‘గోల్డ్‌’ స్ట్రైక్స్‌

21 Nov, 2016 01:33 IST|Sakshi
‘గోల్డ్‌’ స్ట్రైక్స్‌
 తణుకు : పెద్ద నోట్ట రద్దుతో కుబేరులకు ఊపిరి ఆడటం లేదు. దాచుకున్న నల్లధనాన్ని మార్చేందుకు బంగారం కొనుగోళ్లపై దృష్టి సారించారు. సందట్లో సడేమియా అన్నట్టుగా వ్యాపారులు సైతం ప్రభుత్వానికి లెక్క చూపని బంగారాన్ని వదిలించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇలాంటి వ్యవహారాలపై దృష్టి సారించిన కస్టమ్స్, టాస్క్‌పోర్స్, ఆదాయ పన్ను శాఖల అధికారులు ముప్పేట దాడులకు దిగుతున్నారు. తణుకు పట్టణంలోని వేల్పూరు రోడ్డులో బంగారాన్ని కరిగించే ఇద్దరు వ్యక్తుల నుంచి శనివారం రాత్రి సుమారు కేజీ బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు, ఆదివారం కూడా దాడులను కొనసాగించారు. పలు దుకాణాలతోపాటు, కొందరు వ్యక్తుల ఇళ్లల్లో తనిఖీలు చేశారు. ఓ వ్యక్తి నుంచి రూ.17.80 లక్షల విలువ చేసే 6 బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. 
 
నాలుగు రోజులుగా తణుకులోనే..
తణుకు పట్టణంలో నల్లధనం మార్పిడి, బంగారం కొనుగోళ్లపై దృష్టి సారించిన వివిధ శాఖల అధికారులు నాలుగు రోజులుగా తణుకులో మకాం వేసినట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లాకు చెందిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు సామాన్యుల మాదిరిగా వీధుల్లో ఆటోల్లో తిరుగుతూ నల్లధనం ప్రవాహ మూలాలను వెతికే పనిలో నిమగ్నమయ్యారు. ఆదివారం పట్టణంలోని కొందరి నివాసాలకు వెళ్లి సోదాలు జరిపారు. ఇదిలా ఉంటే టీడీపీకి చెందిన ఓ వార్డు కౌన్సిలర్‌ను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్‌ అధికారులు ఆయన నుంచి వాంగ్మూలం తీసుకుని విడిచిపెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. శనివారం రాత్రి టాస్క్‌ఫోర్స్, ఐటీ శాఖ అధికారులు వేల్పూరు రోడ్డులోని ఒక దుకాణానికి వెళ్లి బంగారం కావాలని అడిగారు. అక్కడి వ్యాపారి సుమారు పది బంగారం బిస్కెట్లను బయటకు తీయడంతో దానికి లెక్కలు అడిగారు. నోరెళ్లబెట్టడంతో మహంతి శ్రీరాములు, కలిశెట్టి సూరిబాబు అనే యువకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. 
 
వ్యాపారుల గుండెల్లో రైళ్లు
కస్టమ్స్, టాస్క్‌ఫోర్స్, ఆదాయ పన్ను శాఖ అధికారులు తణుకులో మకాం వేయడంతో జిల్లాలోని బంగారం వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇన్నాళ్లు లెక్కలేని విధంగా వ్యాపారం చేసిన బంగారు బాబులు అధికారుల దాడులతో బెంబేలెత్తిపోతున్నారు. దీంతో అధిక శాతం వ్యాపారులు ఆదివారం దుకాణాలు తెరవలేదు. మరోవైపు సీసీ కెమెరాలు లేని దుకాణాల్లో బంగారు ఆభరణాలను కొందరు కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వాటిని బంధులు, నమ్మకస్తుల వద్ద అనుమానం రాని ప్రాంతాల్లో ఉంచుతున్నట్టు సమాచారం.
 

 

>
మరిన్ని వార్తలు