బ్లాకులో బంగారం బిస్కెట్లు

18 Feb, 2016 10:28 IST|Sakshi
బ్లాకులో బంగారం బిస్కెట్లు

రూ.కోట్లలో పన్ను ఎగనామం
వినూత్న పద్ధతులను ఆశ్రయిస్తున్న స్మగ్లర్లు

 
విజయవాడలో సెంట్రల్ ఎక్సైజ్ కార్యాలయం ఏర్పాటు చేసి ఏడాది దాటింది. ఈ సంవత్సర కాలంలో సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు మూడు కేసులు నమోదు చేశారు. 2015 ఫిబ్రవరిలో కిలో బంగారం, రూ.39 లక్షల నగదు పట్టుకున్నారు. 2015 సెప్టెంబర్‌లో జరిపిన దాడుల్లో 739 గ్రాముల బంగారం, రూ.6.38 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్‌లో 300 గ్రాముల బంగారం, రూ.3లక్షల నగదు బిల్లులు లేకుండా వస్తుండగా ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
 
కస్టమ్స్ అధికారులు మంగళవారం గుళికల రూపంలో ఉన్న ఐదు కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. కోల్‌కత్తా నుంచి చెన్నై వెళ్తుండగా రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో దీనిని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విజయవాడ మీదుగా చెన్నై జ్యూయలరీ దుకాణానికి వెళ్తోందని కస్టమ్స్ అధికారుల విచారణలో తేలింది. ఈ బంగారాన్ని విజయవాడలో దించి చెన్నైకు తరిచేందుకు స్మగ్లర్లు పథకం రచించారని సమాచారం.
 
బెజవాడ బీసెంట్ రోడ్డులో వే బిల్లులు లేకుండా అక్రమంగా తరలించిన బంగారాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. విశాఖలోని ముత్తూట్ ఫైనాన్స్ వేలంలో 3.70 కిలోల బంగారం కొనుగోలు చేసిన కొందరు ప్రభుత్వానికి చెల్లించాల్సిన అమ్మకం పన్ను జమచేయలేదు. నగరంలోకి ఈ తరహా బంగారం దిగుమతి అయినట్టు వచ్చిన సమాచారంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు.

 
 
విజయవాడ : ప్రధాన రవాణా కేంద్రంగా, ప్రముఖ వాణిజ్య కేంద్రంగా భాసిల్లుతున్న బెజవాడకు ముంబాయ్, చెన్నయ్ నుంచి నిత్యం బంగారం బిస్కెట్లు బిల్లులు లేకుండా దిగుమతవుతున్నాయి. రైళ్లు, విమానాలు, కొరియర్ సర్వీసుల ద్వారా బంగారం, వెండి, వజ్రాలు, ప్లాటినం టన్నుల్లో దిగుమతవుతోందని సమాచారం. విదేశీ వస్తువులు కూడా అడ్డూ అదుపు లేకుండా బిల్లులు లేకుండా రహస్యంగా చేరుకుంటున్నాయి.
 
ఫలితంగా ప్రభుత్వానికి రూ.కోట్లలో పన్నుల ఎగనామం పడుతోంది. రైళ్లు, బస్సులు, కొరియర్స్, విమానాల్లో సైతం బిల్లులులేని బంగారం బిస్కెట్ల రూపంలో యథేచ్ఛగా నగరానికి చేరుతోంది. ఈ చీకటి వ్యాపారంలో కొందరు బంగారు నగల వ్యాపారులు, కొరియర్ సంస్థల నిర్వాహకులు భాగస్వామ్యులన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
 
ఇతర రాష్ట్రాల నుంచి విజయవాడ రైల్వే స్టేషన్‌కు దొంగతనంగా బంగారం రవాణా అవుతోందని కస్టమ్స్, పోలీసు, వాణిజ్యపన్నుల శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. విజయవాడ నుంచి చెన్నై వెళ్లే పినాకిని ఎక్స్‌ప్రెస్ వంటి సూపర్ ఫాస్ట్ రైళ్లలో ఈ తరహా దొంగ బంగారం రవాణా జరుగుతోందని భావిస్తున్నారు. అక్రమంగా దిగుమతి అయ్యే బంగారాన్ని కొందరు వ్యాపారులు లాకర్లలో భద్రపరుస్తున్నట్లు కూడా ఫిర్యాదులు వస్తున్నాయి.
 
 
కిలోకు రూ.6 లక్షల లాభం
విజయవాడలో 500 వరకూ బంగారు నగల దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల్లో సాధారణ రోజుల్లో సగటున రోజుకు రూ.25 కోట్ల వ్యాపారం జరగుతుంది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో రూ.50 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుందని అంచనా. ఈ లావాదేవీల్లో బిల్లులు లేకుండా  రెండో అకౌంట్ ద్వారా జీరో వ్యాపారం చేస్తున్నారని అధికారులు భావిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే బంగారానికి కస్టమ్స్ సుంకం 5 శాతం, వాణిజ్య సుంకం ఒక శాతం ఎగనామం పెట్టడం వల్ల కిలో బంగారానికి రూ.6 లక్షల వరకూ వ్యాపారులకు లాభం వస్తుందని సమాచారం.   
 

మరిన్ని వార్తలు