సహ‘కారం’!

26 Sep, 2016 00:17 IST|Sakshi
చిత్తూరులోని సహకార చక్కెర కర్మాగారం
– ఆదరణ లేని కో–ఆపరేటివ్‌ సొసైటీలు
– వెలవెలబోతున్న చక్కెర ఫ్యాక్టరీలు
– తెరుచుకోని విజయా డెయిరీ
– దిక్కుతోచని స్థితిలో ఉద్యోగులు, రైతులు
– మూతపడ్డ వాటిని తెరిపించాలని వేడుకోలు
 
ఉపకారికి నుపకారం నెపమెన్నకు చేయువాడే నేర్పరి సుమతీ.. అన్నాడో కవి. 
కానీ అది నాటి మాట. ఇప్పుడు.. కాలం మారింది.
ఉపకారికి అపకారం వెనువెంటనే చేయువాడే సర్వోత్తముడు సుమతీ.. అంటున్నారీ పాలకులు..
 పదిమందికీ అన్నంపెట్టి.. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే సహకార సంస్థలను పూర్తిగా గాలికొదిలేశారు. చిల్లిగవ్వ విదల్చకుండా నీరుగార్చేశారు. ఫలితంగా అనేక సంస్థలు మూతపడ్డాయి. వాటిపై ఆధారపడ్డ ఉద్యోగులు, రైతులు రోడ్డున పడి విలవిల్లాడుతున్నారు. వీరి గోడు పట్టించుకునే నాథుడే లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. 
 
సాక్షి, చిత్తూరు : జిల్లాలో సహకార సంస్థలు వెలవెలబోతున్నాయి. చిత్తూరులోని విజయా డెయిరీ, చక్కెర కర్మాగారం మూతపడింది. రేణిగుంటలోని షుగర్‌ ఫ్యాక్టరీలో క్రషింగ్‌ ఆగిపోయింది. వీటిపై ఆధారపడ్డ వారు ఏ ఆధారం లేక పస్తులతో బక్కచిక్కి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
విజయా..లే‘దయ’
దేశంలో రెండో అతిపెద్ద సహకార సంస్థ విజయా డెయిరీ. రోజూ 20 లక్షల లీటర్ల పాలసేకరణ సామర్థ్యం దీని సొంతం. 1960ల్లో దక్షిణ భారత దేశంలోనే ఏకైక చిల్లింగ్‌ యూనిట్‌. ఈ డెయిరీ నుంచే టీటీడీకి పెద్ద ఎత్తున నెయ్యి సరఫరా అయ్యేది. పాల మిగులు ఎక్కువగా ఉందనే ఒకేఒక్క కారణంతో వారంలో ఒకరోజు రైతుల దగ్గర నుంచి పాల సేకరణ ఆపేయాలని సంస్థ నిర్ణయించింది. ఆ నిర్ణయం వెనుక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోద్భలం ఉందనే ఆరోపణలు ఇప్పటికీ విన్పిస్తున్నాయి. మొదట్లో ప్రైవేటు డెయిరీలకు పాలు పోయడానికి రైతులు ఇష్టపడేవారు కాదు. వారంలో ఒక రోజు విజయా డెయిరీ సెలవు ప్రకటించడం, డబ్బులు కూడా సరిగా చెల్లించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో వాటి వైపు మొగ్గు చూపారు. అప్పటి నుంచి ఆర్థికంగా డెయిరీ పతనావస్థకు చేరింది. ఈ నిర్ణయం డెయిరీని మూతవేత దిశగా నడిపించింది. 2001 ఆగస్టులో ఈ డెయిరీ మూతపడింది. ఈ సంస్థపై ఆధారపడ్డ లక్షలాది మంది రైతులు ఇబ్బందులకు గురయ్యారు. డెయిరీలో పనిచేసే 500 మంది కార్మికులు రోడ్డునపడ్డారు. తన సొంత డెయిరీ ప్రయోజనాల కోసం చంద్రబాబు విజయ డెయిరీపై దెబ్బ కొట్టారని జిల్లా ప్రజలు బహిరంగంగా దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రస్తుతం రైతులకు ప్రైవేటు డైయిరీలే ఆధారమయ్యాయి. వారిచ్చే అరకొర ధరతోనే నెట్టుకురావాల్సి వస్తోంది. చిత్తూరులోని విజయా డైయిరీ మూతపడిన తర్వాత దాని ఆలనాపాలన అధికారులు పట్టించుకోకవపోవడంతో విలువైన యంత్ర సామగ్రి దొంగలపాలవుతోంది. కలెక్టరేట్‌కు అతి సమీపంలో ఉన్న ఈ కర్మాగారానికి చెందిన 40 ఎకరాల భూమిపై ప్రభుత్వ పెద్దల కన్నుపడింది. చరిత్రలో కలిసిపోయేందుకు ఈ డైయిరీ సిద్ధంగా ఉంది.
చక్కెర ఫ్యాక్టరీలదీ అదే పరిస్థితి
ప్రైవేటు ఆధీనంలో ఉన్న జిల్లాలోని ఇతర చక్కెర కర్మాగారాలు లాభాల బాటలో పయనిస్తోంటే.. రేణిగుంటలోని వేంకటేశ్వర, చిత్తూరులోని సహకార చక్కెర ఫ్యాక్టరీలు కాలక్రమంలో కొత్త యంత్రాలు అమర్చుకోలేక, ప్రభుత్వం సహాయ నిరాకరణతో చతికిలపడ్డాయి. ఎలాంటి సాంకేతిక సమస్యా లేకపోయినా క్రషింగ్‌ను నిలిపేయడంతో నష్టాలు చుట్టుముట్టాయి. రైతుల బకాయిలు చెల్లించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. చిత్తూరు ఫ్యాక్టరీలో అయితే 32 నెలల నుంచి జీతాలు రాకపోవడంతో ఉద్యోగులు ఆర్థికంగా చితికిపోయారు. తినడానికి తిండి కూడా లేని దయనీయ స్థితిలో కొంత మంది ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారు. రైతులు, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.20 కోట్ల మేర ఉన్నాయి. 
ఇప్పుడైనా మేలుకోవాలి..
ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకోవాలని రైతులు, ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. విజయా డెయిరీతోపాటు మిగిలిన చెక్కర ఫ్యాక్టరీలను తెరిపించేందుకు ప్రభుత్వం చొరవచూపాలని వారు కోరుతున్నారు. ఫ్యాక్టరీ ఆధునికీకరణకు రూ.50 కోట్లు వెచ్చిస్తే సరిపోతుందని చెబుతున్నారు. ప్రభుత్వానికి ఇది చాలా చిన్న మొత్తం అని వారు పేర్కొంటున్నారు. 
 
20సీటీఆర్‌51.. 
మరిన్ని వార్తలు