భక్తుల చెంతకే భగవంతుడు

13 Jan, 2017 21:33 IST|Sakshi
భక్తుల చెంతకే భగవంతుడు
- రేపటి నుంచి అహోబిలేశుడి పార్వేట మహోత్సవాలు  
- 33 గ్రామాల్లో 45 రోజుల పాటు స్వామివారి పర్యటన
- పెళ్లి పిలుపునకు గ్రామాలకు తరలివస్తున్న భగవంతుడు
 
ఆళ్లగడ్డ  :  తన కల్యాణోత్సవానికి పరిసర ప్రాంతాల్లోని గ్రామాల వారిని ఆహ్వానించడంలో భాగంగా శ్రీ అహోబిలేశుడు చేపట్టే పార్వేట మహోత్సవం సోమవారం ప్రారంభం కానుంది. పార్వేట మహోత్సవ పూర్వపరాల్లోకి వెళ్తే..  కర్ణాటక రాష్ట్రం మేల్కోటెలో జన్మించిన కిడాంబి చళ్లపిళ్లై శ్రీనివాసాచార్యులు కాంచీపురంలో వేదాంత కాలక్షేపం చేస్తున్న సమయంలో శ్రీలక్ష్మినరసింహస్వామి కలలో సాక్షాత్కరించి అహోబిలం చేరుకోవాలని చెప్పారు. స్వామి ఆజ్ఞానుసారం ఆయన క్షేత్రం చేరగానే వృద్ధ సన్యాసి రూపంలో దర్శనమిచ్చి శ్రీనివాసాచార్యులకు సన్యాసాన్ని అనుగ్రహించారు. సాక్షాత్తు దేవదేవుడి చేతుల మీదుగా సన్యాసాన్ని స్వీకరించిన శ్రీనివాసాచార్యులు ‘ఆదివన్‌ శఠగోప యతీంద్ర మహాదేశికన్‌ ’ అనే సన్యాస ఆశ్రమ నామాన్ని స్వీకరించి ‘శ్రీ అహోబిల మఠం’ ను స్థాపించి మెట్టమెదటి పీఠాధిపతి అయ్యారు. అప్పుడు స్వామివారు పీఠాధిపతులవారితో ‘గ్రామే గ్రామే చగత్వాపద చరణ యో ... మాంగృహీత్వ (భక్తుల చెంతకే భగవండుడు అన్న విధంగా గ్రామ గ్రామాలకు నన్ను వేంచేయింపజేసి బక్తులకు మోక్ష మార్గాన్ని కల్పించండి) అని ఉపదేశించారు. స్వామి ఆజ్ఞ మేరకు ప్రథమ పీఠాధిపతి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ఉత్సవ పల్లకిలో కొలువుంచి  గ్రామాలకు చేరుకోవడంతో పాటు ఊరేగింపుగా అక్కడి వీధుల్లో సంచరిస్తూ ప్రత్యేకంగా నిర్మించిన తెలుపులపై కొలువుంటూ బక్తులకు ఆశ్వీర్వాదాలు అందజేసే ‘పార్వేట’ మహోత్సవాలకు శ్రీకారం చుట్టినట్లు చరిత్ర కథనం.
 
వేటగాడిలా... 
నిత్యం పట్టువస్త్రాలు, వజ్రవైడూర్యాలతో దర్శనమిచ్చే శ్రీ లక్ష్మీనరసింహస్వాములు పార్వేట మహోత్సవాల్లో భాగంగా  అమ్మవారు లేకుండా ఒంటరిగా తలపాగా మాత్రమే చుట్టుకుని వేటగాడి ఆకారంలో భక్తులకు దర్శనమిస్తారు. స్వామి ఇలా వేటగాడి రూపంలో  సంచరించడంతో గ్రామానికి ఎల్లప్పుడు ఆయన రక్షణ ఉంటుందని ప్రజలు నమ్ముతారు. పార్వేటలో భాగంగా స్వామివారు ఏ ఊరికి వెళ్తే ఆ రోజు అక్కడ తిరునాల జరుగుతుంది. ఇలా 45 రోజులపాటు ఈ పార్వేట సాగుతుంది.  
 
 
స్వామి తిరిగి కొండెక్కేవరకు పాదుకలే సర్వస్వం 
 పార్వేట ఉత్సవాల్లో భాగంగా సుమారు మండలం రోజులకు పైగా స్వామివారి గ్రామాల్లో తిరుగుతూ భక్తులను ఆశీర్వదించెందుకు కొండ దిగుతారు. అయితే తిరిగి కొండెక్కేవరకు క్షేత్రంలో అహోబిలేశుడి పాదుకలున్న శఠగోపం ఆలయంలో ఉంచుతారు. ఈ శఠానికి నిత్యం ప్రాతఃకాలంలో అన్ని రకాల పూజలు నిర్వహించి కొలువుంచి పరమ పవిత్రంగా కొలుస్తుంటారు. స్వామి తిరిగి కొండెక్కేవరకు అహోబిలంలో మూలవిరాట్‌ను దర్శించుకునే బక్తులకు శఠారు పెట్టడం జరగదు. కేవలం తీర్థ ప్రసాదాలు మాత్రమే అందజేయడం ఆనవాయితీ.  ఇప్పటికి కూడా స్వామికి  అర్చకులు బావి నీరుతో కట్టెల పొయ్యిపై చేసిన నైవేద్యాన్ని మాత్రమే నివేదిస్తారు. ఇలా స్వామి ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి దాదాపు రాత్రి పొద్దుపోయిన తరువాతే వెళ్తారు.  రుద్రవరం మండలం ఆలమూరు, లింగందిన్నె గ్రామాలకు చెందిన బోయిలు కాళ్లకు చెప్పులు లేకుండా చీకట్లో, ముళ్ల పొదల్లోనే స్వామి పల్లకీని మోసుకెళ్తారు. ఇలా స్వామివారి పార్వేట ఆళ్లగడ్డ, రుద్రవరం, ఉయ్యాలవాడ మండలాల్లోని 33 గ్రామాల్లో సాగుతుంది. కొండదిగిన రోజునుంచి  తీరిక లేకుండా గ్రామ గ్రామాన తిరిగి బక్తులకు దర్శన భాగ్యము కల్పించి 45 రోజుల అనంతరం రుద్రవరం నుంచి స్వామి పల్లకి కొండ(అహోబిలం) ఎక్కుతుంది.  
ఉత్సవాలు సాగేది ఇలా.. 
ఎగువ అహోబిలంలో కొలువైన జ్వాల నరసింహస్వామిని సంక్రాంతి పర్వదినం రోజు దిగువ అహోబిలం తీసుకు వస్తారు. పదవ క్షేత్రం దిగువ అహోబిలంలో కొలువైన ప్రహ్లాదవరదస్వామితో కలిపి కొలువుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్వాములకు ఎదురుగా అన్నం రాసిగా పోసి అన్నకూటోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా 45 రోజులపాటు సాగే పార్వేట ఉత్సవాల్లో స్వాములకు సరిపడా ఆహారాన్ని ఇద్దరు ఉత్సవ మూర్తులకు అర్పిస్తారు. అనంతరం పార్వేట ఉత్సవాలకు శ్రీకారం చుడతారు.  
ఈప్రాంత ప్రజలు చేసుకున్న పుణ్యం : కీడాంబి వేణుగోపాలన్‌, అహోబిలం దేవస్థాన ప్రధానార్చకులు 
ప్రపంచంలో ఎక్కడా ఏ స్వామి ఇవ్వని కానుకను శ్రీఅహోబిల లక్ష్మీనరసింహస్వామి పార్వేట ఉత్సవాల ద్వారా ప్రజలకు అందిస్తారు. స్వయంగా భక్తుని చెంతకే భగవంతుడు వెళ్లి దర్శన భాగ్యం కల్పించే కార్యక్రమానికి ఈ ఉత్సవాలు వేదికగా నిలుస్తాయి.  
 
మరిన్ని వార్తలు