కళామతల్లిసేవలో అలుపెరుగని పయనం

3 Jun, 2017 22:45 IST|Sakshi
కళామతల్లిసేవలో అలుపెరుగని పయనం
సాంస్కృతిక వైభవానికి గోరుగంతు ప్రచారం
శ్రీరాధాకృష్ణ కళాక్షేత్ర ఆధ్వర్యంలో నేడు నిర్విరామ ప్రదర్శన
రాజమహేంద్రవరం కల్చరల్‌ : సంగీత స్వరకర్త, గాయకుడు, రచయిత, భరతనాట్య నిష్ణాతుడు గోరుగంతు నారాయణ. సుమారు 26 వసంతాలకు వెనుక, ఆయన ధవళేశ్వరంలో స్థాపించిన శ్రీరాధాకృష్ణ కళాక్షేత్ర విశ్వవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి, కళాభిమానుల ప్రశంసలు అందుకుంది. 1972లో రాజమహేంద్రిలో జన్మించిన గోరుగంతు నారాయణ సంగీతం, నాట్యం, వీణల్లో ఎంఏ కోర్సులు పూర్తి చేశాకా, హైదరాబాద్‌లోని త్యాగరాజ సంగీత నృత్యకళాశాలలో కొంతకాలం అసిస్టెంట్‌ లెక్చరర్‌గా పనిచేశారు. రాష్ట్రవిభజన అనంతర పరిస్థితుల్లో ఇమడలేక కళలకు కాణాచి అయిన రాజమహేంద్రికి వచ్చి స్థిరపడ్డారు. ఉద్యోగ విరమణ అనంతరం జిల్లాలోని ధవళేశ్వరంలో స్థాపించిన రాధాకృష్ణ కళాక్షేత్ర సంస్థపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు.
విద్యార్థుల ప్రతిభకు గీటురాళ్లు ఇవీ..
ప్రస్తుతం కళాక్షేత్రలో 143 మంది విద్యార్థులు గాత్రం, వీణ, కూచిపూడి, కీబోర్డు, లలిత సంగీతం రంగాల్లో శిక్షణ పొందుతున్నారు. కళాక్షేత్ర విద్యార్థిని లక్ష్మీదీపిక గతేడాది శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర చేతులమీదుగా ‘నాట్యవిశారద’ ఉగాది పురస్కారాన్ని , కర్నూలులో అభినయశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. విద్యార్థినులు కృష్ణసాహితి, సాయిముత్యలక్ష్మీశృతి నృత్యకిశోరం పురస్కారాలు అందుకున్నారు. యునెస్కో నిర్వహించిన అంతర్జాతీయ రంగ్‌ మహోత్సవ్‌లో లక్ష్మీదీపిక ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది. ఇక సంస్థ వ్యవస్థాపకుడు గోరుగంతు నారాయణ సైతం ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతి ఉమామహేశ్వరరావు చేతులమీదుగా ‘సంగీత, నాట్య వైణిక సుధాకర’బిరుదు అందుకున్నారు. నారాయణ అర్ధాంగి ఉమాజయశ్రీ కూడా నాట్యంలో అందెవేసిన చేయి కావడంతో నటరాజ కళామందిరం నుంచి అభినయ గురుశ్రీ పురస్కారం అందుకున్నారు.
నేడు నిర్విరామ సప్త నృత్యరూపక ప్రదర్శన
గోరుగంతు రచించిన సప్త నృత్యరూపకాల ప్రదర్శన ఆదివారం ఆనం కళాకేంద్రంలో– ఒకే ఆహార్యంతో ఉన్న 63మంది సాంప్రదాయ కళాకారులతో నిర్వహించనున్నారు. ఉదయం 6.30 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన శిల్పి రాజకుమార్‌ ఉడయార్‌ జ్యోతి ప్రజ్వలనతో ప్రదర్శన ప్రారంభమై రాత్రి ఏడు గంటల వరకు కొనసాగనుంది. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో నమోదుకు ప్రాథమిక అంగీకారం ఇప్పటికే ఈ ప్రదర్శనకు వచ్చింది. తెలుగు బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సు, వండర్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు, జీనియస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సు ప్రతినిధులు పర్యవేక్షకులుగా హాజరుకానున్నారు. ఈ రికార్డులను కూడా సొంతం చేసుకోగలమన్న ఆశాభావాన్ని నిర్వాహకులు వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమానికి సినీ నటి కిన్నెర ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు.
మరిన్ని వార్తలు