బొమ్మలతో బోధన

13 Sep, 2016 22:57 IST|Sakshi
బొమ్మలతో బోధన
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) :
తరగతి గదిలో పాఠాలు చెబితే విద్యార్థులకు అర్థం కావడం కష్టమే. అదే బొమ్మలతో బోధిస్తే. విద్యార్థుల మనస్సుకు హత్తుకుంటుంది. వారికి పాఠ్యాంశం సులభంగా అర్థమవుతుంది. అందుకే ఆ బాటను అనుసరిస్తున్నారు రాజమహేంద్రవరంలోని ఉపాధ్యాయులు మంగారాణి, నరేష్‌. వీరు పాఠ్యాంశాలకు తగ్గట్టుగా బొమ్మలను తామే తయారు చేసుకొని బోధనలో వినియోగిస్తూ పలువురికి మార్గదర్శకులుగా ఉన్నారు. 
 
పిల్లలకు పాఠాలు చెబితే అవి వారి బుర్రలోకి మాత్రమే ఎక్కవచ్చు. ఆ విధానంలో బట్టీ తప్పదు. కానీ పాఠ్యాంశంపై వారికి అవగాహన కలిగిస్తే.. అదీ బొమ్మల ద్వారా.. అప్పుడు అది వారి హృదయాల్లో నాటుకుపోతుంది. అందుకే ఉపాధ్యాయులు బోధనోపకరణాలను తయారుచేసుకుని బోధించాలని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. అయితే కొందరే ఆ బాటలో నడుస్తున్నారు. వారిలో అగ్రగణ్యులు రాజమహేంద్రవరంలోని నాగరాజా ఎలిమెంటరీ పాఠశాల ఉపా«ధ్యాయిని మంగారాణి, వీరభద్రపురం మున్సిపల్‌ స్కూలు ఉపాధ్యాయుడు నరేష్‌. వీరు పాఠ్యాంశాలకు సంబంధించిన బొమ్మలను తయారు చేసుకొని విద్యార్థులకు విషయం గుర్తుండేలా బోధిస్తున్నారు. మంగారాణి అయితే ఒక బ్లాగునే ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఒకటి, రెండో తరగతి విద్యార్థులకు కావాల్సిన పాఠాలు, బోధనోపకరణాలు ఉన్నాయి. యూ ట్యూబ్‌లో మంగారాణి అనే పేరుతో ఒక పేజీని ఏర్పాటుచేసుకుని పాఠాల వీడియోలు, తరగతిలో కృత్యాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తుంటారు. వీటిలో జెడ గేయం, ఎగిరే చిలుక పాఠ్యాంశాలెన్నో పొందుపర్చారు. అలాగే విద్యార్థులకు పాఠాలే కాదు పలు అంశాల్లో పరిశోధనల దిశగా అడుగులు వేసేందుకు కృషిచేస్తున్నారు నరేష్‌. ఆయన విద్యార్థులకు పాఠాలను బోధిస్తూనే వివిధ రకాల ప్రాజెక్టుల రూపకల్పనను స్వయంగా విద్యార్థులతో చేయిస్తున్నారు. వీరిని మిగిలిన ఉపాధ్యాయులందరూ ఆదర్శంగా తీసుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు. 
 
తరగతి గది ఉత్తేజపరేదిగా ఉండాలి
విద్యార్థులను ఉత్తేజపరిచేది తరగతి గది. అక్కడనుంచే వారిలో దాగిఉన్న నైపుణ్యాన్ని బయటకు తీయాలి. అలా జరగాలంటే ముందుగా వారు నిత్యం బడికి వచ్చేలా, పాఠాలపై శ్రద్ధ చూపేలా   కృషిచేయాలి. అదే జరిగితే వారిలో దాగిఉన్న ప్రతిభ దానంతటదే బయటకు వస్తుంది.  అందుకే వారిని విద్యవైపు ఆకర్షితులను చేసేందుకు పలు బోధనోపకరణాలను తయారుచేస్తున్నాను. దీనిపై ఒక పుస్తకాన్ని రూపొందిస్తున్నాను.
– ఎం. మంగారాణి, నాగరాజా మున్సిపల్‌ స్కూలు, రాజమహేంద్రవరం
 
ప్రతిభను వెలికితీయాలి
 
ప్రతీ విద్యార్థిలోను నైపుణ్యం ఉంటుంది. దాన్ని వెలికితీయాలి. అప్పుడే వారు పురోగతి సాధిస్తారు. నూతన విధానాలతో విద్యాబోధన చేయాలనే తపనతో సొంతంగా బోధనోపకరణాలను తయారు చేసుకుంటూ వారికి విద్యాబోధన చేస్తున్నాను. ఇందులో భాగంగానే పలు ప్రాజెక్టులు, అంశాలను స్వయంగా వారితోనే చేయిస్తున్నాను. 
– నరేష్, వీరభద్రపురం మున్సిపల్‌ స్కూలు, రాజమహేంద్రవరం 
 
>
మరిన్ని వార్తలు