శ్రీకాళహస్తీశ్వరాలయంలో బంగారు కవచం లభ్యం

19 Jul, 2016 19:33 IST|Sakshi
బంగారు కవచాన్ని మీడియా ముందు ఉంచి మాట్లాడుతున్న ఆలయ చైర్మన్,ఈవో

– 476 గ్రాముల బరువుగల కవచాన్ని గుర్తించిన ఈవో
– ఇది మైసూరు మహారాజు కానుకే!
– గురుపౌర్ణమి సందర్భంగా స్వామివారికి అలంకరణ
శ్రీకాళహస్తి : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామికి సంబంధించిన స్ట్రాంగ్‌ రూమ్‌లో మైసూరు మహారాజు కానుకగా సమర్పించిన పురాతన బంగారు కవచాన్ని గుర్తించినట్లు ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు. ఈ మేరకు ఆమె ఆలయ చైర్మన్‌ పోతుగుంట గురవయ్యనాయుడుతో కలిసి ఆ వివరాలను విలేకరులకు వెల్లడించారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి సంబంధించిన బంగారు ఆభరణాలు, విలువైన కానుకలను ఆలయంలోని స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరుస్తుంటారని చెప్పారు. ఉత్సవాలు, తిరునాళ్లప్పుడు అందులో భద్రపరిచిన ఆభరణాలను ఉత్సవర్లకు అలంకరిస్తారని తెలిపారు. గురుపౌర్ణమి సందర్భంగా శివయ్యకు బంగారు ఆభరణాలు అలంకరించాల్సి ఉందని, అందులో భాగంగా రెండు రోజుల క్రితం స్ట్రాంగ్‌ రూమ్‌లోని ఆభరణాలను పరిశీలిస్తుండగా చిన్నచిన్న సంచుల్లో కొన్ని వస్తువులు బయటపడ్డాయని తెలిపారు. ఆ సంచులు తెరిచి చూడగా అందులో మైసూరు మహారాజు కానుకగా సమర్పించిన మూడు అడుగుల ఎత్తు, 476 గ్రాముల బంగారు కవచం బయటపడిందన్నారు. ఈ కానుకను 1954–55లో స్వామివారికి అందించినట్టు శాసనాలద్వారా తెలుస్తోందని పేర్కొన్నారు. గురుపౌర్ణమి సందర్భంగా శివయ్యకు ఆ కవచాన్ని అలంకరించినట్టు ఆమె వెల్లడించారు. ఇప్పటివరకు స్వామి, అవ్మువార్లకు ఉత్సవాలప్పుడు 35 కిలోల బరువు గల బంగారు ఆభరణాలను అలంకరిస్తున్నట్టు చెప్పారు. ఆలయ చైర్మన్‌ పోతుగుంట గురవయ్యనాయుడు మాట్లాడుతూ దాతలు ఇచ్చిన బంగారంతో పాటు హుండీల్లో వచ్చిన బంగారం, ఇతర విలువైన వస్తువులను స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరుస్తున్నట్టు తెలిపారు. కొన్ని పురాతన వస్తువుల వివరాలను రికార్డుల్లో నమోదు చేయలేదని, వాటి వివరాలు ఇప్పుడు పొందుపరుస్తున్నామని ఆయన తెలిపారు.


 
 

మరిన్ని వార్తలు