ఏకగ్రీవాలకు నజరానా

27 Dec, 2016 01:38 IST|Sakshi

ఆలేరు : ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు శుభవార్త. నజరానాల కోసం కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పంచాయతీలకు ప్రభుత్వం ఎట్టకేలకు  మూడు రోజుల క్రితం నిధులు మంజూరు చేసింది. దీంతో ఆ గ్రామాలు ప్రగతిబాట పట్టనున్నాయి. 2013 జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రోత్సాహకాలు అందిస్తామని అప్పటి ఉమ్మడి సర్కార్‌ పేర్కొంది. ఎన్నికలను ఏకగ్రీవం చేస్తే భారీగా నిధులు ఇస్తామని అప్పటి సర్కార్‌ ప్రకటించడంతో రాజకీయాలను పక్కన  పెట్టి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1176 గ్రామపంచాయతీలున్నాయి. జిల్లాల విభజనలో భాగంగా జనగామ జిల్లాకు 17 వెళ్లాయి. ఏకగ్రీవ పంచాయతీల్లో 15వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ. 7లక్షలు, 15వేలకు పైబడి జనాభా ఉన్న పంచాయతీలకు రూ. 20 లక్షలు అందిస్తామని ప్రకటించింది.

 2013 జూలైలో ఎన్నికలు జరిగాయి. అయితే 2006లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అప్పటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వం రూ. 5లక్షల చొప్పున ప్రోత్సాహకం అందించింది. తరువాత ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని పెంచింది. ఈ నిధులతో తక్కువ ఆదాయ వనరులు ఉన్న పంచాయతీలు అభివృద్ధి చెందనున్నాయి. గ్రామంలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభించనుంది. ఈ నిధులతో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు, సీసీరోడ్లు, అంతర్గత రహదారుల నిర్మాణం, గ్రామపంచాయతీ భవనాలు తదితర పనులకు నిధులు ఖర్చు చేయనున్నారు. దీంతో గ్రామపంచాయితీల్లో కనీస వసతులు మెరుగుపడనున్నాయి.

ఉమ్మడి జిల్లాలో ఇలా..
తిరుమలగిరి మండలంలో–1, నడిగూడెం–3, డిండి–1, చందంపేట–2, దేవరకొండ–1, పెద్దవూర–6, భూదాన్‌పోచంపల్లి–2, మునుగోడు–1, నాంపల్లి–3, చండూరు–1, బీబీనగర్‌–7, భువనగిరి–3, ఆత్మకూరు(ఎం)–5, చౌటుప్పల్‌–1, నారాయణపురం–3, తుంగతుర్తి–2, పీఏపల్లి–2, మోత్కురు–2, తుర్కపల్లి–1, యాదగిరిగుట్ట–2, హాలియా–5, రాజాపేట–1, చివ్వెంల–3, దామరచర్ల–7, గుర్రంపోడు–2, మేళ్లచెర్వు–1, త్రిపురారం–7, తిప్పర్తి–1, వేములపల్లి–2, బొమ్మలరామారం–3, అర్వపల్లి–1, నూతనకల్లు–3, చిలుకూరు–1,నిడమనూరు–5, మఠంపల్లి–1 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.
నిధుల కేటాయింపు ఇలా..
యాదాద్రి భువనగిరి జిల్లాలో 334 గ్రామపంచాయతీలు ఉండగా 26 ఏకగ్రీవం అయ్యాయి. రూ. 1.82కోట్ల నిధులు మంజూరయ్యాయి.

>
మరిన్ని వార్తలు