‘పసిమొగ్గపై పైశాచికం’పై కదలిన పోలీసులు

1 Jun, 2017 00:13 IST|Sakshi
  • అఘమేఘాలపై అదుపులోకి నిందితుడు
  • సాక్షి ఎఫెక్ట్‌
  • సాక్షిప్రతినిధి, కాకినాడ :

    ‘పసిమొగ్గపై పైశాచికం’శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం.. పోలీసు అధికారుల్లో కదలిక తెచ్చింది. బాలికపై లైంగికదాడికి పాల్పడ్డ మానవ మృగానికి అండదండలు అందించి కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించిన ముఖ్యనేత సహా చోటామోటా నాయకులు తోకముడిచారు. కాకినాడ నగరంలోని ఏటిమొగ కొండబాబు కాలనీలో ఐదేళ్ల వయసు కలిగిన చిన్నారిపై లైంగికదాడికి పాల్పడ్డ అదే ప్రాంతానికి చెందిన నిందితుడు పెమ్మాడి ముని అనే యువకుడిని అరెస్టు చేయకుండా కేసును మాఫీ చేసేందుకు ఒక ముఖ్యనేత ద్వారా రాజీ ప్రయత్నాలు, రూ.రెండున్నర లక్షలకు బేరం పెట్టిన విషయాన్ని ‘సాక్షి’వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. నిందితుడి తరఫున కొమ్ముకాస్తోన్న స్థానిక నేతల ద్వారా కుటుంబ సభ్యులు బుధవారం మరోసారి ముఖ్యనేత వద్దకు వెళ్లి రాజీ చేయాలని ప్రయత్నించారు. అయితే ఈ ఘోరాన్ని ‘సాక్షి’బయటపెట్టడంతో ఆ ముఖ్యనేత వెనుకడుగు వేసి ఈ వ్యవహారంలో లాగొద్దని చెప్పి పంపేశారని సమాచారం. ఈ క్రమంలో మహిళా, ప్రజాసంఘాలు రోడ్డెక్కుతాయనే భయంతో అధికార పార్టీ నేతలు వెనకడుగు వేశారు. ఇంతలో జిల్లా పోలీసు ఉన్నతాధి కారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని నిందితుడిని అరెస్టు చేయాలని కింది స్థాయి పోలీసు అధికారులను బుధవారం ఆదేశించారు. ఈ క్రమంలో స్పెషల్‌ పార్టీ పోలీసులు తెల్లవారుజామున నిందితుడిని అదుపులోకి తీసుకుని పోర్టు పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ విషయాన్ని పోర్టు సీఐ రాజశేఖర్‌ ధ్రువీకరించారు. నిందితుడిని అదుపులోకి తీసుకోవడం వాస్తవమేనని, కేసు నమోదు చేసి ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకోవడానికి కారణమైన ‘సాక్షి’కి స్థానికులు కృతజ్ఞతలు తెలియచేశారు. 
     
>
మరిన్ని వార్తలు