జీజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్స

28 Mar, 2017 23:47 IST|Sakshi
జీజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్స
ఎండోస్కోపిక్‌ సర్జరీతో నాలుగు నెలల చిన్నారికి మెదడులోని నీరు తొలగింపు    
కాకినాడ వైద్యం (కాకినాడ సిటీ): పుట్టుకతో మెదడులో సంభవించిన జన్యుపరలోపంతో బాధపడుతున్న నాలుగు నెలల చిన్నారికి గంట స్వల్ప వ్యవధిలో కాకినాడ జీజీహెచ్‌ న్యూరోసర్జన్‌లు అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా చేశారు. మెదడుకు నీరు పట్టడంతో తల సైజు పెరిగిపోవడం, తలను నిలబెట్టలేకపోవడం వంటి రుగ్మతలతో సతమతమవుతున్న చిన్నారికి ఎండోస్కోపిక్‌ థర్డ్‌ వెంట్రిక్యులాస్టమి (ఈటీవీ) విధానంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చికిత్స చేశారు. మెదడులోని నీరు తొలగించారు. ఈ వివరాలను కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ ఎం.ప్రేమ్‌జిత్‌ రే మంగళవారం విలేకరులకు వెల్లడించారు. 
మలికిపురం గ్రామానికి చెందిన రాపాక నాగరాజు, కనకదుర్గ దంపతులకు తొలి కాన్పులో నాలుగు నెలల కిందట పాప జన్మించింది. ప్రైవేట్‌ ఆసుపత్రిలో సిజేరియన్‌ చేశారు. పాప పుట్టినప్పటి నుంచి తల సైజు పెరగటం, తల నిలబెట్టలేకపోవడం, ఆకలి మందగించడం, తలతిరగటం వంటి లక్షణాలను తల్లిదండ్రులు గుర్తించి పలువురు వైద్యులకు చూపించారు. చిన్నారికి మైక్రోస్కోపిక్‌ స్టంట్స్‌ ద్వారా పైపులు వేయాలని, రిస్క్‌తో కూడుకున్న ఆపరేషన్‌ అని, ఇందుకు చాలా ఖర్చవుతుందని చెప్పడంతో ఆర్థిక స్తోమత లేని వీరు తమ చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చి 2వ తేదీన చేర్పించారు. చిన్నారిని పరీక్షించిన న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ ప్రేమ్‌జిత్‌ రే ఎండో స్కోపిక్‌ థర్డ్‌ వెంట్రిక్యులాస్టమీ (ఈటీవీ) ఆధునిక పరిజ్ఞానంతో శస్త్రచికిత్స నిర్వహించారు. మార్చి 18న మైక్రోస్కోపిక్‌ స్టంట్స్‌ ద్వారా తలకు ఎటువంటి పైపులు వేయకుండా, ఎండోస్కోపిక్‌ సర్జరీతో కేవలం గంట వ్యవధిలో నీటిని తొలగించారు. ఎండోస్కోపిక్‌ సర్జరీని చిన్నారికి జీజీహెచ్‌లో నిర్వహించడం ఇదే తొలిసారని విభాగాధిపతి డాక్టర్‌ ప్రేమ్‌జిత్‌ రే తెలిపారు.  పదిరోజుల తర్వాత పూర్తిగా కోలుకున్న తర్వాత చిన్నారిని డిశ్చార్జి చేసినట్టు తెలిపారు. శస్త్రచికిత్సలో తనతో పాటూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ గిరి, మత్తు వైద్యులతో పాటూ పీజీ వైద్యులు పాల్గొన్నట్టు తెలిపారు. ఆపరేషన్‌కు రూ.2 లక్షలు ఖర్చవుతుందని ప్రైవేట్‌ వైద్యులు తెలపడంతో నిరుపేదలమైన తాము చిన్నారి జీవితంపై ఆశ వదులుకున్నామన్నారు. అలాంటి దశలో జీజీహెచ్‌ వైద్యులు ఉచితంగా వైద్యం చేశారని తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా