ప్రాణాలు అరచేత పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ..

10 Apr, 2017 12:45 IST|Sakshi
ప్రాణాలు అరచేత పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ..

శ్రీనగర్ అల్లర్లలో చిక్కుకున్న అనపర్తివాసులు
వారం రోజులు భయూందోళనల గుప్పిట్లోనే..
ఎట్టకేలకు గురువారం స్వస్థలానికి చేరిక
అమరనాథుడి కటాక్షమే కాపాడిందని ఉద్వేగం

అనపర్తి(బిక్కవోలు): తిరిగి ప్రాణాలతో వస్తామనుకోలేదని, అమరనాథుడి కరుణా కటాక్షాల వల్లే తామంతా బతికి బయటపడ్డామని అనపర్తి నుంచి అమరనాథ్ యాత్రకు వెళ్లి, శ్రీనగర్ అల్లర్లలో, కర్ఫ్యూలో చిక్కుకున్న  భక్తులు ఉద్వేగభరితంగా చెప్పారు. గురువారం రాత్రి గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో అనపర్తి చేరుకున్న వారికి బంధువులు,స్నేహితులు సాదరంగా స్వాగతం పలికారు.

తమ వారు క్షేమంగా తిరిగి రావడంతో వారంతా పరమానందభరితులయ్యూరు. కాగా సురక్షితంగా తిరిగి వచ్చిన వారు శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ తమ అనుభవాల్ని వివరించారు. అనపర్తికి చెందిన 17 మంది సభ్యులతో కూడిన బృందం జూన్ 30న పవిత్ర అమర్‌నాథ్ యాత్రకు బయలుదేరి వెళ్ళామని అనపర్తికి చెందిన సబ్బెళ్ళ త్రినాథరెడ్డి తెలిపారు.తనతో పాటు సబ్బెళ్ళ భామిరెడ్డి, సబ్బెళ్ళ పార్వతి, పడాల కళ్యాణ్‌రెడ్డి, పడాల ధనలక్ష్మి, చిర్ల లక్ష్మీతులసి,తేతలి బుల్లిగంగిరెడ్డి, తేతలి అనంతలక్ష్మి, నల్లమిల్లి పార్వతి, తేతలి గౌరీదేవి(బేబి), సందక అనిల్‌కుమార్, నల్లమిల్లి నాగిరెడ్డి, కె.కాంచన, నల్లమిల్లి రాజేశ్వేరి, తేతలి రామచంద్రరెడ్డి, తేతలి మణిలతో కూడిన బృందం 6న శ్రీనగర్ చేరుకున్నామన్నారు.

ఉగ్రదాడుల నేపథ్యంలో కర్ఫ్యూ విధించడంతో అక్కడ  చిక్కుకుపోయామన్నారు. శ్రీనగర్ చేరుకున్నది మొదలు కష్టాలు పడుతూనే యాత్ర కొనసాగించామని, 7వ తేదీన అమరనాథుడిని దర్శించుకోవలసి ఉండగా రెండు రోజుల పాటు కర్ఫ్యూ కారణంగా బస్సులోనే ఉండి పోవలసి వచ్చిందని చెప్పారు. సోమవారం కర్ఫ్యూ సడలించిన తరువాత స్వామిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా మరలా అల్లర్లు చెలరేగడంతో శ్రీనగర్ పట్టణ శివారులో బస్సును నిలిపి వేశారని, దీంతో తిరిగి రెండు రోజుల పాటు బస్సులోనే ఉండిపోవలసిన పరిస్థితి ఎదురైందని తెలిపారు.

వెంట తెచ్చుకున్న ఆహర పదార్థాలు, తాగునీరు కూడా అయిపోవడంతో భయాందోళనల మధ్య బస్సులోనే బిక్కుబిక్కుమంటూ  గడిపామన్నారు. మంగళవారం రాత్రి ఆందోళనకారులు బస్సుపై రాళ్లు రువ్వడంతో డ్రైవర్ చాకచక్యంగా బస్సును వేగంగా నడిపి అందరినీ రక్షించాడని తెలిపారు. భద్రతా దళాల రక్షణతో బస్సును శ్రీనగర్ దాటించారని, అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారి సలహా మేరకు ఉదంపూర్ మీదుగా గురువారం తెల్లవారేసరికి ఢిల్లీ చేరుకున్నామన్నారు.

అక్కడి నుంచి ముందస్తు ప్రణాళిక ప్రకారం విమానంలో హైదరాబాద్ మీదుగా విశాఖపట్నం చేరుకున్నామని గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి అదే రోజు రాత్రికి అనపర్తి చేరుకున్నట్లు వారు తెలిపారు. ‘శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు. నిజంగా అమరనాథుడి దయ వల్లే మేమంతా బతికి బయటపడ్డా’మని వారంతా భావోద్వేగానికి లోనయ్యారు.
 
 
దేవుడే మా కుటుంబాన్ని రక్షించాడు
కుటుంబ సమేతంగా అమరనాథ్ యాత్రకు వెళ్లాం. అక్కడ పరిస్థితి చూస్తే మరలా ఇంటికి వస్తామా అని అనుమానం కలిగింది. ఆ దేవుడి దయ వల్ల క్షేమంగా ఇంటికి చేరుకున్నాం
- సబ్బెళ్ళ పార్వతి, గృహిణి, అనపర్తి
 
టీవీల్లో వీక్షించింది నిజంగా చూశాం
ఉగ్రదాడుల గురించి టీవీలలో చూపిస్తుంటే సాధారణంగా పట్టించుకోం. కానీ దేవుడి దర్శనానికి వెళ్లిన మేము మా కళ్లారా అలాంటి దృశ్యాలు చూశాం. ఆ అనుభవం జీవితంలో మరిచిపోలేనిది.
- నల్లమిల్లి రాజే శ్వరి, గృహిణి, అనపర్తి
 
భద్రతా దళాల సహకారం మరువలేనిది
భద్రతా దళాలు చేసిన సహకారం మరిచిపోలేనిది. వారి సహకారం లేకుంటే ఇంకా అక్కడే భయాందోళనల మధ్య ఉండేవాళ్ళం. అడుగడుగునా ప్రాణాలకు తెగించి యాత్రికులకందిస్తున్న సహాయం అభినందించదగినది.
- తేతలి అనంతలక్ష్మి, గృహిణి, అనపర్తి
 
స్వచ్ఛంద సంస్థల సేవలు భేష్
ఇబ్బందుల్లో ఉన్న యాత్రికులను ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా స్వచ్ఛంద సంస్థలు మాత్రం అడుగడుగునా సేవలందించారుు. నీరు, ఆహారం అందిస్తూ యాత్రికులకు అన్ని విధాలుగా సహాయం చేస్తూనే ఉన్నాయి.
- తేతలి గౌరీదేవి(బేబి), గృహిణి, అనపర్తి

మరిన్ని వార్తలు