‘ఉపాధి’ పనులకూ జియో ట్యాగింగ్‌

7 Jan, 2017 23:36 IST|Sakshi
‘ఉపాధి’ పనులకూ జియో ట్యాగింగ్‌

పల్లెల్లో కొనసాగుతున్న పనులు
సాంకేతిక లోపాలతో సిబ్బందికి ఇబ్బంది


గంభీరావుపేట :
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో చేపట్టిన పనుల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం జియోట్యాగింగ్‌ను ప్రవేశపెట్టింది. 2006 నుంచి పనులు పూర్తయి లబ్ధిదారులకు బిల్లులు అందిన అంశాలనే ట్యాగ్‌ చేస్తున్నారు. ప్రగతిలో ఉన్న పనులను ట్యాగ్‌ చేయరు. ఇంకుడుగుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, కుంటలు, కాలువలు, పూడికతీత, అడ్డుకట్టలు తదితర పనుల్లో పూర్తయిన పనులను సిబ్బంది ట్యాగింగ్‌ చేస్తున్నారు.

ట్యాగింగ్‌ చేయడం ఇలా..
ఎన్ ఆర్‌ఈజీఎస్‌ ద్వారా రూపొందించిన ప్రత్యేకమైన ‘భువన్  యాప్‌’ను ఓపెన్  చేసుకొని పూర్తయిన పనుల రెండు ఫోటోలు తీసుకోవాలి. వాటిని ఆన్ లైన్ లో పొందుపర్చాలి. జియోట్యాగింగ్‌ వల్ల ఎక్కడి పనులనైనా ఆన్ లైన్ లో చూసుకోవచ్చు.

జిల్లాలో ట్యాగింగ్‌ వివరాలు
జిల్లా వ్యాప్తంగా 32,453 పూర్తయిన పనులను జియోట్యాగింగ్‌కు టార్గెట్‌ చేశారు. ఇందులో ఇప్పటికీ 17,189 పనుల వివరాలను అధికారులు ట్యాగ్‌ చేశారు.

సాంకేతిక లోపాలు
జియోట్యాగింగ్‌ చేసే సమయంలో నెట్‌కనెక్ట్‌ కాకుండా క్షేత్రస్థాయిలో ఈజీఎస్‌ సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. పనులు జరిగిన గ్రామీణ ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఈసమస్య మరింత ఎక్కువవుతోంది. ఆన్ లైన్ లో వివరాలను పంపించడానికి కూడా కష్టంగా మారుతోంది.

నెట్‌వర్క్‌ సమస్యలున్నాయి
ఈజీఎస్‌ పనుల ట్యాగింగ్‌ విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నం. పల్లెల్లో నెట్‌వర్క్‌ లేక ట్యాగింగ్‌ చేయడంలో కాస్త జాప్యం జరుగుతోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలో వందశాతం ట్యాగింగ్‌ కోసం కృషి చేస్తున్నం.
–సాయిక్రిష్ణ, టెక్నికల్‌ అసిస్టెంట్, గంభీరావుపేట

రాష్ట్రంలో 8వ స్థానం
ఈజీఎస్‌ జియోట్యాగింగ్‌ విషయంలో జిల్లా రాష్ట్రంలో 8వ స్థానంలో ఉంది. ఇప్పటికీ 53శాతం ట్యాగింగ్‌ పూర్తయ్యిం ది. పనులు వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించాం. సాంకేతిక లోపా లు తలెత్తడంతో రాత్రింబవళ్లు సిబ్బంది కృషి చేస్తున్నారు.        
–హన్మంతరావు,డీఆర్‌డీవో, రాజన్న సిరిసిల్ల జిల్లా

మరిన్ని వార్తలు