గోల్‌మాల్‌!

22 Jul, 2017 21:51 IST|Sakshi
గోల్‌మాల్‌!

క్రీడా సామగ్రి కొనుగోలు అక్రమాలు
కంపెనీ పేరుమార్చి రూ. లక్షల్లో స్వాహా
జిల్లా వ్యాప్తంగా 3,703 ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ..


అమడగూరు: విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని అభివృద్ధి పరిచేందుకు అవసరమైన క్రీడా సామగ్రి కొనుగోలులో భారీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ఈ ఏడాది విద్యాసంవత్సరం ఆరంభం కాగానే జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని రకాల 3,703 (2,647 ప్రాథమిక, 587 ప్రాథమికోన్నత, 469 ఉన్నత)  ప్రభుత్వ పాఠశాలలకు ఓ ప్రైవేట్‌ కంపెనీ ద్వారా క్రీడా సామగ్రిని సమకూర్చారు. అయితే ఈ మొత్తం తంతులో సుమారు రూ. కోటి వరకూ అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ఇండెంట్‌లో కేటాయించిన కంపెనీ ఉత్పత్తులు కాకుండా మరో కంపెనీ ఉత్పత్తులను సరఫరా చేయడం ద్వారా అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

క్రీడా సామగ్రి పంపిణీ బాధ్యతను తీసుకున్న నేషనల్‌ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌.. నాణ్యత లేని క్రీడా పరికరాలను పంపిణీ చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఎనిమిది రకాల క్రీడా సామగ్రి కిట్‌ను ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలకు వ్యాట్‌ ధరతో కలిపి రూ 4,968, ప్రాథమిక పాఠశాలకు రూ 5,003 ధరతో పంపిణీ చేస్తున్నారు. అయితే బయటి మార్కెట్‌లో ఇవే ఎనిమిది రకాల ఆట వస్తువులు తక్కువ ధరకు లభ్యమవుతున్నాయి. బాల్‌బాడ్మింటన్‌ నెట్‌లు ఇచ్చారు కానీ బాల్స్‌, బ్యాట్‌లు ఇవ్వలేదు. నాణ్యత లేని ఈ పరికరాలను ఆయా పాఠశాలల పీఈటీలు తిరస్కరిస్తుంటే వాటిని బలవంతంగా పాఠశాలలకు ఎమ్మార్సీ సిబ్బంది చేరవేస్తున్నారు.

ఎస్‌ఎస్‌ఏ పీఓ ఎమన్నారంటే..
పాఠశాలలకు నాసిరకం క్రీడా సామగ్రిని పంపిణీ చేస్తుండటంపై ఎస్‌ఎస్‌ఏ పీఓ సుబ్రహ్మణ్యంను వివరణ కోరగా..  తాను నూతనంగా బాధ్యతలు స్వీకరించానని, ఏఎంఓను వివరణ అడగమన్నారు. ఇదే విషయంపై ఏఎంఓ చెన్నకృష్ణారెడ్డిని వివరణ కోరగా.. క్రీడా సామగ్రి పరికరాల ఎంపిక జిల్లా అధికారుల చేతుల్లో లేదని, ఈ పరికరాలన్నీ రాష్ట్ర కార్యాలయం నుంచే వచ్చాయని, అక్కడే టెండర్లు పిలిచి, పంపిణీదారుని ఖరారు చేశారని తెలిపారు. రాష్ట్ర కార్యాలయం నుంచి అందిన క్రీడా సామగ్రిని మాత్రమే తాము పాఠశాలలకు చేరవేస్తున్నామని స్పష్టం చేశారు.

కిట్‌లోని క్రీడాపరికరాల వివరాలు, వాటి ధరలు ఇలా
క్రీడా పరికరం               సంఖ్య     పంపిణీ ధర                మార్కెట్‌ ధర
టెన్నీకాయిట్‌ రింగ్స్‌         5         రూ.485.70               రూ.260
బాల్‌ బ్యాడ్మింటన్‌ నెట్‌      1         రూ.271.43               రూ.200
స్కిప్పింగ్‌ రోప్స్‌               9         రూ.437.13               రూ.270
కోన్స్‌                           6         రూ.408.60               రూ.408
వాలీబాల్‌                      1         రూ.914.29               రూ.300
వాలీబాల్‌ నెట్‌                1         రూ.695.24                రూ.400
హూప్స్‌                        5         రూ.542.85               రూ.300
క్యారమ్‌బోర్డ్‌                    1         రూ.976.19                రూ.580
మొత్తం (వ్యాట్‌ ధర అదనం)        రూ.4,731.43               రూ.2,718 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా