-

షరతులపై ఉచితంగా గోశాల గిత్తదూడలు

20 Feb, 2017 23:10 IST|Sakshi
షరతులపై ఉచితంగా గోశాల గిత్తదూడలు
-సోమవారం తొమ్మిది జతలు రైతులకు అందజేత
-సరిగా సాకకపోతే దేవస్థానం స్వాధీనం చేసుకునే అవకాశం
అన్నవరం :రత్నగిరి దిగువన దేవస్థానం గోశాలలో గల గిత్తదూడలను రైతులకు ఉచితంగా అందచేస్తున్నారు. సోమవారం తొమ్మిది జతల దూడలను వివిద గ్రామాల రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు విలేకరులతో మాట్లాడుతూ   ప్రస్తుతం గోశాలలో ఉన్న 12 జతల గిత్త దూడలను తీసుకువెళ్లేందుకు దరఖాస్తులు కోరగా 11 మంది రైతులు ధరఖాస్తు చేసుకున్నారని, వారిలో తొమ్మిది మందిని ఎంపిక చేసి అందజేశామని తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం ఈ విధంగా కొన్ని గిత్తదూడలను రైతులకు ఇవ్వగా తిరిగి ఇప్పుడు ఇచ్చామని తెలిపారు. ఏఈఓ సాయిబాబా, గోశాల సిబ్బంది పాల్గొన్నారు.
 ఇవీ షరతులు..
 దూడలను తీసుకువెళ్లే వ్యక్తి చిరునామా తదితర వివరాలతో పాటు దేవస్థానం పెట్టిన షరతులన్నీ పాటిస్తానని స్టాంప్‌ పేపర్‌ మీద సంతకం చేసి దానిని నోటరీ చేయించి దేవస్థానానికి ఇవ్వాలి. దూడలను తీసుకునే రైతులు ఆరు నెలలకొకసారి వాటిని దేవస్థానం అధికారులకు చూపాలి. దూడలను సరిగా చూస్తున్నారో లేదో అని దేవస్థానం సిబ్బందికి అనుమానం వస్తే ఆకస్మికంగా తనిఖీ చేస్తారు. వాటిని సరిగా మేపకపోతే దేవస్థానం వాటిని స్వాధీనం చేసుకుంటుంది. దూడను కబేళాకు తరలించడం వంటివి చేస్తే ‘గోసంరక్షణ చట్టం’ ప్రకారం దేవస్థానం అధికారులు కేసు పెడతారు. ఈ షరతులన్నింటికీ అంగీకరిస్తేనే గిత్త దూడలను అందజేస్తారు.
మరిన్ని వార్తలు