వైభవం.. జ్యోతి మహోత్సవం

3 Apr, 2017 00:00 IST|Sakshi
వైభవం.. జ్యోతి మహోత్సవం
నందవరం(బనగానపల్లె రూరల్‌) : గ్రామంలోని  చౌడేశ్వరిదేవి రాయబారాది, జ్యోతి, రథ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం జ్యోతి మహోత్సవం ఆలయ ఈఓ రామానుజన్, పాలక మండలి సభ్యుడు పీవీ కుమార్‌రెడ్డి, గ్రామపెద్దల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి  భాస్కరయ్య ఆచారి ఆధ్వర్యంలో చౌడేశ్వరిదేవి అమ్మవారికి దిష్టి చుక్కపెట్టు కార్యక్రమం సంప్రదాయబద్ధంగా జరిగింది. అనంతరం గ్రామంలోని చెన్నకేశస్వామి ఆలయ ఆవరణ నుంచి జ్యోతి మహోత్సవం నిర్వహించారు.
 
మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన చౌడేశ్వరిదేవి భక్తులు, తొగట వీరక్షత్రియులు అవు నెయ్యి, గోధుమ పిండి, బెల్లం పాకంతో తయారు చేసిన సుమారు 460 జ్యోతులను తలపై పెట్టుకుని చౌడేశ్వరిదేవి భక్తిగీతాలు పాడుతూ, కాళిక నృత్యం చేసుకుంటూ అమ్మవారి ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసిన అగ్నిగుండం వద్దకు చేరుకున్నారు. భక్తులు గుండంలో నడిచి తమ మొక్కులు చెల్లించారు. అనంతరం అమ్మవారికి పట్టుచీర, నైవేద్యం సమర్పించారు.
 
పాణ్యం సీఐ పార్థసారథిరెడ్డి, నందివర్గం ఎస్‌ఐ హనుమంతరెడ్డిల ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం బనగానపల్లె ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి అమ్మవారి రథోత్సవం(పోవడం) జరిగింది.  గ్రామంలోని ఆలయ ప్రధాన రహదారులు జనసంద్రంగా మారాయి.
 
మరిన్ని వార్తలు