గొట్టిపాటి వర్సెస్‌ కరణం

4 Aug, 2016 01:32 IST|Sakshi
gottipati
 
సాక్షి ప్రతినిధి, ఒంగోలు :
–   కయ్యానికి కాలు దువ్వుతున్న ఇరువర్గాలు
–ఉద్రిక్తతకు దారితీసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం
– షామియానాలు వేయించిన ఎమ్మెల్యే గొట్టిపాటి
–వాటిని కూల్చివేయించిన మాజీ ఎంపీ కరణం
– వందలాదిగా పోలీసు బలగాల మోహరింపు
– ఆధిపత్య పోరుకు వేదికగా మారిన ఎంపీడీవో కార్యాలయం 
–  బెంబేలెత్తిన బల్లికురవ ప్రజలు
–  ఉదయం నుంచే వాణిజ్యసముదాయాలు మూత 
 
 
అద్దంకి టీడీపీలో వర్గవిబేధాలు మరోమారు భగ్గుమన్నాయి. కరణం, గొట్టిపాటి వర్గాలు సై అంటే సై అంటున్నాయి. అదును దొరికితే కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. దీంతో నియోజకవర్గంలో తర చూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా బుధవారం మండల కేంద్రం బల్లికురవ వేదికగా వీరిరువురూ గొడవకు సిద్ధపడ్డారు. దీంతో స్థానికులు బెంబేలెత్తిపోయి దుకాణాలు సైతం మూసి వేయడంతో కర్ఫ్యూ వాతావరణం తలపించింది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించడంతో ఎట్టకేలకు గొడవ సద్దుమణిగింది.
 
 
టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ కరణం బలరామకృష్ణమూర్తి, ఫిరాయింపు ఎమ్మెల్యే గొట్టిపాటి వర్గాలు పింఛన్ల పంపిణీ కార్యక్రమం వేదికగా గొడవకు దిగారు. అద్దంకి నియోజకవర్గానికి సంబంధించి 2,600 పైచిలుకు పింఛన్లు కావాలంటూ ఎమ్మెల్యే గొట్టిపాటి చినబాబు లోకేష్‌ కు విన్నవించగా మూడు వేల పింఛన్లు కావాలంటూ ఇదివరకే కరణం సైతం దరఖాస్తులు పెట్టారు. తాజాగా 2,800 ఫించన్లు నియోజకవర్గానికి మంజూరయ్యాయి. పింఛన్లు తానే మంజూరు చేయించానని చెప్పిన గొట్టిపాటి బుధవారం బల్లికురవ ఎంపీడీవో  కార్యాలయంలో పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో ఎమ్మెల్యే వర్గీయులు  కార్యాలయ ఆవరణలో షామియానాలు వేశారు. విషయం తెలుసుకున్న కరణం, ఆయన తనయుడు వెంకటేశ్‌లు ఉదయం 10 గంటలకే బల్లికురవ ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. షామియానాలు ఎందుకేశారంటూ ఎంపీడీవోను ప్రశ్నించారు. తనకు తెలియదంటూ ఎంపీడీవో తప్పించుకున్నారు. ఎమ్మెల్యే పింఛన్లు పంచుతున్నారంటూ కరణం వర్గీయుల ఆయన దృష్టికి తెచ్చారు. పింఛన్లు తాను కూడా మంజూరు చేయించానని, అధికారులు పంపిణీ చేయాలి కానీ ఎమ్మెల్యే పంపిణీ చేయడమేంటంటూ ఆగ్రహించిన కరణం షామినాయాలు తీసివేయాలంటూ ఆదేశించారు. అంతే అక్కడున్న ఆయన వర్గీయులు షామియాయాలు పీకివేశారు. అనంతరం నాగార్జున సాగర్‌ నీటి విడుదల నేపథ్యంలో నీటి వాడకంపై కరణం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష ప్రారంభించారు. 
అడకత్తెరలో అధికారి.. 
పింఛన్లు పంపిణీ చేసేందుకు 10.30 గంటల సమయంలో ఎమ్మెల్యే గొట్టిపాటి బల్లికురవ ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే షామియానాలు కింద పడవేసి ఉండటంతో విషయం ఆరా తీశారు. కరణం వర్గీయులు పీకివేశారంటూ తెలిసి, ఆగ్రహించిన ఆయన ఎంపీడీఓకు ఫోన్‌ చేసి షామియానాలు ఎందుకు పీకివేశారంటూ ప్రశ్నించారు. ఎంపీడీఓ తనకు తెలియదని చెప్పాడు. పింఛన్లు పంపిణీ చేద్దామని ఎమ్మెల్యే కోరగా తనను వదిలివేయాలంటూ ఓ మొక్కు మొక్కి కార్యాలయంలో జరుగుతున్న కరణం సమీక్షకు హాజరయ్యారు. అప్పటికే అక్కడ వెయ్యి మందికిపైగా కరణం వర్గీయులు ఉండగా, గొట్టిపాటి వర్గీయులు సైతం పెద్ద ఎత్తున పోగయ్యారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ నిమిషంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
బల్లికురవలో కర్ఫ్యూ వాతావరణం..
నేతల మధ్య గొడవ చూసి బెంబేలెత్తిపోయిన బల్లికురవ వాసులు ఉదయం నుంచే వాణిజ్యసముదాయాలు మూసివేశారు. దీంతో బల్లికురవ బంద్‌ను తలపించింది. అటు కరణం, ఇటు గొట్టిపాటిలు బల్లికురవ వస్తుండటంతో ముందే జాగ్రత్తపడ్డ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒంగోలు, దర్శి డీఎస్పీలు శ్రీనివాసరావు, శ్రీరాంబాబుల నేతృత్వంలో ఒంగోలు, దర్శి, అద్దంకి సీఐలు, ఎస్‌ఐలతో పాటు 200 మందికిపైగా పోలీస్‌ బలగాలు బల్లికురవలో మోహరించాయి. 
పారీ నేతలకు గొట్టిపాటి ఫిర్యాదు..
తన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో ఆగ్రహించిన గొట్టిపాటి టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, మంత్రి శిద్దా రాఘవరావు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి రావెల కిషోర్‌బాబు, చినబాబు లోకేష్, నీటి పారుదలశాఖ మంత్రి దేవినేని ఉమలకు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గొడవకు దిగకుండా సర్దుకుపోవాలని, త్వరలోనే అన్ని సర్దుకుంటాయని చినబాబు లోకేష్‌తో పాటు మిగిలిన నేతలు గొట్టిపాటికి నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. దీంతో చేసేదేమి లేక ఎమ్మెల్యే గొట్టిపాటి ఓ ఐదు మందికి తన సొంత డబ్బులు వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ చేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. అనంతరం కరణం ఒంటి గంట వరకు అధికారులతో సమీక్ష నిర్వహించారు. గొట్టిపాటి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కరణం అక్కడే మకాం వేసి అధికారులతో సమీక్షను మొదలుపెట్టారన్న ప్రచారం సాగిం ది. ఎట్టకేలకు పోలీస్‌ బలగాల మోహరింపుతో గొడవ సద్దుమణగడంతో బల్లికురవ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
మరిన్ని వార్తలు