నెలాఖరుకు గోదావరి ట్రయల్ రన్

21 Oct, 2015 04:05 IST|Sakshi
నెలాఖరుకు గోదావరి ట్రయల్ రన్

♦ ముర్మూరు నుంచి బొమ్మకల్ వరకు 54 కి.మీ.  
♦ విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయాలని సీఎం ఆదేశం
♦ నగరంలో పూర్తి కాని రింగ్ మెయిన్ పనులు  
 
 సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వరదాయిని గోదావరి మంచినీటి పథకం... ‘మౌలానా అబుల్ కలామ్ అజాద్ సుజల స్రవంతి’ మొదటి దశ ప్రయోగ పరీక్షకు ఈ నెలాఖరున ముహూర్తం కుదిరింది. ట్రయల్ రన్‌కు అవసరమైన మోటార్లను నడిపేందుకు తక్షణం విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం మోటార్లకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చే పనులు చకచకా జరుగుతున్నాయి. కాగా తొలి దశలో కరీంనగర్ జిల్లా ముర్మూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 54 కి.మీ. దూరంలో ఉన్న బొమ్మకల్‌కు 20 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ట్రయల్ రన్‌లో మోటార్లు, పైప్‌లైన్ల సామర్థ్యం, హైడ్రాలిక్ టెస్టులు, పైప్‌లైన్లకున్న జాయింట్లను పరిశీలిస్తారు.

ట్రయల్ రన్ ఈ నెలాఖరులోనే ప్రారంభిస్తామని జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి 1.5 కి.మీ. దూరంలో ఉన్న ముర్మూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు ఇప్పటికే నీటిని భూమ్యాకర్షణ శక్తి (గ్రావిటీ) ద్వారా తరలించారు. అక్కడి నుంచి బొమ్మకల్-మల్లారం-కొండపాక-ఘన్‌పూర్ మార్గంలో రూ.3,800 కోట్ల అంచనా వ్యయంతో రిజర్వాయర్ల నిర్మాణంతోపాటు సుమారు 186 కి.మీ. మార్గంలో పైప్‌లైన్ల పనులు పూర్తయిన విషయం తెలిసిందే. గోదావరి పథకం తొలి దశ ద్వారా గ్రేటర్‌కు 172 ఎంజీడీల జలాలను తరలించాలని నిర్ణయించారు. ఈ పథకానికి నెలకు సుమారు 75 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుంది. ఇందుకోసం జలమండలి రూ.45 కోట్ల మేర విద్యుత్ బిల్లు చెల్లించాల్సి వస్తుంది.
 
 మరో రెండు నెలల్లో నగరానికి..
  ప్రస్తుతం ప్రయోగ పరీక్షలో ముర్మూరు నుంచి బొమ్మకల్ రిజర్వాయర్ వరకే నీటి పంపింగ్ జరుగుతోంది. అక్కడి నుంచి మల్లారం, కొండపాక, ఘన్‌పూర్ రిజర్వాయర్ల మార్గంలో ప్రయోగ పరీక్షలకు 50 రోజుల సమయం పడుతుంది. ఈ క్రమంలో నగరంలో గోదావరి జలాల సరఫరాకు మరో రెండు నెలల సమయం పడుతుంది. ఘన్‌పూర్ రిజర్వాయర్ నుంచి నగరవ్యాప్త సరఫరాకు అవసరమైన 67 కి.మీ. మార్గంలో చేపట్టిన రింగ్ మెయిన్ పైప్‌లైన్ పనుల పూర్తికి పలుచోట్ల ఆటంకాలు ఎదురయ్యాయి. వీటిని అధిగమించేందుకు జలమండలి అధికారులు ప్రయత్నిస్తున్నారు.

 ఇదీ పరిస్థితి..
 రింగ్ మెయిన్-1: గుండ్లపోచంపల్లి రైల్వే ట్రాక్ ప్రాంతంలో 30 మీటర్ల మేర పనులు పూర్తికావాల్సి ఉంది. మరోవైపు ఆ గ్రామస్తులు పైప్‌లైన్ మార్గం మార్చాలని ఒత్తిడి చేస్తుండడంతో సుమారు 1420 మీటర్ల మార్గంలో పనులు నిలిచాయి.

 రింగ్ మెయిన్-2: శామీర్‌పేట్ నుంచి కరీంనగర్ జాతీయ రహదారి మార్గంలో సుమారు 2.5 కి.మీ. మార్గంలో పనులు చేపట్టేందుకు జాతీయ రహదారుల సంస్థ నుంచి, కౌకూర్ వద్ద రక్షణ శాఖకు సంబంధించిన 1.2 ఎకరాల స్థలంలో పైప్‌లైన్ పనులు పూర్తి చేసేందుకు రక్షణశాఖ నుంచి ఇటీవలే అనుమతులు వచ్చాయి. ఇక వాణీనగర్, మెట్టుగూడా, మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో రైల్వే శాఖ అనుమతితో పనులు పూర్తిచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు