ఇక్కడా బ్రాండ్ మిక్సింగ్?

11 Jun, 2016 12:32 IST|Sakshi
ఇక్కడా బ్రాండ్ మిక్సింగ్?

విజయనగరం: తూర్పు గోదావరికి చెందిన మధ్యవర్తి ద్వారా అనంతపురానికి చెందిన బడా వ్యాపారి జిల్లాకు గోవా మద్యం దిగుమతి చేసిన వ్యవహారం ఏడాదిన్నర క్రితం వెలుగులోకి వచ్చింది. గోవా మద్యం బయట కనబడకుండా బావిలో దాచిన భాగోతం జామి, కొత్తవలస మండలాల్లోని పలుచోట్ల బయటపడింది. అప్పట్లో ఈ ఘటనకు సంబంధించి ఐదుగుర్ని అరెస్టు చేశారు. కేసును లోతుగా విచారించేందుకు ప్రత్యేక బృందాన్ని కూడా నియమించారు. దీంతో గోవా మద్యం దిగుమతికి కాసింత అడ్డుకట్ట పడింది.  

కొన్ని నెలలుగా ఒడిశా మద్యం జిల్లాకు దిగుమతి అవుతోంది. ప్రస్తుతం ప్రభుత్వమిస్తున్న మార్జిన్ ఎటూ చాలలేదన్న ఉద్దేశంతో కొందరు వ్యాపారులు ఒడిశా మద్యాన్ని గుట్టుగా జిల్లాకు రప్పిస్తున్నట్టు తెలుస్తోంది.
 
ఒడిశాలో తక్కువకే మద్యం

మన రేటు కన్న ఒడిశాలో 20శాతం తక్కువకు వస్తుండటంతో అక్కడి నుంచి దిగుమతి చేస్తున్నారు. రాయఘడ, గుణుపూర్, సుంకి మీదుగా తీసుకొచ్చే సరకును పార్వతీపురానికి చెందిన కొందరు స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గల శివారు కాలనీల్లో నిల్వ చేస్తున్నట్టు తెలిసింది. ఇక్కడి నుంచే అనకాపల్లి, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు లారీల ద్వారా తరలిస్తున్నట్టు సమాచారం. అక్కడినుంచి వచ్చే మద్యాన్ని మన ప్రాంతానికి చెందిన మద్యంతో కలిపి విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల ప్రభుత్వానికి ట్యాక్స్ ద్వారా వెళ్లాల్సిన ఆదాయానికి గండి పడుతున్నది.
 
మిక్సింగ్‌పై ఫిర్యాదులున్నాయి
ఇదే విషయమై ఎక్సైజ్ శాఖ విజయనగరం డివిజన్ సూపరింటెండెంట్ ఎ.శంభుప్రసాద్‌ను ‘సాక్షి’ ప్రశ్నించగా బ్రాండ్ మిక్సింగ్ జరుగుతున్నట్టు తమకు ఫిర్యాదులు ఉన్నాయన్నారు. కాకపోతే, తాము నిర్వహించిన దాడుల్లో ఎక్కడా దొరకలేదన్నారు. శుక్రవారం కూడా 207మద్యం దుకాణాలు, 28బార్ అండ్ రెస్టారెంట్‌లలో తనిఖీలు చేశామన్నారు. కానీ ఎక్కడా బయటపడలేదన్నారు.
 
ప్రస్తుతం బ్రాండ్ మిక్సింగ్
ఒకవైపు ఒడిశా మద్యాన్ని వాడుతున్నారు. మరోవైపు ఎంఆర్‌పీకి మించి విక్రయాలు చేపడుతున్నారు. ఇది చాలదన్నట్టు కొందరు బ్రాండ్ మిక్సింగ్‌కు పాల్పడుతున్నారు. ప్రీమియర్ బ్రాండ్ మద్యంలో రూ. 40 చీప్ లిక్కర్ కల్తీ చేస్తున్నట్టు తెలుస్తోంది. విజయనగరం, పార్వతీపురంలో గల పలు బార్ అండ్ రెస్టారెంట్లలోనూ, గ్రామీణ ప్రాంతంలో విచ్చల విడిగా నడుస్తున్న బెల్ట్‌షాపుల్లో ఈ కల్తీ బాగోతం కొనసాగుతోంది. బ్రాండెడ్ మద్యం బాటిళ్ల మూతలు తీసేసి, చీప్ లిక్కర్‌ను కలిపిన తర్వాత అనుమానం రాకుండా మళ్లీ కొత్త మూతలు అమర్చుతున్నట్టు తెలిసింది. ఆ మూతలు ఎక్కడి నుంచి వస్తున్నాయన్నది అంతుచిక్కడంలేదు.
 
ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ చూసీ చూడనట్టు వదిలేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకరిద్దరు కింద స్థాయి అధికారులు  ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చినా వాటి జోలికెళ్లొద్దని హెచ్చరించినట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు