వీధి కుక్కలకు జియోట్యాగింగ్‌

28 Sep, 2016 23:27 IST|Sakshi
అనిమల్‌ కేర్‌ ల్యాండ్‌ సంస్థ కేంద్రంలో ఉన్న వీధి శునకాలు.
– శునకాల నియంత్రణకు ఆండ్రాయిడ్‌ యాప్‌
– దేశంలోనే మొదటిసారిగా తిరుపతిలో అమలు
తిరుపతి మెడికల్‌: దేశంలోనే మొట్టమొదటి సారిగా వీధి కుక్కల నియంత్రణకు జియోట్యాగింగ్‌ పద్ధతిని తిరుపతిలో అమలు చేస్తున్నారు. మున్సిపల్‌ శాఖ సమన్వయంతో తిరుపతికి చెందిన యానిమల్‌ కేర్‌ ల్యాండ్‌ సంస్థ ఈ ఆధునిక సాంకేతిక పద్ధతికి శ్రీకారం చుట్టింది. ఫలితంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రత్యేక ‘ఆండ్రాయిడ్‌ యాప్‌ ’ద్వారా వీధి కుక్కల నియంత్రణకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే తిరుపతి కేంద్రంగా యానిమల్‌ కేర్‌ల్యాండ్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ ఎన్‌.వి. శ్రీకాంత్‌ బాబు 14 ఏళ్లుగా రేబిస్‌ నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. 
110 మున్సిపాలిటీల్లో  యాప్‌ సేవలు..
 ఈ పద్ధతిని పారదర్శకంగా అమలుచేసేందుకు యానిమల్‌ కేర్‌ ల్యాండ్‌ తిరుపతి నగరపాలక సంస్థతో సమన్వయంతో పనిచేస్తోంది. ఈ పద్ధతిలో భాగంగా టీకాలు వేసిన ప్రతి శునకాన్ని ప్రత్యేకంగా రూపొందించిన ఆండ్రాయిడ్‌ యాప్‌ ద్వారా జియోట్యాగ్‌ చేస్తారు. ఒక సారి యాప్‌ను ఉపయోగించి శునకాలను పట్టినప్పుడు, శస్త్ర చికిత్సలు చేసినప్పుడు, తిరిగి వాటి స్థానాల్లో వదిలినప్పుడు మొత్తం 3 ఫొటోలతో జియోట్యాగింగ్‌ చేస్తారు. దీనిని నేరుగా సీఎం డాష్‌ బోర్డుకు అనుసం«ధానం చేస్తారు. ఈ విధానం మంచి ఫలితాలను ఇవ్వడంతో రాష్ట్ర మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌ కె.కన్నబాబు ఆసక్తి చూపించారు. అందులో భాగంగానే డాక్టర్‌ శ్రీకాంత్‌బాబుతో చర్చించి రాష్ట్రంలోని 110 మున్సిపాలీటీల్లో .. 1.79లక్షల శునకాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నారు. 
దేశంలోనే ఆదర్శంగా...
తిరుపతి కేంద్రంగా యానిమల్‌ కేర్‌ ల్యాండ్‌ సంస్థ ద్వారా ఇప్పటి వరకు 1370 ఫిర్యాదులు తమ దష్టికి వచ్చాయి. వీధి శునకాల  నియంత్రణ కోసం దేశంలోనే మొట్టమొదటి సారిగా ఒక ప్రత్యేక ఆండ్రాయిడ్‌ యాప్‌ను రూపొందించాం. ఈ విధానాన్ని రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో అమలుచేస్తున్నందుకు సంతోషంగా ఉంది.  
– డాక్టర్‌ ఎన్‌.వి.శ్రీకాంత్‌ బాబు, కో–ఆప్షన్‌ సభ్యులు, యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా
 
 
మరిన్ని వార్తలు