వెంకన్నకు శిల్పకారుడి కానుక

30 Jul, 2016 06:25 IST|Sakshi
వెంకన్నకు శిల్పకారుడి కానుక
తెనాలి: పట్టణానికి చెందిన శిల్పకారుడు చింతక్రింది భాస్కర్‌ స్థానిక వైకుంఠపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి కోసం ముచ్చటైన కిరీటం, కర్ణాభరణాలు రూపొందించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి కిరీటాన్ని పోలిన  నమూనాతో వీటిని తయారు చేశారు. తన స్థోమతకు తగినట్టుగా రాగితో చేసిన కిరీటంపై బంగారు పూత పూశారు.

‘జకో’ అని పిలిచే ఆస్ట్రేలియాకు చెందిన రాళ్లను పొదిగారు. కిరీటం, కర్ణాభరణాలకు దాదాపు ఆరు వేల రంగురాళ్లను వినియోగించినట్టు భాస్కర్‌ చెప్పారు. శ్రీవేంకటేశ్వరస్వామికి శనివారం తన కానుకగా వీటిని సమర్పించనున్నట్టు విలేకరులకు తెలియజేశారు. శిల్పకళలో ప్రఖ్యాతి చెందిన అక్కల సోదరుల మేనల్లుడైన భాస్కర్‌ చిన్నతనం నుంచీ శిల్పకళలో ఎదిగారు. ఇంతకు ముందు భావనారుషి ఆలయానికి రెండు కిరీటాలు, పంచముఖ ఆంజనేయస్వామి దేవస్థానానికి కవచం చేసి ఇచ్చినట్టు చెప్పారు.
మరిన్ని వార్తలు