తడ‘బడి’..!

26 Mar, 2016 01:47 IST|Sakshi
తడ‘బడి’..!

నిలకడలేని  విద్యాశాఖ నిర్ణయాలు
పూటకోమాట.. రోజుకో బాట
నీరుగారుతున్న చదువులు
కొత్త విద్యాసంవత్సరంపై అస్పష్టత
గందరగోళంలో విద్యార్థులు

పాపన్నపేట: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంపై సర్కార్ తడబడుతోంది. నిలకడలేని నిర్ణయాలతో చదువులను నీరుగారుస్తోంది. పూటకోమాట.. రోజుకోబాట అన్నట్టుంది విద్యాశాఖ తీరు. ఈనెల 21 నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రకటించిన ప్రభుత్వం మళ్లీ పాత విధానాన్ని అమలు చేసేందుకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఒంటిపూట బడుల రద్దు, పదోతరగతి పరీక్షల్లో సీసీ కెమెరాల వినియోగం తదితర నిర్ణయాలు తీసుకోవడం.. ఆ వెంటనే ఆ నిర్ణయాలను ఉపసంహరించుకోవడం పరిపాటిగా మారింది. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో.. ఏది అమలవుతుందో.. తెలియని గందరగోళ పరిస్థితిని విద్యార్థులు, పోషకులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నారు.

 మెరుగైన విద్యను అందిస్తూ సర్కార్ బడులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ఆ వెంటనే వాటిని అమలు చేయడానికి తడబడుతోంది. కొత్త నిర్ణయాలను వెనక్కి తీసుకుంటూ అబాసుపాలవుతోంది. సీబీఎస్‌ఈ తరహాలో ఈసారి మార్చి 21 నుంచే కొత్త విద్యాసంవత్సరాన్ని ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకనుగుణంగా మార్చి 8 నుంచి 15 వరకు 6 నుంచి 9 తరగతుల వరకు పరీక్షలు నిర్వహించింది. 20వ తేదీ వరకు జవాబు పత్రాల మూల్యాంకనం చేసి, వాటిని విద్యార్థుల తల్లిదండ్రులకు చూపి, ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వాలని ఆదేశించింది. ఆ తరువాత విద్యార్థులను పై తరగతికి పంపి మార్చి 21 నుంచి ఏప్రిల్ 23 వరకు పైతరగతి పాఠ్యంశాలు బోధించాలని నిర్ణయించింది. ఇంత తక్కువ సమయంలో మొత్తం పాఠ్యపుస్తకాలు సరఫరా అయ్యే అవకాశం లేనందున పైతరగతి విద్యార్థుల పాఠ్యపుస్తకాలను సేకరించి కింది తరగతుల వారికి అందించాలని సూచించింది. ఈ క్రమంలో అంగన్‌వాడీ  పిల్లలను ప్రాథమిక పాఠశాలలో, ఐదోతరగతి పిల్లలను ఆరోతరగతిలో, ఏడోతరగతి వారిని ఎనిమిదో తరగతిలో చేర్పించాలని ఆదేశించింది. ఈ సమయంలో ఏప్రిల్ 23 వరకు బడులు రెండు పూటలా నడపాలని కార్యాచరణలో పేర్కొంది.

కొండెక్కిన సరికొత్త ఆలోచన...
ఈ సారికి కొత్త విద్యాసంవత్సరం జూన్ 12 నుంచేనని తాజాగా ఆదేశాలు జారీ కావడంతో అంతా గందరగోళం నెలకొంది. జిల్లాలో సుమారు 2,800 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇప్పటికే ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించిన ఉపాధ్యాయులు ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే కొత్త నిర్ణయంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ప్రైవేటు పాఠశాలల పుస్తకాలు ముద్రణ కాకపోవడం వల్లే, వారి కోసం విద్యాసంవత్సరాన్ని పాత పద్ధతినే అనుసరిస్తున్నారని పలు ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎండలు బాగా ఉన్నందున రెండు పూటలా బడులు నడపొద్దని, జూన్ 12 నుంచే కొత్త విద్యాసంవత్సరాన్ని ప్రారంభించాలని  మరి కొన్ని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత పాఠ్యపుస్తకాలు కొన్ని వచ్చినందున ఈ పుస్తకాలు చెప్పాలని, విద్యార్థులకు కనీస బేసిక్స్ నేర్పాలా? అనే విషయమై అధికారికంగా ఇంకా ఎలాంటి ఉత్తర్వులు వెలువడ లేదని ఉపాధ్యాయులు అంటున్నారు.  మొత్తమ్మీద ఏప్రిల్ 23 వరకు ఉన ్న పని దినాలను వినియోగించి, విద్యార్థులకు ఉపయోగపడేలా మలుస్తూ ఉత్తర్వులు జారీ చేస్తే బాగుంటుందని  అభిప్రాయపడుతున్నారు.

>
మరిన్ని వార్తలు