‌ కూడా అక్కడి చేరుకున్నారు. మీడియాను లోపలకు అనుమతించకపోవటంతో కార్యకర్తలు గేటు ఎదుట కొద్దిసేపు నినాదాలు చేశారు. పార్టీ మండల కన్వీనర్‌ బొమ్మసాని వెంకటచలపతి, జి.కొండూరు జెడ్పీటీసీ సభ్యుడు కాజా బ్రహ్మయ్య, నాయకులు మేడపాటి నాగిరెడ్డి, జోగి రాము, అక్కల గాంధీ, నల్లమోతు మధుబాబు, రవి, పలువురు ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు రాధాకు బాసటగా నిలిచారు.

మరిన్ని వార్తలు