ఆఇంట మహాలక్ష్మికి అప్పుడే నూరేళ్లు నిండాయి

14 Jul, 2017 23:15 IST|Sakshi

వంట చేయబోయి బాలిక మృత్యువాత
శరీరమంతా ఎగిసిన మంటలు
శోకసంద్రంలో పాల్తూరు

 
కష్టాన్నే నమ్ముకున్న ఆ దంపతులకు నలుగురు సంతానం. ఆస్తి పాస్తులు పెద్దగా లేవు.. బతకడానికి ఏ ఆధారంలేదు..కష్టమే వారి జీవనాధారం..కూలి పనికి పోతేనే పూట గడుస్తుంది. మొదటి సంతానంగా మా ఇంట మహాలక్ష్మి పుట్టిందని మురిసిపోయారు. అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. అమ్మానాన్న పనులకెళ్లినా .. ఇంటి పట్టున చెల్లెల్లు, తమ్ముడికి అక్కలా.. అమ్మలా అన్నీ తానై మెలిగేది. ఆడుతూ పాడుతూ ఆ ఇంట తిరిగే ఆ ఇంటి వరలక్ష్మిని చూసి విధి ఓర్చుకోలేకపోయింది. అమ్మలా అన్నం చేస్తుండగా .. అగ్ని ప్రమాదం రూపంలో ఆయువు తీసుకుంది. కళ్లముందు కనకమహాలక్ష్మిగా గెంతులేయాల్సిన ఆచిట్టితల్లికి అప్పుడే వందేళ్లు నిండాయన్న విషయం తెలిసి ఆదంపతులు గుండెలవిసేలా విలపించారు. ఊరంతా శోకసంద్రంలో మునిగిపోయింది.

విడపనకల్లు (ఉరవకొండ) : విడపనకల్లు మండలం పాల్తూరుకు చెందిన కట్టతిప్పన్నగారి లక్ష్మీ, చెన్నయ్య దంపతులు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. దంపతులిద్దరూ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. శుక్రవారం ఉదయమే చెన్నయ్య పొలానికెళ్లాడు. అన్నం చేసిన తర్వాత లక్ష్మీ కూడా భర్తకు పొలం పనుల్లో తోడుగా ఉండేందుకు బయల్దేరింది. వెళుతూ వెళుతూ ‘పప్పు’ చేసి పెట్టి వెళ్లమ్మా అంటూ ఏడో తరగతి చదివే పెద్ద కుమార్తె వరలక్ష్మి (13)కి చెప్పింది. సరే అని ఆ అమ్మాయి కట్టెల పొయ్యి వెలిగించి పప్పు చేసేందుకు ఉపక్రమించింది. మిగతా ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడు ఆడుకునేందుకు బయటకు వెళ్లిపోయారు.

ఈ సమయంలో గోడపై పోపు సామాన్లు తీసుకుంటుండగా అక్కడే ఉన్న కిరోసిన్‌ డబ్బా కిందకు పడింది. కొంత అమ్మాయి శరీరంపైకి, మరికొంత మండుతున్న పొయ్యిలోకి ఎగిసిపడింది. అంతే ఒక్క ఉదుటున అగ్నికీలలు వరలక్ష్మిని చుట్టుముట్టాయి. మంటలకు తాళలేక గట్టిగా కేకలు వేసింది. ఇరుగుపొరుగు వారు వచ్చి మంటలు ఆర్పివేశారు. అయితే అప్పటికే శరీరం పూర్తిగా కాలిపోయింది. తల్లిదండ్రులు పొలంలోంచి పరుగులు తీసుకుంటూ ఇంటికి చేరుకున్నారు. బాధ తట్టుకోలేక విలవిలలాడుతున్న కుమార్తెను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడి వైద్యుల సూచన మేరకు అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడే మృతి చెందింది. వరలక్ష్మి మృతితో పాల్తూరు శోకసంద్రంలో మునిగిపోయింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ మురళీ తెలిపారు.

మరిన్ని వార్తలు