‘రేషన్‌’లో కిరాణం!

25 Sep, 2016 23:28 IST|Sakshi
‘రేషన్‌’లో కిరాణం!

చౌక ధరల దుకాణాల్లో పీడీఎస్‌ సరుకులతో పాటు ఇతర సరుకుల విక్రయం
డీలర్లకు ప్రభుత్వ కమీషన్‌ చాలనందున ప్రత్యామ్నాయం
పౌరసరఫరాల మంత్రి వద్ద దస్త్రం
త్వరలో ప్రభుత్వ ఉత్తర్వులు

చౌక ధరల దుకాణాలు త్వరలో కిరాణాషాపులుగా మారనున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే సరుకులతో పాటు సాధారణ సరుకులు కూడా ఇకపై అక్కడే లభించనున్నాయి. పీడీఎస్‌ సరుకులతో పాటు ఇతర వస్తువులు సైతం విక్రయించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వనుంది. ఇందుకు సంబంధించిన దస్త్రం పౌరసరఫరాల శాఖ మంత్రి వద్ద పెండింగ్‌లో ఉంది. మరో పక్షం రోజుల్లో దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి.

సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో 1,952 చౌకధరల దుకాణాలున్నాయి. ఇందులో 711 మహిళల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ప్రభుత్వం పీడీఎస్‌ సరుకుల సంఖ్యను కుదించింది. ప్రస్తుతం రేషన్‌ దుకాణాల్లో కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. పండగ సందర్భాల్లో అరుదుగా చక్కెర ఇస్తున్నారు. ఇక నూనెలు, పప్పు, గోధుమల స్టాకు జాడలేకుండా పోయింది. ఈ క్రమంలో డీలర్లకు ఆదాయం భారీగా తగ్గిందని పౌరసరఫరాల శాఖపై ఒత్తిడి మొదలైంది. ఇటీవల రాష్ట్రస్థాయి సమావేశంలో డీలర్లు ఈ అంశాన్ని స్పష్టం చేయడంతో వారికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసే అలోచనలో ప్రభుత్వం తలమునకలైంది. ఈ క్రమంలో ఇతర సరుకుల అమ్మకాలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని భావిస్తోంది. ఈ క్రమంలో పౌరసరఫరాల శాఖ నివేదిక సమర్పించి ప్రభుత్వానికి అందించింది.

సాధారణ ధరకే సరుకులు...
ప్రస్తుతం రేషన్‌ దుకాణాల్లో పీడీఎస్‌ సరుకులను చౌక ధరకు అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన రాయితీని ప్రభుత్వమే భరిస్తుంది. ఈ సరుకుల అమ్మకంపై డీలర్లకు నిర్ధిష్ట మొత్తంలో కమీషన్‌ ఇస్తుంది. అయితే సరుకుల సంఖ్య తగ్గడంతో డీలర్లకు ఆదాయం భారీగా తగ్గింది. దీంతో ఇతర సరుకులు విక్రయించుకునేలా చర్యలు తీసుకోవాలని డీలర్ల సంఘం డిమాండ్‌ చేయడంతో ప్రభుత్వం ఆ మేరకు యోచిస్తోంది. అయితే పీడీఎస్‌ సరుకులు మినహా ఇతర సరుకులు మార్కెట్‌ ధరకే అమ్ముకునే అవకాశం ఇవ్వనుంది. అయితే, ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చిన తర్వాతే దీనిపై స్పష్టత రానుంది.

మరిన్ని వార్తలు