దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో ఉండటం తప్పు

1 Apr, 2017 18:16 IST|Sakshi
దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో ఉండటం తప్పు
ఉండి: దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో ఉండటం చాలా పెద్ద తప్పని దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అభిప్రాయపడ్డారు. మాజీ ఎమ్మెల్యే, జిల్లా రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు సొంత నిధులు రూ.కోటి ఖర్చుతో నిర్మించిన శివాలయం రాజగోపురం, కలశస్థాపన కార్యక్రమాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ నటుడు తనికెళ్ళ భరణి స్వామికి అభిషేకాలు నిర్వహించారు. ముఖ్య అతిథి పాల్గొన్న మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ దేవాలయాలు దేవుడి సొత్తని, దానిపై ప్రభుత్వ అజమాయిషీ తగదని అన్నారు. తనే స్వయంగా నిర్మించిన ఒక దేవాలయ కమిటీ అధికారులతో కుమ్మక్సై 10 ఎకరాలు అమ్ముకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అటువంటి నాయకులపై వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. నాయకులు దేవాలయాలను కేంద్రంగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆలయాల పునఃనిర్మాణంలో ప్రజలు, దాతలు పాలుపంచుకోవాలని పిలుపు నిచ్చారు. రంగనాథరాజు సుమారు రూ.కోటి సొంత ఖర్చుతో ఇంతటి గొప్ప కార్యం చేయడం అభినందనీయమన్నారు. ఆలయ «నిర్వాహకుడు రంగనాథరాజు మాట్లాడుతూ ఎంత సంపాదించినా కలగని ప్రశాంతత దైవభక్తితో సమకూరుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సినీ నటుడు తనికెళ్ల భరణిని బంగారు కంకణంతో, ప్రముఖ గజల్స్‌ గాయకుడు గజల్‌ శ్రీనివాస్, శతావధాని కోటలక్ష్మీనరసింహంలను బంగారు గొలుసులతోనూ మంత్రి మాణిక్యాలరావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందరరావు తదితరులు పాల్గొన్నారు.
 
అంతా శివోహం..  జగమంతా శివోహం.19 ఏళ్ల నుంచి నాటకరంగంపై మక్కువతో ఇంకా ప్రదర్శనలిస్తున్నాను. ఆధ్యాత్మికతపై మక్కువతో శివ భక్తుడిగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాను. మా పూర్వీకులు యండగంగి వాస్తవ్యులు కావడం, తెలుగు జాతి గర్వించదగ్గ కవులు కావడం నాకు చాలా ఆనందం. -తనికెళ్ల భరణి,  సినీ నటుడు
సంస్క​ృతీ సంప్రదాయాలు కాపాడాలి
దేశంలో చాలా వరకు హిందూ దేవాలయాలు పాడుపడ్డ స్థితిలో ఉన్నాయి. వాటి పునఃనిర్మాణానికి ప్రజలు, దాతలు ,ప్రభుత్వం ముందుకు రావాలి. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాలి. అలాగే పెద్దపెద్ద చదువులు చదివిన వారంతా విదేశాల బాటపట్టి భారతదేశంలో హిందుత్వానికి దూరమవుతున్నా. అలాంటి వారంతా దేవాలయాల అభివృద్ధికి సాయమందించాలి. నిర్మించిన ఆలయాలను ఆయా గ్రామాల ప్రజలంతా కాపాడుకోవాలి.-గజల్‌ శ్రీనివాస్, గజల్‌ గాయకుడు
 
 
 
మరిన్ని వార్తలు