బయ్యారంలో సాధారణ స్టీలు ప్లాంటు: దత్తాత్రేయ

11 Mar, 2017 03:21 IST|Sakshi
బయ్యారంలో సాధారణ స్టీలు ప్లాంటు: దత్తాత్రేయ

సాక్షి, న్యూఢిల్లీ: ఖమ్మం జిల్లా బయ్యారంలో సాధారణ స్టీలు ప్లాంటు ఏర్పాటుకు కేంద్ర ఉక్కు శాఖ సూత్రప్రాయ అంగీకారం తెలిపిందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ తరహాలో పీపీపీ విధానంలో ప్లాంటు ఏర్పాటు చేయవచ్చన్నారు. బయ్యారంలో లభించే ఇనుప ఖనిజం (ముడి సరుకు)లో నాణ్యత లేనందున విశాఖ తరహా భారీ స్టీలు ప్లాంటు సాధ్యం కాదన్నారు. శుక్రవారం ఢిల్లీలోని తన కార్యాలయానికి వచ్చిన కేంద్ర ఉక్కు మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌తో ఈ అంశంపై దత్తాత్రేయ సమీక్షించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తగిన సర్వే చేసి ఈ ప్లాంటు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పారు. జాతీయ రూర్బన్‌ మిషన్‌ కింద రంగారెడ్డి జిల్లాలోని అల్లాపూర్, మెదక్‌ జిల్లాలోని రాయికల్, నిజామాబాద్‌ జిల్లాలోని జుక్కల్, ఆదిలాబాద్‌ జిల్లాలోని సారంగపల్లి ప్రాంతాలను మౌలిక వసతుల అభివృద్ధికి ఎంపిక చేశారని దత్తాత్రేయ వివరించారు.

మరిన్ని వార్తలు