మొక్కలకు ‘గ్లూకోజ్‌’

25 Aug, 2016 19:58 IST|Sakshi
మొక్కలకు సెలైన్‌ బాటిళ్లు కడుతున్న విద్యార్థులు
  • సంరక్షణలో భాగంగా నీటి వసతి
  • విద్యార్థుల వినూత్న ఆలోచన
  • రామాయంపేట: నాటిన మొక్కల్ని సంరక్షించేందుకు విద్యార్థులు వినూత్నంగా ఆలోచించారు. వారికి ఉపాధ్యాయులు తోడయ్యారు. ఈక్రమంలో ఒక్కో విద్యార్థి.. ఒక్కో మొక్కను దత్తత తీసుకున్నారు. ఆపై ఖాళీ గ్లూకోజ్‌ బాటిళ్లు కట్టి.. ఒక్కో చుక్క పడేలా ఏర్పాట్లు చేశారు.

    రామాయంపేట మండలంలోని కాట్రియాల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం 247 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇటీవల హరితహారం కార్యక్రమం కింద పాఠశాల ఆవరణలో సుమారు 100 మొక్కలు నాటారు. కాగా, నాటిన మొక్కల్ని సంరక్షించుకునేందుకు వినూత్నంగా ఆలోచించారు. ఉపాధ్యాయులకు ఈ విషయం తెలుపగా.. ఒక్కో మొక్కను ఒక్కో విద్యార్థికి దత్తత ఇచ్చారు. ఈ మేరకు మొక్కల సంరక్షణ, వాటికి ప్రతిరోజు నీరు పోసే విధానంపై టీచర్లతో కలిసి అభిప్రాయాలు పంచుకున్నారు. దత్తత తీసుకున్న మొక్కలకు విద్యార్థుళు రాఖీలు కట్టారు. ప్రైవేటు ఆస్పత్రుల నుంచి ఖాళీ గ్లూకోజ్‌ బాటిళ్లు తీసుకొచ్చి.. మొక్కల పైభాగంలో ఏర్పాటు చేశారు. చుక్క చుక్క పడేలా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులంతా ఒకే రోజు ఈ కార్యక్రమం చేపట్టడం విశేషం.

    విద్యార్థుల ఆలోచన
    నాటిన మొక్కల్ని సంరక్షించుకునేందుకు విద్యార్థులు కొత్తగా ఆలోచించారు. ఖాళీ సెలైన్‌ బాటిళ్లు సేకరించి మొక్కలకు కట్టారు. మొక్క నాది అనే భావన వారిలో కలిగింది. - బి తిరుపతి, హెచ్‌ఎం

    మొక్కలకు రాఖీ కట్టాం
    మొక్కల్ని అందరం దత్తత తీసుకున్నాం. అట్టపై మా పేర్లు రాసి మొక్కలకు కట్టాం. రాఖీలు కూడా కట్టాం. టీచర్లు చాలా హెల్ప్‌ చేశారు. ప్రతిరోజు బాటిళ్లలో నీళ్లు పోస్తున్నాం. - రమ్య, పదో తరగతి

    మొక్కలకు మా పేర్లు
    మొక్కలకు మా పేర్లు పెట్టారు. దీంతో రోజు వాటికి నీళ్లు పోస్తున్నాం. టీచర్లు కొత్తగా ఆలోచించి, సూచనలు ఇస్తున్నారు. మొక్కలు ఎండిపోకుండా చూస్తున్నాం. - శేఖర్‌, తొమ్మిదో తరగతి

మరిన్ని వార్తలు