వైద్యులు వచ్చేస్తున్నారు..

4 Mar, 2017 22:47 IST|Sakshi
వైద్యులు వచ్చేస్తున్నారు..

► పోస్టుల భర్తీకి ప్రభుత్వం సుముఖత
► జిల్లాలోని పీహెచ్‌సీల్లో 14 పోస్టులు ఖాళీ
► రిమ్స్‌ వైద్య కళాశాలలో  అదే పరిస్థితి
► వైద్యుల భర్తీతో సేవలు మెరుగు


ఆదిలాబాద్‌ :  ఆదిలాబాద్‌ జిల్లాలో వైద్యుల కొరతతో ప్రజలకు వైద్య సేవలు అందడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పీహెచ్‌లతో పాటు జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆస్పత్రిలో సైతం వైద్యులు లేక ఇబ్బందులు పడుతున్నారు. సరైన వైద్య సేవలు అందక రోగులు హైదరాబాద్, మహారాష్ట్ర ప్రాంతాలకు వెళ్తున్నారు. వర్షాకాలంలో వ్యాధుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో సరిపడా వైద్యులు, సిబ్బంది లేక చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ప్రభుత్వం వైద్యులను నియమించేందుకు ప్రక్రియ ప్రారంభించడంతో జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 2118 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. ఈ పోస్టులు భర్తీ చేసేందుకు త్వరలో పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్యుల పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఫైల్‌పై సంతకం చేశారు. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వరి తివారికి పంపించారు. ఆయన సంతకం చేసి టీఎస్సీపీఎస్సీకి పంపిస్తారు. ఈ నేపథ్యంలో టీఎస్సీపీఎస్సీ నిర్ణయంతో త్వరలో ఈ పోస్టులకు భర్తీ కానున్నాయి. దీంతో జిల్లాలోని వైద్యుల పోస్టులతో పాటు, రిమ్స్‌ మెడికల్‌ కళాశాలలో సైతం పోస్టులకు మోక్షం కలగనుంది.

జిల్లాలో అందని సేవలు..
జిల్లాల పునర్విభజన తర్వాత ఆదిలాబాద్‌ జిల్లాలోని వైద్యశాఖలో ఖాళీల కొరత వేధిస్తోంది. వైద్యులతో పాటు, సిబ్బంది కొరతతో వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో విషజ్వరాలు, మలేరియా, డెంగ్యు, రక్తహీనత వంటి వ్యాధులతో ప్రతి ఏడాది ఎంతో మంది చనిపోతున్నారు. వైద్యశాఖలో ఖాళీలు భర్తీ చేయకుండా జాప్యం చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆదిలాబాద్‌లో 22 పీహెచ్‌సీల పరిధిలో మొత్తం 14 వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

వైద్యాధికారుల పోస్టులతో పాటు నర్సులు, ఏఎన్ ఎంలు, ఫిజియోథెరఫిస్టులు, ల్యాబ్‌టెక్నీషియన్ లు, ప్రజారోగ్య సహాయకులు, తదితర పోస్టులు సుమారు 100 వరకు ఖాళీగా ఉన్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా వైద్య సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. చిన్నచిన్న విషయాలకు కూడా రిమ్స్‌కు రావడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం ప్రభుత్వ వైద్యుల భర్తీ ప్రక్రియ చేపట్టడంతో సిబ్బంది పోస్టులు కూడా భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది.

రిమ్స్‌లోనూ అదే పరిస్థితి..
జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆస్పత్రిలో వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వైద్య విద్యా సంచాలకుల పరిధిలో సైతం పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 125 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, 65 ట్యూటర్లు, 150 సివిల్‌ సర్జన్ లు, 10 డెంటల్‌ సర్జన్ ల పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు.

దీంతో జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్, ట్యూటర్‌లను నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం రిమ్స్‌లో 151 పోస్టులకు గాను ఇద్దరు ప్రొఫెసర్లు, 21 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 20 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లు, 50 మంది ట్యూటర్లు సేవలందిస్తున్నారు. ఇంకా 58 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ప్రొఫెసర్‌లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ప్రభుత్వం భర్తీ ప్రక్రియ ప్రారంభించడంతో రిమ్స్‌లో ఖాళీలు భర్తీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

సేవలు మెరుగుపడుతాయి..
ప్రస్తుతం పీహెచ్‌సీల్లో ఉన్న వైద్య పోస్టులు భర్తీ చేయడం వల్ల వైద్య సేవలు మరింత మెరుగుపడుతాయి. కొన్ని పీహెచ్‌సీల్లో రెండు వైద్య పోస్టులకు ఒక్కోటి మాత్రమే భర్తీ చేశారు. వాటితో పాటు మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇతర సిబ్బందిని సైతం నియమిస్తే బాగుటుంది.

– సాధన, అడిషనల్‌ డీఎంహెచ్‌వో

మరిన్ని వార్తలు