లంచం ఇస్తేనే ఆన్‌లైన్‌

26 Aug, 2016 04:06 IST|Sakshi
లంచం ఇస్తేనే ఆన్‌లైన్‌

 రాయచోటి:

రాయచోటి నియోజకవర్గ పరిధిలో లంచం ఇస్తే గాని భూముల వివరాలు ఆన్‌లైన్‌ చేయడం లేదని రైతులు వాపోతున్నారు. ఇటీవల ప్రభుత్వం వెబ్‌ల్యాండ్‌లో భూమి వివరాలు నమోదు చేస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్నా, ఆ వెబ్‌ల్యాండ్‌లో  వివరాలు తప్పుల తడకగా నమోదు  చేశారు. భూమి ఒకరి పేరుతో ఉంటే ఖాతా నెంబర్‌ మరొకరి పేరుతో ఉంటోంది. విస్తీర్ణం తక్కువగానో, ఎక్కువగానో నమోదు చేశారు. అలాగే సర్వే నెంబర్లు కూడా ఇష్టానుసారం నమోదు చేశారు. రాయచోటి మండలంలో  ఇప్పటికి వెబ్‌ల్యాండ్‌ వివరాలు సక్రమంగా నమోదు చేయలేదు. సంబేపల్లె మండలంలో ఆన్‌లైన్‌ పూర్తి స్థాయిలో  చేయక పోవడంతో మీ సేవలో 1బి రాక పలువురు రైతులు పంట రుణాలను నేటికీ రెన్యువల్‌ చేసుకోలేకపోతున్నారు. దీంతో పంటల బీమా   రుసుము కూడా చెల్లించలేక పోయారు. లక్కిరెడ్డిపల్లె మండలంలో కాకుళారం గ్రామం మిద్దెల వాండ్లపల్లెలో ఒక రైతుకు సంబంధించిన పొలాన్ని మరొక రైతు పేరుతో ఆన్‌లైన్‌ చేయడంతో  అక్కడ రైతుల మధ్య తగాదాకు దారితీసింది. కుర్నూతల, కస్తూరిరాజుగారిపల్లె  గ్రామాల రెవెన్యూ రికార్డులు గందరగోళంగా మార్చడంతో పనులు సక్రమంగా జరగక రైతులు గగ్గోలు పెడుతున్నారు.  
 ఆన్‌లైన్‌ కోసం నెల రోజులుగా తిరుగుతున్నా
ఆన్‌లైన్‌ కోసం నెల రోజులుగా తిరుగుతున్నా పని జరగడం లేదు. అధికారులను అడిగితే చూస్తాం,  చేస్తాం అంటున్నారు. మీ సేవకు వెళితే వన్‌బీ రావడం లేదు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో లేని భూములకు వెబ్‌ల్యాండ్‌ ద్వారా పాసుపుస్తకాలు రద్దు చేస్తారేమోనని భయంగా ఉంది.
– లక్ష్మినారాయణ, బొట్ల చెరువు, రాయచోటి.
మ్యుటేషన్‌ కోసం  ఏడాదిగా తిరుగుతున్నా
గతంలో మా తండ్రి పేరుతో ఉన్న  పట్టాదారు పాసుపుస్తకాన్ని తల్లి పేరుతో మార్చుకొనేందుకు ఏడాదిగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా మార్పు చేయలేదు. దీంతో బ్యాంక్‌లో పంట రుణాలు పొందలేక పోతున్నాము.
– రెడ్డెయ్య,  మిట్టావాండ్లపల్లె, రాయచోటి
 
వెబ్‌ల్యాండ్‌తో ఆందోళన అవసరం లేదు:
వెబ్‌ల్యాండ్‌తో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్ది త్వరలోనే  రైతులందరికీ సక్రమమైన సమాచారాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. రైతులందరి భూముల వివరాలతో సహా ఆన్‌లైన్‌లో ఉంచుతాము.  
 గుణభూషణ్‌రెడ్డి, తహసీల్దార్, రాయచోటి.

>
మరిన్ని వార్తలు