ఒక జననం.. ఒక మరణం

23 May, 2016 08:55 IST|Sakshi
ఒక జననం.. ఒక మరణం

శిశువుకు జన్మనిచ్చి కన్ను మూసిన తల్లి
అమ్మ ప్రేమకు దూరమైన ఇద్దరు చిన్నారులు
వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో మన్యంలో ఆగని మరణాలు

 

మాతా, శిశు మరణాలను అరికట్టేందుకు పెద్దఎత్తున నిధులు కేటాయించి విస్తృత చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వం, అధికారులు చెబుతున్నా ఏజెన్సీలో నిత్యం ఎక్కడో ఒక చోట మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి.   గిరిజనులకు అవగాహన లోపం.. వైద్యం సిబ్బంది నిర్లక్ష్యం వెరసి ఏజెన్సీలో మరో బాలింత ప్రాణం తీసింది.

 

జీకేవీధి:   ప్రభుత్వ యంత్రాంగం, వైద్య ఆరోగ్యశాఖ మాతా, శిశు మరణాలకు అడ్డుకట్ట వేయడానికి అమలు చేస్తున్న పథకాలు   గిరిజన ప్రాంతంలో అమలుకు నోచుకోవడం లేదు. క్షేత్రస్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం అమలుకు ఆటంకంగా మారింది.  జీకేవీధి మండల కేంద్రానికి సమీపంలోని ఉన్న పనసలబంద గ్రామంలో  శనివారం చోటుచేసుకున్న ఓ మాతృ  మరణం ఆదివారం వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పనసలబంద గ్రామానికి చెందిన గెమ్మెలి విజయ(24) అనే నిండు గర్భిణి శనివారం   ప్రసవ వేదనతో బాధపడుతుండగా ఆమె భర్త గెమ్మెలి అర్జున్ ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించాడు. అంబులెన్స్, వైద్య సిబ్బంది వచ్చేలోగానే  ఆమె  ుగ శిశువుకు జన్మనిచ్చి అపస్మారక స్థితికి చేరుకుంది. వైద్య సిబ్బంది ఆమెకు సపర్యలు చేసి వైద్యసేవలు అందించి అంబులెన్స్‌లో ఎక్కించేలోగానే తుది శ్వాస విడిచింది. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలికి రెండేళ్ల పాప ఉంది. ఇది ఆమెకు రెండో కాన్పు. ప్రసవించిన వెంటనే ఆమె మృతి చెందడంతో పుట్టిన పసికందుతోపాటు రెండేళ్ల చిన్నారి తల్లి ప్రేమకు దూరమయ్యారు.

 
బంధువు సంరక్షణలో పసికందు

పుట్టుకతోనే తల్లిని కోల్పోయిన పసికందు సంరక్షణను  మృతురాలి వదిన గెమ్మెలి లక్ష్మి  స్వీకరించింది. ఆమె కూడా బాలింత కావడంతో ప్రస్తుతం తల్లిపాలకు దూరమైన పసికందును ఒడిలోకి తీసుకుని బిడ్డ ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తోంది.

 
సకాలంలో వైద్యం అందక..

మాతా, శిశు మరణాలను అరికట్టాలనే లక్ష్యంతో వైద్య ఆరోగ్యశాఖ ఇటీవల కాలంలో అనేక పథకాలకు శ్రీకారం చుట్టింది.   క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎం దగ్గర నుంచి అధికారుల వరకు సమాచార వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏఎన్‌ఎంలకు, వైద్యాధికారులకు ప్రత్యేక ట్యాబ్‌లను సమకూర్చి టాకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. గ్రామాల్లో మహిళలకు వివాహమైనప్పటి  నుంచి వారు గర్భం దాల్చి ప్రసవించేవరకు  నెల నెల నిర్వహించాల్సిన పరీక్షలు, ప్రసవతేదీ వంటి వాటిని ట్యాబ్‌లో నిక్షిప్తంచేస్తున్నారు. గర్భం దాల్చిన ప్రతి మహిళను ప్రసవానికి 3 రోజుల ముందే సమీప ఆస్పత్రిలో చేర్పించే విధంగా దశలవారీగా దిశానిర్దేశం చేశారు. గర్భిణులకు అవసరమైన పరీక్షలన్నీ ఉచితంగా చేసే వెసులుబాటు కల్పించారు. ప్రసవం అనంతరం తల్లి, బిడ్డల సంరక్షణకు తల్లి,బిడ్డ ఎక్స్‌ప్రెస్ ను ఏర్పాటు చేశారు.  అయితే అధికారులు నిర్లక్ష్యం కారణంగా మన్యంలో అమలు అంతమాత్రమే. వైద్య సేవలూ అరకొరే.. దీంతో ఎక్కడో ఒక చోట మాతా శిశు మరణాలు చోటు చేసుకోవడం ప్రభుత్వ యంత్రాంగం పనితీరును ప్రశ్నిస్తోంది

>
మరిన్ని వార్తలు