వాసంతి సస్పెన్షన్

26 Jan, 2016 13:04 IST|Sakshi
వాసంతి సస్పెన్షన్

చిత్తూరు : గంగాధర నెల్లూరు ఎస్‌ఐ కేఎస్.వాసంతిని సస్పెండ్ చేస్తూ అనంతపురం డీఐజీ సత్యనారాయణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత వారం రెండు ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసిన వాసంతి వాటి డ్రైవర్లపై కేసు నమో దు చేసి చిత్తూరులోని మూడవ అదనపు మేజిస్ట్రేట్ న్యాయస్థానానికి తరలించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏడేళ్లలోపు జైలుశిక్ష పడే కేసుల్లో నిందితులను అరెస్టు చేసే ముందు సీఆర్‌పీసీ 41 నోటీసు పూరించి కోర్టుకు ఇవ్వాలి.
 
 ఆమె అలా చేయకుండా నిందితుల్ని కోర్టుకు పంపడంపై న్యాయవాది అభ్యంతరం వ్యక్తంచేశారు. కోర్టుకు రావాలని న్యాయమూర్తి రాఘవేంద్ర ఆదేశించినా ఆమె రాలేదు. కానిస్టేబుల్ వద్ద ఉన్న మరో రిమాండు రిపోర్టులో నిందితులు నోటీసు తీసుకోలేదని, అప్పటికప్పుడు మరో రిమాండు రిపోర్టు అందజేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి సంబంధిత సీఐ, డీఎస్పీని పిలిపించారు. ఎస్‌ఐ న్యాయస్థానాన్నే తప్పుదారి పట్టించాలని చూశారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ జడ్జి జిల్లా జడ్జికి నోట్ పంపించారు. జిల్లా జడ్జి నుంచి చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్‌కు ఫైల్ వెళ్లింది. ఆయన డీఐజీకి పంపించారు. దీంతో వాసంతిని సస్పెండ్ చేశారు.
 
 ఆది నుంచి వివాదాస్పదమే..
 నాలుగేళ్ల క్రితం ఆమె మదనపల్లెలో ట్రైనీ ఎస్‌ఐగా చేరారు. ఐరాలలో తొలిసారిగా ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టారు. ఆమె పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌పై సైతం దురుసుగా ప్రవర్తించారు. అలాగే గ్రానైట్ అక్రమార్కులు, దుకాణాల నుంచి మామూళ్లు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏడాది క్రితం గంగాధరనెల్లూరు పోలీసు స్టేషన్‌కు బదిలీపై వచ్చిన వాసంతి ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె సమయంలో వారిని లాఠీలతో చితకబాదారు. ఉన్నతాధికారులు పలుమార్లు మందలించినా ప్రయోజనం లేదు. కోర్టు వ్యవహారంలో కూడా ఆమె తీరు మార్చుకోకపోవడంతో సస్పెన్షన్‌కు గురయ్యారు.

మరిన్ని వార్తలు