అమ్మ దొంగా!

20 Dec, 2016 22:23 IST|Sakshi
అమ్మ దొంగా!

- పక్కింటికి వెళుతూ వస్తూ.. బంగారు ఆభరణాలు చోరీ చేసిన వృద్ధురాలు
- నిందితురాలి అరెస్టు, 48 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం  

కడప అర్బన్‌: కడప నగరం చిన్నచౌక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అరవింద్‌ నగర్‌లో నివసిస్తూ, రిమ్స్‌లో స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తున్న శశికళ ఇంట్లో ఓ వృద్ధురాలు ఏకంగా 70 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేసింది. మూడు నెలల క్రితం జరిగిన ఈ చోరీ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు.  శశికళ ఇంటి పక్కనే నివసిస్తున్న వెంకటేశ్వరమ్మ ఇంటికి ఆమె తల్లి తంగెళ్ల లక్ష్మిదేవి (63) వస్తూ వెళుతూ ఉండేది. ఈ క్రమంలో శశికళ ఇంట్లోకి కూడా వెళ్లేది. శశికళ తనదగ్గరున్న 70 తులాల బంగారు ఆభరాణాలను తాను ఉంటున్న ఇంట్లోనే కప్‌బోర్డులో దాచి ఉంచి కప్‌బోర్డు తాళాలను తన హ్యాండ్‌ బ్యాగ్‌లో ఉంచడాన్ని నిందితురాలు గమనించేది. శశికళ ఇంట్లో లేని సమయాన్ని పసిగట్టి, శశికళ తల్లి మొదటి గదిలో విశ్రాంతి తీసుకుంటుండగా ఇంట్లోకి ప్రవేశించిన వృద్ధురాలు లక్షి​‍్మదేవి హ్యాండ్‌ బ్యాగులో ఉన్న తాళాల సాయంతో కప్‌బోర్డు తెరిచి బంగారు ఆభరణాలను కాజేసిందని పోలీసులు దర్యాప్తులో తేల్చారు.
 తన కోసం పోలీసులు వెతుకుతున్నారని తెలుసుకున్న వృద్ధురాలు చిన్నచౌక్‌ వీఆర్‌ఓ వద్ద లొంగిపోయింది. ఆయన మంగళవారం కడప చిన్నచౌక్‌ పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా చిన్నచౌక్‌ సీఐ బి. రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ శశికళ ఇంటి పక్కనున్న వెంకటేశ్వరమ్మ ఇంటికి ఆమె తల్లి వస్తూ వెళుతూ చోరీకి పాల్పడినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. నిందితురాలి దగ్గరి నుంచి 48 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరబల్లి మండలం బొంగావాండ్లపల్లెకు చెందిన తంగెళ్ల లక్ష్మిదేవి తన భర్త నాగన్న మృతి చెందిన తరువాత తన కుమారుడితో కలిసి కడప నగరంలోని గురుకుల్‌ విద్యాపీఠ్‌ సమీపంలో నివసిస్తోందన్నారు. తన కుమారుడికి నయం కాని జబ్బు ఉన్నందున, వైద్య ఖర్చుల కోసం డబ్బులు అవసరమైందన్నారు. ఈ నేపథ్యంలో శశికళ ఇంట్లో బంగారు ఆభరణాలు  ఉన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ చోరీకి పాల్పడిందన్నారు. వాటిలో కొన్ని తులాల బంగారు ఆభరణాలను అమ్మేయగా  మిగిలిపోయిన 48 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఐలు యోగేంద్ర, మోహన్, రామకృష్ణుడు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు