బాలుడి ప్రాణాలు కాపాడిన జీజీహెచ్‌

12 Dec, 2016 14:48 IST|Sakshi
బాలుడి ప్రాణాలు కాపాడిన జీజీహెచ్‌
* అరుదైన వ్యాధికి మెరుగైన చికిత్స
జీజీహెచ్‌ డిప్యూటీ సూపరింటెండెంట్, పిల్లల వైద్య విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ యశోధర 
 
గుంటూరు మెడికల్‌: చాలా అరుదుగా సంభవించే వ్యాధికి గురైన పిల్లవాడికి సకాలంలో మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడినట్లు జీజీహెచ్‌ డిప్యూటీ సూపరింటెండెంట్, పిల్లల వైద్య విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ పెనుగొండ యశోధర చెప్పారు. పిల్లవాడి ఆరోగ్యం కుదుట పడటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తున్నట్లు మంగళవారం మీడియాకు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన ఎనిదేళ్ల దోసూరి బాలవెంకటేష్‌ గత నెలలో జ్వరం సోకి స్థానిక ఆస్పత్రిలో చేరాడు. కొద్దిరోజుల పాటు ఆస్పత్రిలో ఉన్న తర్వాత జ్వరం తగ్గడంతో బాలవెంకటేష్‌ను ఇంటికి పంపించారు. ఇంటికి వెళ్లిన కొద్ది రోజులకే జ్వరం వచ్చి కాళ్లు, చేతులు పక్షవాతం వచ్చిన వారికి మాదిరిగా తయారై మాట తబడుతుండటంతో తల్లిదండ్రులు నాగమణి, చంద్రయ్య స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని, తామేం చేయలేమని అక్కడి వైద్యులు చేతులెత్తేసినట్లు చెప్పారు. దీంతో తల్లిదండ్రులు బాలుడిని తీసుకుని నవంబర్‌ 23వ తేదీన గుంటూరు జీజీహెచ్‌కు వచ్చినట్లు తెలిపారు. పిల్లల వైద్యులు పరీక్షలు చేసి గులియన్‌ బ్యారీ సిండ్రోమ్‌ వ్యాధి ఉన్నట్లుగా నిర్థారించారు. పదివేల మంది చిన్నారుల్లో ఒక్కరికి ఇలాంటి వ్యాధి సోకుతుందని డాక్టర్‌ యశోధర చెప్పారు. వ్యాధితో పాటుగా పిల్లవాడు శ్వాసకోశ సమస్యతో బాధపడుతూ ఊపిరి పీల్చుకునేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించారు. ఐసీయూలో వెంటిలేటర్‌ చికిత్స అందించి దాంతో పాటు ఇమ్యూనోగ్లోబిన్‌ ఇవ్వడం ద్వారా పిల్లవాడి ప్రాణాలు నిలిచినట్లు తెలిపారు. సుమారు రూ.మూడు  లక్షల ఖరీదుచేసే వైద్య సేవలను ఆస్పత్రిలో ఉచితంగా అందించినట్లు తెలిపారు. జీజీహెచ్‌లో కార్పొరేట్‌ ఆస్పత్రులకు తగ్గట్టుగా వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆమె వివరించారు.
>
మరిన్ని వార్తలు