గోల్‌మాల్‌

11 Sep, 2016 23:31 IST|Sakshi
గోల్‌మాల్‌
 ఏలూరు నగరపాలక సంస్థలో భారీ గోల్‌‘మాల్‌’కు సిబ్బంది తెగబడ్డారు. స్థానిక అధికారపార్టీ నేతల ప్రోద్బలంతో అక్రమ దందాకు తెరతీశారు. కార్పొరేషన్‌కు చెందిన రూ.6కోట్ల విలువైన స్థలంలో అనుమతుల్లేకుండా షాపింగ్‌ మాల్‌ నిర్మాణం  చేపట్టేశారు. జిల్లా కేంద్రంలోనే ఈ దందా సాగుతున్నా.. జిల్లాస్థాయి ఉన్నతాధికారులూ పట్టించుకోవడం లేదు. 
ఏలూరు (మెట్రో) : వాణీమోహన్‌ జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో నగరంలో పాడైపోయిన గజ్జెలవారి చెరువును అభివృద్ధి చేసేందుకు రూ.కోటి మంజూరు చేశారు. రాష్ట్రంలోనే అతిపెద్ద అభయ బుద్ధుని విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి అభివృద్ధి చేశారు. పార్కునూ ఏర్పాటు చేశారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇటీవల ఆ పార్కును ఆనుకుని ఉన్న స్థలంపై కొందరు కార్పొరేషన్‌ ఉద్యోగులు, నాయకులుæ కన్నేశారు. వారు అనుకున్నదే తడవుగా కార్పొరేషన్‌ స్థలంలో రూ.6లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని కూల్చేశారు. పార్కుకు వచ్చిన వారి సౌకర్యార్థం రూ.2లక్షలతో ఏర్పాటు చేసిన షెడ్‌నూ కూల్చేశారు. పార్కు రక్షణ కోసం రూ.3లక్షలతో నిర్మించిన ప్రహరీనీ పడగొట్టేశారు. వీటి స్థానంలో ఖాళీ అయిన 2,500 గజాల స్థలాన్ని దర్జాగా కబ్జా చేసి ఎవరి అనుమతులూ లేకుండా షాపింగ్‌మాల్‌ నిర్మాణం చేపట్టారు. 
పేదవ్యాపారుల పేరుతో కట్టడాలు 
ఇటీవల కృష్ణా కెనాల్‌పై ఆనుకుని ఉన్న సుమారు 100 దుకాణ సముదాయాలను కార్పొరేషన్‌ అధికారులు కూల్చేశారు. ఇక్కడ దుకాణాలు కోల్పోయిన పేద వ్యాపారుల కోసం ప్రత్యామ్నాయంగా కార్పొరేషన్‌ స్థలంలో షాపింగ్‌ మాల్‌ నిర్మిస్తున్నామని ముందుగా చెప్పుకొచ్చారు. అయితే దీనికి ఎటువంటి అనుమతులూ తీసుకోలేదు.
నిర్మాణాలు సాగుతుండగానే బేరాలు 
ప్రస్తుతం షాపింగ్‌మాల్‌ నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయి. వీటికి అనుమతులు లేకున్నా.. ఒక్కో దుకాణాన్ని రూ.ఆరు లక్షలకు కేటాయిస్తామంటూ అక్రమార్కులు బహిరంగంగా బేరం పెడుతున్నారు. పేద వ్యాపారులకు కేటాయిస్తామని చెప్పి ఇప్పుడు బేరానికి పెడుతుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  
నడిపించేది అంతా ‘శ్రీనివాసుడే’
అనుమతులు లేకుండా సాగుతున్న ఈ అక్రమ వ్యవహారంలో కార్పొరేషన్‌లో పనిచేసే ఒక ఉద్యోగి కీలకపాత్ర పోషిస్తున్నారు. ఉన్నతాధికారులకు వాహనాలు సమకూర్చుతూ ఆ వాహనాల ద్వారా వ్యాపారం చేసుకుంటూ ప్రస్తుతం కార్పొరేషన్‌ స్థలాలపై కన్నేసిన ఆ ఉద్యోగి కోట్ల విలువ చేసే ఈ స్థలాన్ని దర్జాగా కబ్జాచేసి నిర్మాణాలు పూర్తి చేసి విక్రయిస్తున్నా.. ఎవరూ పట్టించుకోవట్లేదు. ఈ నిర్మాణాల పేరుతో స్థానికంగా ఉన్న దశాబ్దాల నాటి చెట్లనూ నరికేసి విక్రయించారని పలువురు చెబుతున్నారు.
గజం రూ.25వేల పైనే 
ప్రస్తుతం పార్కు సమీపంలో గజం స్థలం ధర రూ.25వేలపైనే పలుకుతోంది. ఈలెక్కన రు.6కోట్ల 25లక్షల విలువైన ఈ స్థలానికి ఎటువంటి రుసుమూ చెల్లించకుండానే కట్టడాలు కట్టేశారు. అయితే ఈ నిర్మాణాలను తామే కట్టిస్తున్నామనీ, కానీ తమకు ఏమాత్రం వివరాలు తెలీవని కార్పొరేషన్‌ అధికారులు చెప్పడం గమనార్హం. 
 మేమే కట్టిస్తున్నాం.. కానీ వివరాలు తెలీదు
షాపింగ్‌మాల్‌ మేమే కట్టిస్తున్నాం. కానీ ఆ నిర్మాణానికి సంబంధించిన వివరాలు మా వద్ద లేవు. ఎంత వ్యయం చేస్తున్నారో కూడా నాకు తెలీదు. అసలు ఏ నిధులతో నిర్మాణాలు చేపట్టే విషయమూ తెలీదు.
– వై.సాయిశ్రీకాంత్, నగరపాలక సంస్థ కమిషనర్, ఏలూరు
 
 
 
మరిన్ని వార్తలు