కంచె దాటిన కరుణ

31 Dec, 2016 02:55 IST|Sakshi
కంచె దాటిన కరుణ

మిత్రపక్షమైన బీజేపీపై టీడీపీ సర్కారు ఉదారత
300 గజాలకు మించి ఇచ్చే అవకాశం లేకున్నా.. విశాఖలో బీజేపీ కార్యాలయానికి 87 సెంట్ల భూమి
రూ.55 కోట్ల విలువైన భూమికి ఏడాదికి రూ.870 లీజు రేటు
 పాత జీవోకు తూట్లు పొడిచి.. 526 జీవో జారీ చేసిన సర్కార్‌


కంచే చేను మేసింది.. తాను జారీ చేసిన జీవోకే సర్కారు తూట్లు పొడిచింది. రాజకీయ పార్టీల కార్యాలయాలకు స్థలాల కేటాయింపునకు సంబంధించిన జీవోకు అదే గతి పట్టింది.  ఇప్పటికే వందల కోట్ల విలువైన భూములను తమ తాబేదార్లకు.. అంతేవాసులకు కట్టబెట్టేస్తున్న టీడీపీ సర్కారు.. తాజాగా తన మిత్రపక్షమైన బీజేపీ విషయంలోనూ అదే ఉదారత చూపింది.  అడిగిందే తడవుగా.. నిబంధనలకు విరుద్ధంగా అత్యంత నామమాత్రపు ధరకు నగరంలోని ఖరీదైన ప్రాంతంలో స్థలాన్ని అప్పగించికమలంపై అలవిమాలిన కరుణ చూపింది. అందుకు అడ్డుపడుతున్న జీవోనే సవరించేసింది.

విశాఖపట్నం:గతంలో ఎన్నడూ లేని కొత్త సంస్కృతికి రాష్ట్ర సర్కార్‌ శ్రీకారం చుట్టింది. భారతీయ జనతా పార్టీకి కార్యాలయ నిర్మాణానికి విశాఖ నడిబొడ్డున అత్యంత ఖరీదైన స్థలాన్ని దాదాపు ఉచితంగా కట్టబెట్టింది. తాను తెచ్చిన జీవోలోని నిబం«ధనలనే ఖాతరు చేయకుండా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా భూకేటాయింపులు జరిపింది.

పరిమితులు ఇలా..
రాజకీయ పార్టీల కార్యాలయాలకు స్థలాల కేటాయింపునకు సంబంధించి కొద్ది నెలల క్రితం రాష్ట్ర కేబినెట్‌లో చర్చించి కొన్ని నిబంధనలు రూపొందించారు. ఆ మేరకు ఈ ఏడాది జూలై 21న ప్రభుత్వం జీవో నెం. 340 జారీ చేసింది. ఆ జీవో

ప్రకారం అసెంబ్లీలో పార్టీల సభ్యుల సంఖ్యను బట్టి కార్యాలయాల నిర్మాణాలకు భూ కేటాయింపులు జరపాలి.  50 శాతానికిపైగా సంఖ్యాబలం ఉన్న పార్టీలకు రాజధానిలో 4 ఎకరాలు, జిల్లా కేంద్రాల్లో 2 ఎకరాలు కేటాయించొచ్చు.  అదే 25 నుంచి 50 శాతం మధ్య సభ్యులుంటే రాజధానిలో అర ఎకరం, జిల్లా కేంద్రాల్లో వెయ్యి గజాలు కేటాయించొచ్చు.  25 శాతం లోపు సభ్యులున్న పార్టీలకు రాజధానిలో వెయ్యి చదరపు గజాలు, జిల్లా కేంద్రాల్లో 300 చదరపు గజాలకు మించి స్థలాలు కేటాయించడానికి వీల్లేదు. 

నిబంధనలు కాదంటున్నా..
జీవోలోని గైడ్‌లైన్స్‌ ప్రకారం చూస్తే అసెంబ్లీలో బీజేపీకి ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే జిల్లా కేంద్రాల్లో ఆ పార్టీకి 300 చదరపు గజాలకు మించి భూమి కేటాయించడానికి వీల్లేదు. కానీ బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు విశాఖపట్నం నడిబొడ్డున చినవాల్తేరులోని సర్వే నెం.13లో ఉన్న 87 సెంట్ల స్థలాన్ని తమ కార్యాలయం కోసం కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. పైగా ఎకరా రూ. 10 లక్షల ధరకు కేటాయించాలని లేదా ఏడాదికి ఎకరాకు రూ.వెయ్యి రేటుతో  99 ఏళ్లకు లీజుకివ్వాలని ఆ లేఖలో ఎమ్మెల్యే కోరారు. నిబంధనలు అంగీకరించకపోయినా ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్కెట్‌ విలువ ప్రకారం చదరపు గజం రూ.55వేల ధరకు కేటాయించేందుకు వీలుగా జిల్లా కలెక్టర్‌ ప్రవీణŠæకుమార్‌ ప్రతిపాదనలు పంపించారు. అంటే.. 87 సెంట్ల(4176 చదరపు గజాల)స్థలం విలువ రూ.22.96 కోట్లన్న మాట.  

కలెక్టర్‌ ప్రతిపాదననూ తోసిరాజని..
కలెక్టర్‌ పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అండ్‌ చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వాదేశాల మేరకు జీవో 340ను సవరించి మరీ బీజేపీ కార్యాలయానికి 87 సెంట్ల çస్థలాన్ని కేటాయించారు. కలెక్టర్‌ గజం రూ.55 వేల ధర సిఫార్సు చేస్తే.. దాన్ని కాదని ఏడాదికి ఎకరాకు రూ.వెయ్యి లీజుకే 33 ఏళ్లకు కేటాయిస్తూ జీవో 526ను జారీ చేసింది. అంటే 87 సెంట్ల స్థలానికి ఏడాదికి రూ.870 లీజు ధరకే కట్టబెట్టారన్నమాట. తదుపరి చర్యల నిమిత్తం జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌కు అధికారమిస్తూ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జేసీ శర్మ ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీలో కనీసం పదిశాతం సభ్యులు కూడా లేని బీజేపికి ఏకంగా కోట్ల విలువైన 87 సెంట్ల భూమిని కేటాయించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు