గట్టుజారి గల్లంతవుతోంది

3 Apr, 2017 23:24 IST|Sakshi
గట్టుజారి గల్లంతవుతోంది
దొంగరావిపాలెంలో కుంగుతున్న ఏటిగట్టు
 మరమ్మతులు చేసిన ప్రయోజనం శూన్యం
 డెల్టా గ్రామాల్లో ఆందోళన
 
పెనుగొండ :
గోదావరి ఏటిగట్టు ప్రమాదంలో పడింది. మరమ్మతులు చేసినా.. అండలుగా జారి నదిలోకి కుంగిపోతోంది. పెనుగొండ మండలం దొంగరావిపాలెం వద్ద గట్టు జారిపోతోంది. మరమ్మతులు చేపట్టినా ప్రయోజనం లేకపోవడంతో వర్షాకాలంలో ప్రమాదం తప్పదేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిడదవోలు మండలం పెండ్యాల, పెనుగొండ మండలం దొంగరావిపాలెం, ఆచంట మండలం కోడేరులో 31/500 కిలోమీటర్‌ నుంచి 32/100 కిలోమీటర్‌ వరకు వరకూ సుమారు 600 మీటర్ల మేర ఏటిగట్టు శిథిలావస్థకు చేరింది. దీంతో గోదావరి హెడ్‌ వర్క్స్‌ అధికారులు పరిశీలించి 2015లో మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. రూ.42 కోట్లతో చేపట్టిన మరమ్మతు పనులు నేటికీ కొనసాగుతున్నాయి. అయితే, మరమ్మతులు చేసిన ప్రాంతాల్లో నాలుగు రోజులుగా గట్టు అండలు అండలుగా నదిలోకి జారిపోతోంది. 
 
రెండేళ్లలో మూడోసారి
గోదావరిలోని నీటి ప్రవాహం నేరుగా ఏటిగట్టును తాకకుండా నిరోధించేందుకు 2015లో పనులు చేపట్టారు. గ్రోయిన్స్, పిచ్చింగ్‌ రివిట్‌మెంట్‌ పనులు ఇందులో ఉన్నాయి. పిచ్చింగ్‌ రివిట్‌మెంట్‌ సమయంలోనే ఏటిగట్టు రెండుసార్లు కుంగిపోయింది. దీంతో ఇంజినీరింగ్‌ అధికారులు మట్టి పరీక్షలు చేయించారు. అక్కడి మట్టి ఈ పనులకు అనుకూలంగా లేదని నివేదికలు వచ్చాయి. పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఆ విషయాన్ని గాలికొదిలేసి సాదాసీదా పనులు కొనసాగిస్తున్నారు. దీంతో నాలుగు రోజులుగా 31/500 కిలోమీటర్‌ నుంచి 31/600 కిలోమీటర్‌ వరకు ఏటిగట్టు కుంగడం ప్రారంభమైంది. ఇక్కడ గట్టు జారిపోతుండటం గడచిన రెండేళ్లలో ఇది మూడోసారి. గట్టు బలహీనపడుతుండటంతో వర్షాకాలంలో ఏమాత్రం వరద ఉధృతి పెరిగినా 1986 నాటి పరిస్థితులు పునరావృతమవుతాయనే ఆందోళన డెల్టా గ్రామాల్లోననెలకొంది. 
 
నాణ్యతా లోపమే కారణం!
పనుల్లో నాణ్యతా లోపాల వల్లే గట్టు కుంగిపోతోందని స్థానికులు విమర్శిస్తున్నారు. మరమ్మతులకు తక్కువ సైజులో ఉండే రాయిని వినియోగించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు. అధికారులు మాత్రం వదులుగా ఉండే బంకమన్ను వల్లే కుంగిపోతోందని చెబుతున్నారు. అక్కడి పరిస్థితిని చక్కదిద్దే విషయంలో హెడ్‌వర్క్స్‌ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
 
ఓఎన్‌జీసీ పైపుల వల్లేనంటూ ఫిర్యాదు
వదులుగా ఉండే బంకమట్టితోపాటు ఓఎన్‌జీసీ పైపులతో నీటిని తోడుతున్న కారణంగానే రివిట్‌మెంట్‌ జారిపోతోందంటూ గోదావరి హెడ్‌వర్క్స్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోడేరు బ్యాంక్‌ కెనాల్‌ ఆయకట్టు పరిధిలో సాగునీటి ఎద్దడి రావడంతో ఓఎన్‌జీసీకి చెందిన మోటార్లతో గోదావరి నది నుంచి నీటిని బ్యాంక్‌ కెనాల్‌లోకి తోడుతూ రైతులకు తోడ్పాటు అందిస్తున్నారు. దీనివల్ల నదిలో నీటి నిల్వలు పడిపోయి గట్టు బలహీనపడుతోందని హెడ్‌వర్క్స్‌ డీఈ వీవీ రామకృష్ణ తెలిపారు. గతంలోనూ ఎత్తిపోతల పథకం నిర్వహించినపుడు గ్రోయిన్స్‌ కుంగిపోయాయని వివరించారు. మరమ్మతుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించామని ఆయన చెప్పారు. అనుమతులు లేకుండా నదిలోంచి నీటిని తోడుతుండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసామని పేర్కొన్నారు.
 
మరిన్ని వార్తలు