గోదారి జీవనం.. దిగజారిన వైనం

6 Feb, 2017 23:18 IST|Sakshi
గోదారి జీవనం.. దిగజారిన వైనం
దిగజారిన జీవన ప్రమాణాలు
 పిట్టల్లా రాలిపోతున్న శిశువులు
 మాతృత్వమే శాపమవుతున్న దుస్థితి
 భావి పౌరులను పట్టిపీడిస్తున్న రక్తహీనత
 కుదేలైన వ్యవసాయం
 పారిశ్రామిక ప్రగతీ అంతంతే
 గోదావరి జిల్లాల దుస్థితిని వెల్లడించిన సెస్‌ నివేదిక
 
సాక్షి, అమరావతి :
ముక్కుపచ్చలారని శిశువుల్లో పలువురు పిట్టల్లా రాలిపోతున్నారు. మహిళల్లో కొందరు మాతృత్వమే శాపమై అసువులు బాస్తున్నారు. భావి పౌరుల్లో అత్యధికులు రక్తహీనతతో తల్లడిల్లుతున్నారు. అధిక శాతం మంది ఆధారపడ్డ వ్యవసాయం కుదేలైపోయింది. పరుగులెత్తుతోందని పాలకులు చెబుతున్న పారిశ్రామిక ప్రగతి కుంటుపడింది. ఉన్న ఊళ్లో చేయడానికి చేతి నిండా పనుల్లేక.. పొట్ట చేత పట్టుకుని పెళ్లాం పిల్లలతో కలిసి సుదూర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి దాపురించింది. ఇదీ సామాజిక ఆర్థిక అధ్యయనాల సంస్థ (సెస్‌) నివేదిక ఆవిష్కరించిన రాష్ట్ర అభివృద్ధి ముఖచిత్రం. విభజన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులపై సెస్‌ సమగ్రంగా అధ్యయనం చేసింది. మానవాభివృద్ధి సూచిలో రాష్ట్రం అధమ స్థానానికి చేరిందని.. జీవన ప్రమాణాలు పూర్తిగా దిగజారాయని స్పష్టం చేసింది. ఇదే విధానాలను కొనసాగిస్తే అధోగతి తప్పదని హెచ్చరించింది. ప్రభుత్వ విధానాల్లో సమూల మార్పులు తెచ్చి.. చిత్తశుద్ధితో అమలు చేయకపోతే జీవన ప్రమాణాలు మరింత దిగజారడం ఖాయమని అభిప్రాయపడింది. ఉభయ గోదావరి జిల్లాల్లోని స్థితిగతులపై సెస్‌ నివేదిక వెల్లడించిన విషయాలిలా ఉన్నాయి.
 
పశ్చిమగోదావరి
 జిల్లా భౌగోళిక విస్తీర్ణం 7,742 చదరపు కిలోమీటర్లు. జనాభా 39.37 లక్షలు. జన సాంద్రత చదరపు కిలోమీటర్‌కు 509. అత్యధిక జనసాంద్రత ఉన్న జిల్లాల్లో రెండో స్థానం మన జిల్లాదే. అక్షరాస్యత 74.6 శాతం.
 68.6 శాతం మంది ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. 61 శాతం భూమి సాగులో ఉంది. సాగుకు యోగ్యమైన భూమిలో 80 శాతానికి నీటిపారుదల సౌకర్యం ఉంది. పంటల సాగులో 61 శాతం వరి ఆక్రమిస్తుంది. 
 జీఎస్‌డీపీలో జిల్లా వాటా 8.5 శాతం. వ్యవసాయ రంగంలో జిల్లా వాటా 14 శాతం. పరిశ్రమల రంగంలో వాటా 5.4 శాతం. సేవల రంగంలో వాటా 7.6 శాతం.
 ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 28 మంది మరణిస్తున్నారు. 
 ప్రతి వెయ్యి మంది గర్భిణులకు 80 మంది మరణిస్తున్నారు. 
 75 శాతం మంది పిల్లలు ఎనీమియా(రక్తహీనత)తో బాధపడుతున్నారు.
 
తూర్పుగోదావరి
 జిల్లా భౌగోళిక విస్తీర్ణం 10,807 చదరపు కిలోమీటర్లు. జనాభా 51.54 లక్షలు. జన సాంద్రత చదరపు కిలోమీటర్‌కు 477. అత్యధిక జనసాంద్రత ఉన్న జిల్లాల్లో ఈ జిల్లాది మూడో స్థానం. ఏటా 0.50 శాతం జనాభా పెరుగుతోంది. అక్షరాస్యత 71 శాతం.
 61.3 శాతం మంది ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. సాగుకు యోగ్యమైన భూమిలో 64 శాతానికి నీటిపారుదల సౌకర్యం ఉంది. సాగు విస్తీర్ణంలో 66.4 శాతం వరి పంటను సాగు చేస్తారు. 
 జీఎస్‌డీపీలో జిల్లా వాటా 10.3 శాతం. వ్యవసాయ రంగంలో వాటా 11.7, పారిశ్రామిక రంగం వాటా 9.9 శాతం.
 ప్రతి వెయ్యి మంది శిశువులకు 35 మంది మరణిస్తున్నారు. 
 ప్రతి వెయ్యి మంది గర్భిణిలలో 74 మంది మరణిస్తున్నారు. మాతా మరణాలు అతి తక్కువ ఉన్న జిల్లా ఇదే.
 81 శాతం మంది పిల్లలు ఎనీమియాతో బాధపడుతున్నారు.
 
మరిన్ని వార్తలు