'మేలు జరిగేలా ప్రభుత్వ చర్యలు ఉండాలి'

29 Sep, 2015 13:00 IST|Sakshi
'మేలు జరిగేలా ప్రభుత్వ చర్యలు ఉండాలి'

హైదరాబాద్: రైతులకు మేలు జరిగేలా ప్రభుత్వ చర్యలు ఉండాలని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. గత ప్రభుత్వాల పాలనలో కూడా రైతు ఆత్మహత్యలు జరిగాయని, అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఆ విషయంలో ప్రత్యారోపణలకు పోకుండా ఆత్మహత్యలు నివారించే చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతుల ఆత్మహత్యల అంశంపై మంగళవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా పాయం మాట్లాడారు. సరైన వర్షాలు లేక రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారని, మనోధైర్యం కోల్పోయారని చెప్పారు. ప్రభుత్వం వారికి భరోసాగా ఉండాలని చెప్పారు.

రాష్ట్రంలో 400కు పైగా కరువు మండలాలు ఉన్నా.. వాటి గురించి కేంద్రానికి నివేదించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చెప్పారు. కరువు మండలాల ప్రకటన విషయంలో నిర్లక్ష్యం తగదని హితవు పలికారు. ఇక పంటల బీమా విషయంలో మరింత ఉదారంగా ఉండాలని, వారికి చెల్లించే బీమా ప్రస్తుతం రుణంలో 50శాతం ఉందని, దానిని 75శాతం పెంచాలని కోరారు. బీమా చెల్లిస్తే డబ్బు తిరిగి రాదనే భావన రైతుల్లో ఉందని, అందుకే పంటల బీమాకు వెనుకాడుతున్నారని చెప్పారు. ఇక ఎరువుల నిల్వకు, పంట నిల్వలకు గోదాముల కరువు తీవ్రంగా ఉందని తెలిపారు.

రాష్ట్రంలో భూసార పరీక్ష కేంద్రాలు నాలుగు ఉండగా అందులో రెండే పనిచేస్తున్నాయని, వాటికి పరీక్షల కోసం మట్టిని పంపిస్తే సరైన సమయంలో నివేదిక రావడం లేదని తెలిపారు. గ్రామంలో విత్తన ఉత్పత్తి చేస్తే రైతులు నమ్మడం లేదని, అందుకే గ్రామంలో శుద్ధి చేసిన విత్తనాలను ప్రభుత్వమే కొనుగోలు చేసి మార్కెట్లో విక్రయిస్తే రైతులకు భరోసాగా ఉంటుందని తెలిపారు. స్వామినాథన్ కమిటీతోపాటు పలు కమిటీలు చేసిన సిఫారసులు గమనించి అమలు చేయాలని, ఆత్మహత్యలు నివారించాలని కోరారు.

 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు