ముంగండ చోరీ కేసులో నిందితుడి అరెస్టు

20 Jul, 2016 00:06 IST|Sakshi
100 గ్రాముల బంగారం, 22 కిలోల
వెండి వస్తువులు, రూ.6500 నగదు రికవరీ
పి.గన్నవరం : ముంగండ గ్రామంలో ఈ నెల 11న తాళాలు వేసిన ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అంతకుముందు ఆ ఇంట్లో వడ్రంగి పని చేసిన వ్యక్తే ఈ చోరీకి పాల్పడినట్టు గుర్తించి, మంగళవారం అతడిని అరెస్టు చేశారు. అతడి నుంచి 100 గ్రాముల బంగారం, 22.166 కిలోల వెండి వస్తువులు, రూ.6500 నగదు స్వాధీనం చేసుకున్నారు. అమలాపురం డీఎస్పీ ఎల్‌.అంకయ్య కథనం ప్రకారం, ముంగండ లక్ష్మీగణపతి వీధిలో బొడ్డు కోట సత్య రమణికుమారి జూన్‌ 11న ఇంటికి తాళాలు వేసి హైదరాబాద్‌లో ఉంటున్న రెండో కుమార్తె విజయశాంతి ఇంటికి వెళ్లారు. ఈ నెల 11న ఇంటితాళాలు పగులగొట్టి ఉండడం గమనించిన స్థానికులు హైదరాబాద్‌లో ఉన్న రమణికుమారికి సమాచారం అందించారు. దీంతో అదే రోజు రాత్రి ముంగండ వచ్చిన రమణికుమారి చోరీ జరిగినట్టు నిర్ధారించుకుని, 12న పి.గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై పి.వీరబాబు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
రాజోలు మండలం పొన్నమండకు చెందిన కుక్కల శ్రీనివాసరావు ముంగండలోని అదే వీధిలో నివసిస్తూ వడ్రంగి పనులు చేస్తున్నాడు. మే నెలలో అతడు రమణికుమారి ఇంట్లో కూడా వండ్రంగి పని చేశాడు. ఆ సమయంలో ఇంటి లోపలి పరిస్థితులను గమనించాడు. ఆమె హైదరాబాద్‌ వెళ్లిన విషయం తెలుసుకుని దొంగతనానికి పాల్పడ్డాడు. దొంగిలించిన నగలను భద్రపరచి నాగపూర్, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లిపోయాడు. విచారణలో అతడే చోరీకి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ముంగండ సెంటర్లో ఉన్న శ్రీనివాసరావును రావులపాలెం సీఐ పీవీ రమణ అరెస్టు చేశారు. అయితే నిందితుడు రూ.25 వేల నగదు చోరీ చేయగా, రూ.6500 మాత్రమే రికవరీ అయింది. మిగిలిన సొమ్మును అతడు ఖర్చు చేసేశాడని డీఎస్పీ వివరించారు. అదే వీధిలో శ్రీనివాసరావు ఇటీవల దొంగిలించిన వాటర్‌ మోటారును కూడా స్వాధీనం చేసుకున్నారు. అతడు పదేళ్ల క్రితం మోటారు సైకిలు చోరీ చేసిన కేసులో ఏడాదిపాటు శిక్ష అనుభవించాడని డీఎస్పీ చెప్పారు. నిందితుడిని బుధవారం కోర్టులో హాజరు పరుస్తామన్నారు. విలేకర్ల సమావేశంలో ఎస్సై వీరబాబు, ఏఎస్సై ఎన్‌.సత్యనారాయణ పాల్గొన్నారు.
 

 

మరిన్ని వార్తలు