ఆలయ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు

10 Oct, 2016 20:47 IST|Sakshi

- దేవాదాయ శాఖలో దసరా కానుక
- 16 వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం


అమరావతి : ఆలయాల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతూ దేవాదాయ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ ఆధీనంలో 24,507 ఆలయాలు, సత్రాలు, మఠాలు ఉన్నాయి. దాదాపు 16 వేల మంది ఆయా ఆలయాల్లో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఆలయాల్లో పనిచేసే ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం ఉండదు.

ఆయా ఆలయాలకు వచ్చే ఆదాయం నుంచే వారికి జీతభత్యాలు చెల్లింపులు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెరిగినప్పటికీ, ఆలయ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు ఇప్పటి వరకు 58 ఏళ్లే అమలవుతోంది. ఇప్పుడు ఆలయ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచుతూ దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ జీవో నెంబరు 444ను జారీ చేశారు.

డిసెంబరు 1న విజయవాడకు దేవాదాయ శాఖ కమిషనరేట్
ఆంధ్రపద్రేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం డిసెంబరు 1వ తేదీ నుంచి విజయవాడ కేంద్రంగా పనిచేయనుంది. జూన్ 27వ తేదీ నుంచే దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల కమిషనరేట్ కార్యాలయాలు కొత్త రాజధాని అమరావతి ప్రాంతానికి తరలిరాగా, దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి శాశ్వత భవన నిర్మాణ పనులు మధ్యలో ఉన్న కారణంగా ఈ కార్యాలయం ప్రస్తుతం హైదరాబాద్ నుంచే పనిచేస్తోంది. డిసెంబరు 1న కార్యాలయం హైదరాబాద్ నుంచి విజయవాడకు సమీపంలోని గొల్లపూడిలోని శాశ్వత భవనానికి తరలించనున్నారు. కాగా, దేవాదాయ శాఖ మంత్రి పి. మాణిక్యాలరావు ఈ నెల 12వ తేదీ నుంచి వెలగపూడి సచివాలయ కేంద్రంగా కార్యకలాపాలు మొదలుపెట్టనున్నారు.

మరిన్ని వార్తలు